ఫిరాయింపుల రాష్ట్రంగా తెలంగాణ
కిషన్‌రెడ్డి విమర్శ
రాష్ట్ర సర్కారు తీరుపై కేంద్రం పెద్దలకు ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రం బంగారు తెలంగాణ కాకుండా, ఫిరాయింపుల తెలంగాణగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘిస్తోందని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని మండిపడ్డారు. సంక్రాంతి సెలవుల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించినా, ఓటర్ల పేర్లను తొలగించినా తీవ్రపరిణామాలు ఎదుర్కోకతప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కోర్‌కమిటీ సభ్యులు బుధవారం ఇక్కడ పార్టీ అధినేత అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయలతో భేటీ అయ్యారు.
ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని, టీడీపీ-బీజేపీలకు బలం ఉన్న చోట్ల ఓటర్ల పేర్లను తొలిగిస్తున్నారని, బీజేపీ ప్రచారహోర్డింగ్‌లు ఏర్పాటు చేయనీయకుండా ప్రకటనల ఏజెన్సీలపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తోందని అధినాయకత్వానికి వివరించారు. భేటీ అనంతరం కోర్‌కమిటీ సభ్యులు లక్ష్మణ్, నాగం జనార్దన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఎన్.రామచంద్రారావు, ఆచారి, సాంబమూర్తి ఇతర సభ్యులతో కలసి కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తన శాఖతో సంబంధంలేకపోయినా మంత్రి కేటీఆర్ గృహనిర్మాణ పథకానికి హైదరాబాద్‌లో శంకుస్థాపన చేశారని, ఈ విషయంలో ప్రొటోకాల్‌ను కూడా ఉల్లంఘించారని విమర్శించారు.
రాజకీయ అనుభవంలేని కేటీఆర్ సభ్యత, సంస్కారం లేకుండా ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షా 15వేల కోట్ల బడ్జెట్‌లో 51వేల కోట్లు ప్రణాళిక కింద కేటాయించారని, ఇప్పటి వరకు కేవలం రూ.15వేల కోట్లు మాత్రమే ఖర్చుచేశారని దుయ్యబట్టారు. శాసన సభాపక్ష నేత లక్ష్మణ్ మాట్లాడుతూ, వార్డుల పునర్విభజన, హద్దులను గుర్తించడం, రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ మొత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి తీసుకురావాలన్నారు. వార్డుల పునర్విభజనను అధికారులు చేస్తుండగా, తెలంగాణ భవన్‌లో ఆమోద ముద్ర వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రావడానికి తీరిక దొరకలేదంటూ ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శకు ఇంద్రసేనారెడ్డి స్పందిస్తూ, తెలంగాణ నుంచి ప్రధాని మోదీకి ఎలాంటి ఆహ్వానాలు రాలేదని, ఆహ్వానించినట్టు సీఎం కేసీఆర్ వద్ద లేఖ ఉంటే చూపించాలని అన్నారు.