రాజుకున్న రాజకీయ సెగ!
మెదక్ ఉప ఎన్నిక నేపథ్యంలో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. మెదక్ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నాయకులు తమ నోటికి పనిచెబుతున్నారు. పరస్పర విమర్శనాస్త్రాలు, ఆరోపణలతో రాజకీయ వాతావరణంలో సెగ రాజేశారు. నువ్వొకటంటే నేను రెండంట తీరుగా తిట్టుకుంటున్నారు.
మెదక్ బరిలో నిలిచిన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ ప్రత్యర్థులపై మాటల దాడులు ఆరంభించారు. బీజేపీ, టీడీపీ నాయకులను మంత్రి నాయిని నరసింహారెడ్డి ఏకిపారేశారు. జగ్గారెడ్డి సన్యాసి, రేవంత్ రెడ్డి ఒక బచ్చా అంటూ తనదైన శైలిలో ధ్వజమెత్తారు. పార్టీలో సభ్యత్వం లేని జగ్గారెడ్డికి టికెట్ ఎలా ఇచ్చారని ఎంపీ కవిత ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ను తెలంగాణ ప్రజలు ఇప్పటికే బండకేసి కొట్టారని అన్నారు.
అద్వానీ వంటి వారిని వెళ్లగొట్టి జగ్గారెడ్డి లాంటి వాళ్లను బీజేపీలో చేర్చకుంటున్నారని హరీష్రావు ఎద్దేవాచేశారు. అభ్యర్థి దొరక్కే జగ్గారెడ్డిని నిలబెట్టారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎత్తిపొడిచారు. బీజేపీ దిగజారుడుతనానికి ఇది నిదర్శమంటూ కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు- టీఆర్ఎస్ నేతలతో శృతి కలిపారు. కేసీఆర్, కేటీఆర్ వందల కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్రారోపణలు చేశారు.
కేసీఆర్ కు కరెక్ట్ మొగుణ్ని తానేనంటూ టీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి. గత జనరల్ ఎన్నికల్లో పార్టీన మారిన కొండా సురేఖ, మైనంపల్లి హన్మంతరావుకు టీఆర్‌ఎస్ టికెట్లు ఎలా ఇచ్చారని లాజిక్ లాగారు. జగ్గారెడ్డి పార్టీ మారినంత మాత్రాన కాంగ్రెస్‌కు వచ్చిన నష్టమేమీ లేదని సునీతా లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. నేతలు మాటలు ఇంకా ఎంత దూరం పోతాయే చూడాలి.