కొత్త ఆటోకు పూజ చేయించుకొని వస్తూ..
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
- మరో ఇద్దరికి తీవ్రగాయాలు
- ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
పూడూరు: కొత్త ఆటోకు దర్గాలో పూజలు చేయించుకొని తిరుగు ప్రయాణమైన వారు మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఎదురుగా వస్తున్న బస్సు ఆటోను ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు నగరంలోని నానల్‌నగర్ డివిజన్ హకీంపేట్ వాసులు.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నానల్‌నగర్ డివిజన్ హకీంపేట్‌కు చెందిన జహంగీర్(38) ఇటీవల కొత్త ఆటో కొనుగోలు చేశాడు. ఆదివారం ఆటోకు పూజలు చేసేందుకు అదే ప్రాంతానికి చెందిన అక్తర్(34), నసీరొద్దీన్(33), హసన్(29), గౌస్(32)తో కలిసి మహబూబ్‌నగర్ జిల్లా కొందర్గు మండలం లాల్‌పహాడ్‌కు సమీపంలోని గుర్రంపల్లి దర్గాకు బయలుదేరారు. పూజ అనంతరం సాయంత్రం వారు తిరుగు ప్రయాణమయ్యారు. 5 గంటల సమయంలో హైదరాబాద్-బీజాపూర్ అంతర్రాష్ట్ర రహదారిపై రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం రాకంచర్ల సమీపంలో ఎదురుగా వస్తున్న పరిగి డిపో బస్సు వీరి ఆటోను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న జహంగీర్‌తో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన మిగతా వారిని రాకంచర్ల సర్పంచ్ పెంటయ్య మరో ఆటోలో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే నసీరొద్దీన్ మృతి చెందాడు.
మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చేవెళ్ల సీఐ నాగేశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన బస్సును చన్గొముల్ ఠాణాకు తరలించారు. కాగా మృతుల, క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.