సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, వైద్య విద్య కోర్సుల్లో అర్హులైన పలువురు విద్యార్థులకు ఎన్‌సీసీ కోటా కింద ప్రవేశాలు దక్కకపోవడానికి ఎన్‌సీసీ అధికారుల తీరే కారణమని హైకోర్టు తేల్చింది. ఇప్పటికే ప్రవేశాలు ముగిసిన నేపథ్యంలో నష్టపోయిన విద్యార్థులకు తిరిగి ప్రవేశాలు కల్పించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అయితే ఆ విద్యార్థులకు నష్ట పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఎన్‌సీసీపై ఉందన్న హైకోర్టు, ఒక్కో పిటిషనర్‌కు రూ.3 లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. విద్యార్థులకు నష్టం జరిగేలా వ్యవహరించిన అధికారులను గుర్తించి, వారి నుంచి ఈ సొమ్మును రాబట్టుకోవాలని, వారిపై చర్యలు కూడా తీసుకోవచ్చని ఎన్‌సీసీ ఉన్నత వర్గాలకు హైకోర్టు స్పష్టం చేసింది.
న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రుల అత్యుత్సాహానికి ఎన్‌సీసీ అధికారుల సాయం తోడు కావడంతో ఎన్‌సీసీ కోటా కింద అడ్డదారుల్లో సీట్లు పొందుతున్నారని ధర్మాసనం తెలిపింది. క్రీడల కోటాలో అడ్డదారుల్లో సీట్లు పొందిన వ్యవహారం ఏసీబీ దాడులతో బట్టబయలైందన్న ధర్మాసనం, ఎన్‌సీసీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో అక్రమాలు బయటపడేందుకు ఆస్కారం లేకుండా పోయిందని పేర్కొంది.
ఇంజనీరింగ్, వైద్య విద్య కోర్సుల్లో ఎన్‌సీసీ కోటా కింద ప్రవేశాలు పొందేందుకు తాము అర్హులమైనప్పటికీ తమకు ప్రవేశాలు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించడంతో శుక్రవారం ఈ కేసును ధర్మాసనం విచారించింది. రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న వారికి కూడా సీట్లు ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఎన్‌సీసీ ఉన్నతాధికారులను ఆదేశించామని తెలిపింది.
దీనిపై దర్యాప్తు జరిపిన ఎన్‌సీసీ ఉన్నతాధికారి, అర్హులైన పలువురు పిటిషనర్లకు సీట్లు దక్కలేదని తేల్చారని వెల్లడించింది. ఎన్‌సీసీ అధికారుల తీరు వల్లే అర్హులైన వారికి ప్రవేశాలు దక్కలేదని, అయితే ఇప్పటికే ప్రవేశాలు ముగియడంతో పాటు పిటిషనర్లకు రావాల్సిన సీట్లలో ఇతరులు చేరినందున పిటిషనర్లకు సీట్లు కేటాయించడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందుకు సుప్రీంకోర్టు తీర్పు కూడా అంగీకరించదని తెలిపింది. అదేవిధంగా సీట్ల సంఖ్యను పెంచాలని ఆదేశాలివ్వలేమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment