‘కరోనా’ ఆటవిడుపు | New attempts for time Pass during Lockdown | Sakshi
Sakshi News home page

‘కరోనా’ ఆటవిడుపు

Published Sun, Apr 19 2020 1:31 AM | Last Updated on Sun, Apr 19 2020 1:31 AM

New attempts for time Pass during Lockdown - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాసేపు మన గురించి మనం ఆలోచించుకునేంత తీరికే లేనంతగా భవిష్యత్తు ప్రణాళికలతో తలమునకలు.. కొత్త అభిరుచులు, అలవాట్లకు అవకాశమే లేనంతగా ఉరుకులు పరుగుల జీవనం.. ఇష్టమైన పుస్తకాలు చదవడం, సంగీతం నేర్చుకోవడం, పాటలు పాడటం, గార్డెనింగ్, ఫొటోగ్రఫీ.. ఇవన్నీ చేయాలని, నేర్చుకోవాలని ఉన్నా అందుకు టైమివ్వని రోజువారీ ఒత్తిళ్లు.. బలవంతంగా మనసులోనే అణచివేసుకున్న చిన్నచిన్న కోరికలు.. ఇవన్నీ నెరవేర్చుకోవడానికి ఇప్పుడు ‘కరోనా లాక్‌డౌన్‌’ రూపంలో టైమొచ్చింది. మే నెల 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఖాళీ సమయాన్నెలా గడపాలి? భారంగా గడుస్తోన్న సమయాన్ని ఇష్టంగా ఎలా మలచుకోవాలనే ఆలోచనలు ప్రజల్లో కొత్త మొగ్గలు తొడుగుతున్నాయి.

దగ్గర చేస్తున్న ‘వీడియో కాలింగ్‌’
సుదీర్ఘ లాక్‌డౌన్‌తో బయటకు వెళ్లలేక, ఆత్మీయులు, స్నేహితులను కలుసుకోలేక, కబుర్లు లేక ఇబ్బంది పడుతున్న వారు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. వాట్సాప్‌ గ్రూపుల్లోని సన్నిహితులు, కుటుంబసభ్యులు, స్నేహితులతో ఒకేసారి కొన్ని బృందాలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఇది  ట్రెండింగ్‌గా మారింది. ప్రధానంగా అమెరికా, ఇతర పశ్చిమదేశాల్లోని తెలుగువారు ఇక్కడున్న తమ ఫ్రెండ్స్, తల్లిదండ్రులు, సన్నిహితులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడేందుకు మొగ్గుచూపుతున్నారు.

ఈ ఆపత్కాల సమయంలో దూరంగా ఉన్న వారిని, వివిధచోట్ల ఉంటున్న తమ వారిని ఈవిధంగా ఒకేసారి చూసి ఆనందంతో పెద్దవయస్కులు తబ్బిబ్బవుతున్నారు. అక్కడ మొదలైన ఈ ట్రెండ్‌ను మన యువత సైతం అందిపుచ్చుకుని స్నేహితులు, బంధువులతో లైవ్‌లో వీడియో కాన్ఫరెన్సింగ్‌ చేస్తున్నారు. వాట్సాప్‌ చాటింగులు ఎదురెదురుగా కబుర్లాడుకునే ముచ్చట తీరుస్తున్నాయి. తమలోని అభిరుచులు, కొత్త టాలెంట్లను పంచుకోవడానికి వాట్సాప్‌ వేదికవుతోంది. సెల్‌ఫోన్లు క్షేమసమాచారాలను చేరవేస్తూ, ఆరాతీస్తూ క్షణం తీరికలేకుండా మోగుతున్నాయి.

లైఫ్‌లైన్‌ మారుస్తున్న ‘ఆన్‌లైన్‌ పాఠాలు’
లాక్‌డౌన్‌తో జాగింగ్, యోగా వంటివి చేయలేకపోతున్నామని భావిస్తున్న వారికి ఆన్‌లైన్‌ యోగా క్లాసుల ద్వారా ఆ లోటు తీరుతోంది. తాను నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ క్లాస్‌లకు మంచి స్పందన వస్తోందని యోగా ట్రైనర్‌ హర్షిత సోని చెబుతున్నారు. రచనలు, తమలోని భావాలకు అక్షరరూపం ఇవ్వడం ఎలా? అన్న దానిపై ఆన్‌లైన్‌ కోర్సు నిర్వహిస్తున్న భావన.. లాక్‌డౌన్‌ సమయంలో దీనికి మంచి స్పందన వచ్చిందని, ఇందులో అందరి ఇంటరాక్షన్‌ పెరుగుతోందన్నారు. కాగా, పర్‌ఫెక్ట్‌ కాఫీ రుచి కోసం ఏం చేయాలి, ఏయే పద్ధతులను అనుసరించాలనే అంశంపై రోస్టరీ కాఫీ హౌస్‌కు చెందిన నిషాంత్‌ పర్సనల్‌ ఆన్‌లైన్‌ క్లాసులు నడుపుతున్నారు. కాఫీ చేయడంలో మెలకువలు, రహస్యాలను ఈ క్లాసుల్లో ఆయన ఆన్‌లైన్‌లో వివరిస్తున్నారు.

వంట, పాట, సంగీతం, చదువు..
కొత్త వంటకాలు, కొత్త భాషలు, మ్యూజిక్‌ నేర్చుకోవడం, యోగా, జాగింగ్‌ వర్కవుట్స్, నృత్యం, పెయింటింగ్‌ వేయడం వంటి అభిరుచులు నెరవేర్చుకోడానికి యూట్యూబ్‌ ఒక భాండాగారంగా ఉపయోగపడుతోంది. పలువురు యూట్యూబ్‌ నుంచి తమ అభిరుచులు, కోరికలు తీర్చుకునేందుకు, కొత్త టెక్నిక్‌ల సాధనపై దృష్టి నిలిపారు. ఇంకొందరు ఔత్సాహికులు సొంత బ్లాగ్‌లను ప్రారంభిస్తున్నారు. పుస్తక పఠనం, టీవీ క్షణం, పక్షులను చూడడం, సంగీత సాధన, పాటలు పాడటం, కథలు–కవిత్వం రాయడం, ఇండోర్‌గేమ్స్, మొక్కల పెంపకం, ఫొటోగ్రఫీ వంటి వాటిలో మరికొందరు నిమగ్నమవుతున్నారు. ఇదిలా ఉంటే ఇంకా సిలబస్‌ పూర్తికాక, అనుకున్న సమయానికి వార్షిక పరీక్షలు జరగక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు వరంగా మారాయి. ఆన్‌లైన్‌లో వీడియో, ఆడియో రూపాల్లో పాఠాలు వినడంతో పాటు పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో అందుబాటులో ఉన్న నోట్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని చదువులో వెనకబడకుండా జాగ్రత్తపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement