వీడిన గ్రహణం
ఎట్టకేలకు తేలిన హౌసింగ్‌బోర్డు ఇళ్ల పంచాయితీ
అగ్రిమెంట్ నాటి రేటుతోనే కొత్త డిజైన్‌తో ఇళ్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం
దాదాపు 150 మంది లబ్ధిదారులకు రూ.6.5కోట్ల మేర ఊరట
హౌసింగ్‌బోర్డు అధికారులతో హైదరాబాద్‌లో మంత్రులు జగదీశ్, ఇంద్రకరణ్ సమావేశం
నల్లగొండ : సొంత ఇంటి కోసం అడ్వాన్సులు చెల్లించి నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ఊరట లభించింది. జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీ పంచాయితీ ఎట్టకేలకు తేలింది. పాత అగ్రిమెంట్ ప్రకారం హౌసింగ్‌బోర్డు రూపొందించిన కొత్త డిజైన్‌తో ఇళ్లు కట్టించి ఇవ్వాలని జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిల సమక్షంలో సోమవారం హైదరాబాద్‌లో సంబంధిత అధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. హెచ్‌ఐజీ గృహాల ధరను రూ.16.34 లక్షలు, ఎంఐజీ గృహాలను రూ.13.40 లక్షలకు కట్టించి ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో దాదాపు 150 మంది లబ్ధిదారులకు రూ.6.5 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. వాస్తవానికి జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో గృహాలు నిర్మించి ఇచ్చేందుకు 2011లో నిర్ణయం తీసుకున్నారు. ఈ దేవరకొండ రోడ్డులో కతాల్‌గూడ వద్ద మొత్తం 334 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. అందులో 152 హెచ్‌ఐజీ కాగా, 182 ఎంఐజీ ఇళ్లు. హెచ్‌ఐజీ ఇళ్లకు రూ.16.34 లక్షలు, ఎంఐజీ ఇళ్లకు రూ.13.40 లక్షలకు నిర్మించాలని 2011లోనే అగ్రిమెంట్లు కూడా కుదుర్చుకున్నారు. దీంతో లబ్ధిదారులంతా అడ్వాన్సులు చెల్లించారు. చాలామంది ఇళ్లపనులు ప్రారంభించారు. ఆ ఇళ్లలో ఇప్పటివరకు 52 హెచ్‌ఐజీ, 117ఎంఐజీ ఇళ్లు నిర్మాణాలు పూర్తయ్యాయి.
మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే, అగ్రిమెంట్‌లో ఉన్న దానికి భిన్నంగా మధ్యలో మార్పులు తెచ్చి హెచ్‌ఐజీ, ఎంఐజీ ఇళ్లలో బాల్కనీలు ఏర్పాటుకు మరో రూ.3లక్షలు చెల్లించాలని హౌసింగ్ బోర్డు అధికారులు మెలికపెట్టారు. దీంతో భారమవుతుందనే ఆలోచనతో అడ్వాన్సులు చెల్లించిన వారు కూడా నిర్మాణ పనులు నిలిపివేశారు. ఇందులో రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు అడ్వాన్సులు చెల్లించిన వారున్నారు. దీంతో అధికారులు వారి అగ్రిమెంట్లను రద్దు చేస్తున్నామని, అడ్వాన్సుగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించేది లేదని లబ్ధిదారులకు నోటీసులు కూడా పంపారు. దీంతో ఈ హౌసింగ్‌బోర్డు ఇళ్ల నిర్మాణం పెండింగ్‌లో పడింది.
ఇప్పుడేం జరిగిందంటే..
లబ్ధిదారులు ఈ సమస్యను నల్లగొండ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ దుబ్బాక నర్సింహారెడ్డి చొరవతో రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యను పరిష్కరించాలని, ఆర్థికంగా భారం పడకుండా పాత అగ్రిమెంట్ వరకు ఇళ్లు కట్టించి ఇచ్చేలా హౌసింగ్ బోర్డు అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు. దీంతో సోమవారం సచివాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి హౌసింగ్‌బోర్డు అధికారులు, లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేయించారు. అందులో గృహనిర్మాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాత రేటుకే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అది కూడా కొత్త డిజైన్‌తో కట్టించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు వెంటనే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ సమావేశంలో మరో అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఈ గృహాలను కట్టించి ఇచ్చిన చోట మరో 25 ఓపెన్ ప్లాట్లను అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చిన ఒక హౌసింగ్‌బోర్డు అధికారిపై మంత్రులు ఆగ్ర హం వ్యక్తం చేసినట్టు సమాచారం.