పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇస్తున్న శిక్షకుడు
సాక్షి,కల్వకుర్తి: పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిబంధనలు అమలు చేయడంలో ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు) కీలకపాత్ర వహించాలని ఎన్నికల రిట ర్నింగ్ అధికారి, ఆర్డీఓ రాజేశ్‌కుమార్ సూచిం చారు. గురువారం పట్టణంలోని భ్రమరాంబిక బీఈడీ కళాశాలలో పీఓలకు, ఏపీఓలకు రెండు విడతలుగా శిక్షణ ఇచ్చారు. ఉదయం, సాయంత్రం ఇచ్చిన శిక్షణలో ఎన్నికల నియమావళి, ఈవీ ఎంల వినియోగం, వీవీ ప్యాట్‌లపై శిక్షణ ఇచ్చా రు.
ఆర్‌డీఓ మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో ఎన్నికలు కీలకమని, అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు ఓటు హక్కు వజ్రాయుధంగా మారుతుందన్నారు. గతంలో ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతి కొనసాగేదని, ఈ ఎన్నికల్లో నూతనంగా ఈవీఎంలను ఉపయోగిస్తున్నామన్నారు. అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అడుగు ముందుకేసిందన్నారు. వేసిన ఓటు అనుకున్న అభ్యర్థి గుర్తుకు పడిందా? లేదా? అని వెంటనే చూసుకునేందుకు వీలుగా వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ అడిట్ ట్రయల్) యంత్రాలను పరిచయం చేస్తున్నామన్నారు.
వీటి వినియోగంపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించామన్నారు. పోలింగ్ బూత్‌కు హాజరయ్యే ఓటర్లకు ఈవీఎంపై ఎలాంటి ఇబ్బందులు ఉండరాదని సూచించారు. ఏమైనా సమస్య తలెత్తితే పోలింగ్ అధికారి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.
ఓటు వేసే విధానంపై..
ఓటరు పోలింగ్ కంపార్టుమెంట్‌లోకి వెళ్లగానే ప్రిసైడింగ్ అధికారి పక్కన ఉన్న చిత్రంలో చూపిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో బ్యాలెట్‌ను సిద్ధంగా ఉంచుతామని ఆర్డీఓ పేర్కొన్నారు. బ్యాలెట్ యూనిట్‌పైన క్రమసంఖ్య అభ్యర్థి పేరు పక్కన గుర్తులు ఉంటాయన్నారు. వీటిలో నచ్చిన అభ్యర్థి గుర్తుపై ఓటు వేయడానికి పక్కనే నీలిరంగు బటన్ ఉంటుందని, బటన్ నొక్కగానే ఎర్రలైట్ వెలుగుతుందని, ఎంచుకున్న అభ్యర్థికి ఓటు పడుతుందన్నారు.
అలాగే కంట్రోల్ యూని ట్ యంత్రం ఈవీఎంలకు అనుసంధానం చేసి ఉంటుందని ఈ యంత్రాన్ని పోలింగ్ అధికారులు మాత్రమే ఉపయోగించేందుకు వీలు ఉంటుందన్నారు. యంత్రాలపై స్క్రీన్ ఏర్పాటు చేసి ఉంటుందని, ఓటింగ్ సంబంధించిన వివరాలు ఈ యంత్రంలో నమోదు అవుతాయన్నారు.
వీవీ ప్యాట్‌పై..
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల పని తీరుపై సందేహాలను నివృత్తి చేసేందుకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని ఆర్డీఓ తెలిపా రు. ఓటర్లు ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని చూసుకునేందుకు ఈసారి ఎన్నికల సంఘం వీవీ ప్యాట్‌లను ఏర్పాటు చేసిందన్నారు. ఈవీఎంలో ఓటరు ఓటు వేయగానే అభ్యర్థికి పడిందా.. లేదా అనే విషయం వీవీప్యాట్‌లో కనిపిస్తుందని తెలిపారు.
వీవీప్యాట్ యంత్రంలో ఓటరు ఎంచుకున్న అభ్యర్థి సీరియల్ నంబర్, గుర్తు, పేరు ఒక బ్యాలెట్ స్లిప్ మీద కనిపిస్తుందని తెలిపారు. ఈ బ్యాలెట్ స్లిప్ ఏడు సెకండ్ల పాటు కనిపించి ఆ తర్వాత కట్ అయ్యి ప్రింటర్ డ్రాప్ బాక్స్‌లో పడుతుందన్నారు. మొత్తం 700మందికి పైగా వీవీ ప్యాట్‌ల శిక్షణకు హాజరయ్యారు. దాదాపు 30మంది శిక్షణకు గైర్హాజరయ్యారు. గతంలో శిక్షణ తీసుకున్న అధికారులే పీఓలకు, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో కల్వకుర్తి తహసీల్దార్ గోపాల్‌తో పాటు నియోజకవర్గంలోని వెల్దండ, ఆమన్‌గల్, తలకొండపల్లి, మాడ్గుల తహసీల్దార్లు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment