
సాక్షి, హైదరాబాద్: జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్నార్సీ)కి నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘జాతీయ నిరుద్యోగ రిజిస్టర్ (ఎన్‌యూఆర్) ప్రక్రియను ప్రారంభించారు. తమకు కావాల్సింది ఉద్యోగాలు మాత్రమేనని ఎన్నార్సీ కాదని గురువారం గాంధీభవన్‌లో నిరుద్యోగ పట్టభద్రులు తమ నిరసన వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కార్యదర్శి గురజాల వెంకట్‌ల ఆధ్వర్యంలో ఇడ్లీలు, చాయ్‌లు అమ్ముతూ, చెప్పులు కుడుతూ, టైర్లు రిపేర్ చేస్తూ ఎన్నార్సీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన ప్రధాని మోదీ నిరుద్యోగులను మోసం చేశారని, ఇప్పటికైనా తమకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జాతీయ నిరుద్యోగ రిజిస్టర్ తయారీ కోసం జాతీయ యువజన కాంగ్రెస్ నిర్వహిస్తున్న మిస్డ్ కాల్ క్యాంపెయిన్‌ను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ రిజిస్టర్‌లో పేరు నమోదు చేసుకునేందుకు రాష్ట్రంలోని నిరుద్యోగులు 81519 94411 నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వాలని అనిల్‌కుమార్ యాదవ్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment