
సరికొత్త.. దరఖాస్తులు
సంక్షేమ పథకాలకు మళ్లీ అర్జీలపై గందరగోళం
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: రేషన్, పింఛన్, స్కాలర్‌షిప్ ఏదైనా సరే.. కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. కార్డులున్నా.. పింఛన్ పొందుతున్నా.. స్కాలర్‌షిప్‌లు అందుతున్నా దరఖాస్తు తప్పనిసరి. ఇవే కాదు సుమా.. ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలు కూడా కొత్తగా తీసుకోవాల్సిందే. ఇప్పటికే తీసుకున్నాం.. అవసరం లేదనుకుంటే పప్పులో కాలేసినట్లే. సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించిన కొత్త సర్కారు.. సరికొత్త దరఖాస్తులతో అర్హులను ఎంపిక చేయాలని భావిస్తోంది.
ఈ క్రమంలోనే ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తులను స్వీకరిస్తోంది. సంక్షేమ పథకాలు పొందుతున్నవారు.. పొందాలనుకునే వారు కూడా కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇప్పటికే సమగ్ర సర్వేతో హడావుడి సృష్టించిన కేసీఆర్ సర్కారు.. తాజాగా ప్రభుత్వ ఫలాలు అందుకోవాలంటే దరఖాస్తు చేసుకోవాలనే షరతు విధించడం ఇబ్బందికరంగా మారింది. మరోవైపు పక్షం రోజుల్లోనే అర్హుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలనే ఆంక్షలు జిల్లా యంత్రాంగానికి చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే పని ఒత్తిడితో సతమతమవుతున్న తమను ఊపిరి పీల్చుకోకుండా సరికొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేయడంపై పెదవి విరుస్తున్నారు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే అంశంలో సర్కారు కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గతంలో ఏదైనా పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక నమూనాతో కూడిన దరఖాస్తులో వివరాలు సమర్పించేవారు. తాజాగా ఎలాంటి నమూనా లేకుండా ఏకంగా తెల్లకాగితంలో వివరాలు రాసిచ్చిన వాటిని దరఖాస్తుగా పరిగణించాలని నిర్ణయించింది. దీంతో దరఖాస్తుదారులు తెల్లకాగితంలో వారి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలను సమగ్ర సర్వేసమాచారంతో సరిపోల్చడంతోపాటు క్షేత్ర పరిశీలన చేసిన అనంతరమే అర్హులను ఎంపిక చేస్తారు. అయితే దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి ప్రభుత్వం ఒకట్రెండురోజుల్లో మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు సమాచారం.
ఆరుగురు సభ్యులతో కమిటీ..
సంక్షేమ ఫలాల దరఖాస్తుల పరిశీలన మండలస్థాయిలో చేపట్టనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం మండలస్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో తహసీల్దార్, ఎంపీడీఓ, ఉప తహసీల్దార్, ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, ఒక సీనియర్ అసిస్టెంట్ ఉంటారు. వీరంతా క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుల అర్హతను నిర్ధారిస్తారు. అయితే మండలస్థాయిలో కేవలం ఆరుగురు అధికారులతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పక్షం రోజుల్లో పూర్తిచేయడం అసంభవమని ముఖ్య అధికారి ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. గడువు పెంచడమో, అధికారుల బృందాల సంఖ్యను పెంచడమో చేస్తే తప్ప ఇది సాధ్యపడదని స్పష్టం చేశారు.
పరిశీలన కత్తిమీద సామే..
2011 జనగణన వివరాల ప్రకారం జిల్లా జనాభా 52.9లక్షలు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో జనాభా 63 లక్షలకు పెరిగినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వివిధ సంక్షేమ పథకాల ద్వారా జిల్లాలో దాదాపు 15 లక్షల మందికిపైగా లబ్ధి పొందుతున్నారు. ఇందులో 2.6లక్షల మంది సామాజిక పింఛన్ల రూపంలో, రెండు లక్షల మంది ఫీజు రాయితీ పథకం, ప్రజాపంపిణీ వ్యవస్థ (రేషన్) ద్వారా 10 లక్షల మంది లబ్ది పొందుతున్నారు.
తాజాగా ప్రభుత్వం అర్హుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించిన క్రమంలో వీరంతా దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో అధికారగణానికి దాదాపు 15లక్షల దరఖాస్తులు అందనున్నాయి. వీరేకాకుండా కొత్తవారు కూడా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. వీటిని పక్షం రోజుల్లో పరిశీలన పూర్తిచేసి అర్హులను ఎంపిక చేయాలంటూ ఇటీవల కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అయితే జిల్లాలో వచ్చే 15లక్షల దరఖాస్తుల పరిశీలన 15 రోజుల్లో పూర్తిచేయడం యంత్రాంగానికి కత్తిమీదసామే. దరఖాస్తుల పరిశీలనకు జిల్లా వ్యాప్తంగా 300 మందిని భాగస్వామ్యం చేయనున్నారు. ఈ క్రమంలో జిల్లాలో 15లక్షల కుటుంబాలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఒక్కో ఉద్యోగి రోజుకు గరిష్టంగా 50 ఇళ్లు తనిఖీ చేస్తే.. జిల్లా వ్యాప్తంగా రోజుకు 15వేల ఇళ్లు తనిఖీ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో జిల్లాలోని 15లక్షల ఇళ్లు తనిఖీ చేయాలంటే కనిష్టంగా వందరోజులు పడుతుందని అంచనా.