మహిళల రక్షణకు కొత్త చట్టాలు
మహిళారక్షణ చట్టం కమిటీ కన్వీనర్ పూనం మాలకొండయ్య
సాక్షి, హైదరాబాద్: మహిళలకు పూర్తి రక్షణను కల్పించేలా, శిక్షలు కఠినంగా ఉండేలా కొత్త చట్టాలను రూపొందిస్తామని మహిళా రక్షణ చట్టం కమిటీ కన్వీనర్, ఐఏఎస్ పూనం మాలకొండయ్య వెల్లడించారు. మహిళల రక్షణ కోసం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం బుధవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కన్వీనర్ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ మహిళా రక్షణ చట్టాలు ఎలా ఉన్నాయనే అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించిందన్నారు. ఈ నెల 10న మరోసారి సమావేశమై ఆయా అంశాలపై చర్చిస్తామన్నారు. చట్టాల్లోని ఒక్కో అంశం పరిశీలనకు ఒక్కో అధికారికి బాధ్యతలు అప్పగించామని, వారి అధ్యాయనం తర్వాత నివేదిక అందిస్తామన్నారు. అత్యాచారాల నిరోధానికి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలు ఉండేలా చూస్తామన్నారు.
ఆయా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని, స్వచ్ఛంద సంస్థలను సైతం కలుస్తామన్నారు. పని చేసే చోట కూడా మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, సాఫ్ట్‌వేర్ సంస ్థల్లో వివక్ష ఉందన్నారు. బాలికల, మహిళా చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని, ఉన్న చట్టాలు సరిగా పని చేయడం లేదని తమ కమిటీ అభిప్రాయపడిందని చెప్పారు. మహిళా చట్టాలపై ప్రజల అవగాహనకు కౌన్సెలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా రక్షణకు సంబంధించి ఎన్జీవో సంస్థలు, మరెవరైనా తమ కు సలహాలు, సూచనలు చేయవచ్చని.. ఇందుకోసం డబ్ల్యూసీడీఎస్సీటీజీ2014 ఎట్‌ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కాంకు మెయిల్ చేయవచ్చ ని తెలిపారు. సమావేశానికి కమిటీ సభ్యులు సునీల్‌శర్మ, శైలజా రామయ్యార్, సౌమ్యమిశ్రా, చారుసిన్హా, స్వాతిలాక్రా హాజరయ్యారు.
-----------