పోలీసు శాఖ పనితీరు అద్భుతం | Nayini Narasimha Reddy Launches Police Expo | Sakshi
Sakshi News home page

పోలీసు శాఖ పనితీరు అద్భుతం

Published Sun, Oct 16 2016 1:15 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

పోలీసు శాఖ పనితీరు అద్భుతం - Sakshi

పోలీసు శాఖ పనితీరు అద్భుతం

పోలీసు ఎక్స్‌పో ప్రారంభోత్సవంలో నాయిని
సాక్షి, హైదరాబాద్: ‘‘దేశానికే తెలంగాణ పోలీసు శాఖ ఆదర్శం. మన పోలీసులను ప్రధాని మోదీ సైతం ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ‘పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్’ నినాదంతో పోలీసు శాఖ అద్భుతంగా పనిచేస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా మిషన్ కాకతీయ కింద చెరువుల్లో పూడికను తొలగించే పనులు చేపట్టింది. గోదావరి, కృష్ణా పుష్కరాలు విజయవంతం కావడం వెనుక పోలీసు శాఖదే కీలక పాత్ర. రాష్ట్ర పోలీసు శాఖలో 18 వేల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ బాగా పనిచేస్తోంది’’ అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.

ఇప్పటికే వెయ్యి కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, మరో రెండు వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సీఎం అనుమతి ఇచ్చారని పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ డీజీపీ అనురాగ్‌శర్మ నేతృత్వంలో పోలీసు శాఖ అద్భుతంగా పనిచేస్తోందన్నారు. 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన పోలీసు ఎక్స్‌పోను మంత్రి ప్రారంభించారు. సీఐడీ, షీటీమ్స్, సైబర్ క్రైం, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తదితర విభాగాలతో పాటు సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ స్టాల్స్‌ను సందర్శించారు.

విరామం లేకుండా ప్రజాసేవ...z
‘పోలీసులు 24 గంటలూ ప్రజలకు సేవ చేస్తారు. చట్టాన్ని అమలు చేస్తారు. యుద్ధాలు జరిగేటప్పుడు మాత్రమే సైన్యం దేశ సరిహద్దులకు కాపాలా కాస్తుంది. యుద్ధం లేనప్పుడు సరిహద్దులను కాపాడేది పోలీసులే. దేశ సరిహద్దుల రక్షణలో సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ సేవలు ఎనలేనివి. భార్యాపిల్లలు, కుటుంబాలను వదిలి సరిహద్దులకు కాపలా కాస్తున్నారు. విరామం లేకుండా సేవ చేస్తున్నారు. పోలీసు అమరవీరులకు ఎంత చేసినా తక్కువే’ అని నాయిని అన్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు నెక్లెస్‌రోడ్డు నుంచి ప్రారంభం కానున్న తొలి భారతీయ పోలీసు అమరవీరుల సంస్మరణ పరుగులో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని నాయిని, అనురాగ్‌శర్మ పిలుపునిచ్చారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా, రైల్వేస్ అదనపు డీజీ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement