వివిధ జిల్లాల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చే ప్రజల కోసం ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
సాక్షి, హైదరాబాద్: వివిధ జిల్లాల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చే ప్రజల కోసం ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ మార్గంలో ఉన్న పాత ఎస్‌ఐబీ కార్యాలయాన్ని సందర్శకుల కార్యాలయంగా ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆ భవనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ వెంట ఆయన భద్రతా విభాగం ఐజీ మహేష్ భగవత్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి ఉన్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం బేగంపేటలోని అధికారిక నివాసంలో ఉంటున్న విషయం తెలిసిందే.
సీఎం క్యాంపు కార్యాలయంలోని రెండు భవనాల్లో ఒకటి మాత్రమే వినియోగిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు ముందు భవనాన్ని సందర్శకుల కోసం వినియోగించేవారు. కానీ కేసీఆర్ దానిని ఉపయోగించడం లేదు. ఈ భవనంలో వాస్తు దోషాలు ఉన్నాయని రెండు భవనాల మధ్య గోడ కట్టారు. దీంతో సీఎంను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చేవారు బయట రోడ్లపై నిలబడాల్సి వస్తోంది. వీరి కోసం ఎస్‌ఐబీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. క్యాంపు కార్యాలయ భద్రతా అధికారుల నివేదిక అనంతరం భవనాన్ని ముఖ్యమంత్రి సందర్శకుల కార్యాలయంగా మార్చనున్నారు.