వీవీ ప్యాట్ పనితీరును నాయకులకు వివరిస్తున్న కలెక్టర్
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముందనే ప్రచారం నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నుండి జిల్లాకు మంగళవారం కొత్తగా ఈవీఎం లు, వీవీ ప్యాట్‌లు చేరుకున్నాయి. బెంగళూరు నుండి ప్రత్యేక కంటైనర్లలో వచ్చిన వీటిని జిల్లా కేంద్రంలోని గోదాంకు చేర్చా రు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల నాయ కుల సమక్షంలో వీటిని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పరిశీలనలో గోదాంల్లో భద్రపరిచారు. జిల్లాకు మొత్తం 1,770 ఈవీ ఎంలు, వీవీ ప్యాట్‌లు చేరుకున్నాయి. ప్రత్యేకంగా సీల్ చేసిన బాక్సుల్లో వచ్చిన ఈవీఎం, వీవీ ప్యాట్‌లను భద్రపరిచిన గోదాంల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షిస్తా మని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ రాజకీయ పార్టీల నాయకులకు తెలిపారు. ఈ సందర్భంగా నాయకుల సమక్షంలో ఓ బాక్స్‌ను తెరిచి కొత్త ఈవీఎం, వీవీ ప్యాట్ పనితీరును వివరించారు.
రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం
ఎన్నికల కమిషన్ నుండి జిల్లాకు కొత్తగా ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు వచ్చిన సందర్బంగా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటుచేశారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా వచ్చిన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లపై రాజకీయ పార్టీలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటర్ జాబితాలు ఓసారి పరిశీలించడంతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు చొరవ చూపాలని కోరారు. 18 ఏళ్లు నిండిన అందరూ ఓటరుగా నమోదయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 25 లోపు నమోదు చేయాలని సూచించారు. అక్టోబర్ 8వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందని వివరించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ట్రెయినీ ఐఏఎస్ మిలింద్ బాప్నా, డీఆర్వో వెంకటేశ్వర్లు, నారాయణపేట ఆర్డీఓ శ్రీనివాసులు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు రంగారావు, ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ హాదీ, టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు బెక్కెం జనార్దన్, బీజేపీ నాయకుడు అంజయ్యతో పాటు సీపీఐ, సీపీఐ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
కాల్‌సెంటర్ పరిశీలన
ఎన్నికల ఏర్పాట్లలో బాగంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేస్తున్న కాల్‌సెంటర్‌ను కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పరిశీలించారు. కాల్‌సెంటర్‌లో ఏర్పాటుచేసిన 08542–241165 నంబర్‌కు ఎవరైనా ఫోన్ చేసి తమ వివరాలను చెబితే ఓటరు జాబితాలో పేరు ఉందా, లేదా పరిశీలించి చెబుతారు. ఈ మేరకు కాల్‌సెంటర్‌ను పని విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి బుధవారం నుండి 4జీ కనెక్షన్ తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment