
యూపీఏ-3గా పేరు మార్చుకోండి: కేటీఆర్
తెలంగాణ ఉద్యమంలో కలిసి రాకపోయినా కనీ సం పునర్‌నిర్మాణంలోనైనా పాలుపంచుకోవాలని కాంగ్రెస్, టీడీపీలకు ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు(కేటీఆర్) సూచించారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కలిసి రాకపోయినా కనీ సం పునర్‌నిర్మాణంలోనైనా పాలుపంచుకోవాలని కాంగ్రెస్, టీడీపీలకు ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు(కేటీఆర్) సూచించారు. సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఆయన బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. ‘కిషన్‌రెడ్డికి చట్టం అర్థమైందో లేదో తెలిలేదు. హైదరాబాద్‌ను పరాధీనం చేయాలంటూ ఆయన ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తారా’ అని ప్రశ్నించారు.
‘‘కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తప్పు చేశారని కిషన్‌రెడ్డి అంటున్నారు. అయితే మోడీని ఒప్పు చేయమని చెప్పమనండి. అలా కాకుండా అవే తప్పులను కొనసాగిస్తామంటే ఎన్డీఏ అని కాకుండా యూపీఏ-3గా పేరు మార్చుకోండి’’ అని అన్నారు. యూపీఏ చేసిన తప్పులను సరిది ద్దాల్సింది పోయి వాటినే కొనసాగిస్తామన్నప్పుడు ఎన్డీఏతో అవసరం ఏముందన్నారు. కొంతమం ది మేధావులు బిల్లు పాస్ అయినప్పుడు టీఆర్‌ఎస్ ఏం చేసిందని అడుగుతున్నారని, ప్రత్యర్థులు తమ కళ్లలో పెప్పర్ స్ప్రే కొడుతుంటే ఎలా మాట్లాడేదని నిలదీశారు.
పొన్నాల రాజకీయ నిరుద్యోగి...
ఎన్నికల హామీలే కాకుండా కళ్యాణ లక్ష్మి వంటి కొత్త పథకాలను చేపడుతూ 66 రోజుల్లో 43 కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వంపై రాజ కీయ నిరుద్యోగులు, సొంత పార్టీలో ప్రాబల్యం లేనివారు అవాకులు చెవాకులు పేలుతున్నారం టూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఉద్దేశించి కేటీఆర్ విమర్శించారు. లక్ష్మయ్య రాజకీయ గందరగోళంలో ఉన్నారని, కేసీఆర్‌ని తిట్టడం ద్వారా పదవిని కాపాడుకోవడానికే తాపత్రయపడుతున్నారని దుయ్యబట్టారు.