నెలరోజుల్లో కొత్త పాలసీ! | New Excise Policy In Telangana | Sakshi
Sakshi News home page

నెలరోజుల్లో కొత్త పాలసీ!

Published Sun, Sep 1 2019 10:14 AM | Last Updated on Sun, Sep 1 2019 10:15 AM

New Excise Policy In Telangana - Sakshi

సాక్షి, వికారాబాద్‌: వచ్చేనెల 30తో మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం పాత మద్యం పాలసీని కొనసాగిస్తుందా.. లేదా కొత్త విధానాన్ని తీసుకొస్తుందా.. అని మద్యం వ్యాపారులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సర్కారుకు ఎక్సైజ్‌శాఖ నుంచి భారీగా ఆదాయం సమకూరుతోంది. త్వరలో మద్యం లైసెన్సుల గడువు పూర్తికానున్న నేపథ్యంలో ఈసారి టెండర్లు దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీపడనున్నారు. కొత్తవారు సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టాలని ఉత్సాహంగా ఉన్నారు. వచ్చేనెల మొదటి వారంలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేయనున్నట్లు సమాచారం. మద్యం దుకాణాల టెండర్లు దక్కించుకునేందుకు జిల్లాలోని వ్యాపారులతోపాటు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల వారు సైతం మక్కువ చూపిస్తున్నారు.

ఇక్కడ వ్యాపారం చేసేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు మహబూబ్‌నగర్, మెదక్‌ జిల్లాలకు చెందిన మద్యం వ్యాపారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆయా జిల్లాల వ్యాపారులు మద్యం టెండర్లలో పాల్గొనడంతోపాటు దుకాణాలు దక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి. 2017 కంటే ఈ దఫా మరింత పోటీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. మద్యం వ్యాపారం మంచి లాభాలను తెచ్చిపెడుతుండడంతో రాజకీయ నాయకులతోపాటు రియల్‌ ఎస్టేట్‌ రంగానికి చెందిన వ్యాపారులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మద్యం వ్యాపారులు, సిండికేట్లు సైతం మన జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రియలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మద్యం దుకాణాల టెండర్లు దక్కించుకునేందుకు ఈసారి పోటీ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.   

446 దరఖాస్తులు, రూ.43.70 కోట్లు  
గతంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండర్లను రెండేళ్లకు ఖరారు చేసింది. 2017–2019 పాలసీ ప్రకారం సెప్టెంబర్‌ 30 వరకు మద్యం లైసెన్సుల గడువు పూర్తి కానుంది. అంతకు ముందు టెండర్‌లో పాల్గొనేందుకు చెల్లించాల్సిన ధరావత్తు తక్కువ మేర ఉండేది. 2017లో దానిని లక్ష రూపాయలకు పెంచారు. ఆలాగే ఆయా ప్రాంతాలను బట్టి దుకాణాలను నాలుగు స్లాబ్‌లుగా విభిజించి లైసెన్స్‌లు కేటాయించారు. వికారాబాద్‌ జిల్లాలో మొత్తం 45 మద్యం దుకాణాలు ఉండగా గ్రామీణ ప్రాంతంలోని 29 మద్యం దుకాణాల లైసెన్స్‌ ఫీజు రూ.90 లక్షలు, పట్టణ ప్రాంతాల్లోని 16 మద్యం దుకాణాల లైసెన్స్‌ ఫీజును రూ.1.10 కోట్లుగా నిర్ణయించారు.

గతంలో 45 మద్యం షాపులకు టెండర్లు నిర్వహించిన ఎక్సైజ్‌ శాఖకు మొత్తం 446 దరఖాస్తులు అందాయి. 2017 సెప్టెంబర్‌లో జిల్లాలోని 45 మద్యం దుకాణాల టెండర్లను లాటరీ పద్ధతిలో నిర్వహించి లైసెన్స్‌లు జారీ చేశారు. టెండర్‌ ప్రక్రియ ద్వారా జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.43.77 కోట్ల ఆదాయం లభించింది. మొత్తం దుకాణాల్లో ఏడు మద్యం షాపులు లైసెన్స్‌లు అప్పట్లో మహిళలకు దక్కడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం దుకాణాల లైసెన్స్‌ వచ్చేనెల 30తో ముగియనుంది. దీంతో మద్యం వ్యాపారులంతా నిరీక్షిస్తున్నారు.  

దుకాణాలు పెరుగుతాయా..? 
వచ్చేనెల మొదటి వారంలో ఎక్సైజ్‌ శాఖ నుంచి విధివిధానాలు వెలుబడే అవకాశం ఉంది. గత రెండేళ్లలో జిల్లాలోని 45 మద్యం దుకాణాల్లో జరిగిన మద్యం అమ్మకాల వివరాలను ఇప్పటికే ఎక్సైజ్‌ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. అయితే, మద్యం విక్రయాలు జిల్లాలో లక్ష్యానికి మించి జరిగాయి. ఈ నేపథ్యంలో ఎక్జైజ్‌ శాఖ మద్యం దుకాణాల సంఖ్యను పెంచే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న 45 మద్యం దుకాణాలకు అదనంగా మరో ఏడు నుంచి పది షాపులను పెంచవచ్చని విశ్వసనీయ సమాచారం. అలాగే కొత్త మున్సిపాలిటీల్లోనూ బార్‌ల కోసం లైసెన్స్‌లు జారీ చేయనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలైన పరిగి, కొడంగల్‌లో బార్‌లు ఏర్పాటు కానున్నాయి. కాగా, పట్టణాల్లో ప్రస్తుతం కొనసాగిస్తున్న పర్మిట్‌ రూమ్‌ లైసెన్స్‌లను ఎత్తివేయొచ్చని తెలుస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement