
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై ప్రయాణం మరింత స్మార్ట్ కానుంది. టోల్ వసూళ్లలో పారదర్శకత, ప్రయాణం సులభతరం చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) సరికొత్త టెక్నాలజీతో ముందుకొస్తోంది. టోల్ ప్లాజాల వద్ద డబ్బులిచ్చే పద్ధతికి స్వస్తి పలికి ఏటీఎం కార్డును పోలి ఉండే ట్రాన్సిట్, టచ్ అండ్ గో కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం నుంచి 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌లోని 19 ఇంటర్‌చేంజ్‌ల వద్ద ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రారంభించింది. టోల్ గేట్ సిబ్బందికి కార్డుల విధానంపై అవగాహన రాగానే మరో 3 రోజుల్లో అమలులోకి తీసుకురానుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జారీ చేయనున్న ఈ కార్డులతో వాహనదారుల సమయం ఆదా కానుంది. కార్డుల కొనుగోలు, రీచార్జ్ కోసం ప్లాజా కార్యాలయాల వద్ద పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్)లను ఏర్పాటు చేశారు. నానక్‌రామ్‌గూడలో ఏర్పాటు చేయనున్న ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ ద్వారా నిత్యం ఈ సేవలను పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం ఓఆర్‌ఆర్ చుట్టూ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేయనున్నారు.
స్మార్ట్ కార్డుతో..
ప్రస్తుతం ఔటర్‌పైకి వాహనం ఎక్కే ముందు కంప్యూటర్‌లో వివరాలు నమోదు చేసి ఓ స్లిప్‌ను వాహనదారుడికి ఇస్తున్నారు. దిగే చోట (ఎగ్జిట్ పాయింట్) ఉన్న కౌంటర్‌లో ఆ స్లిప్ ఇస్తే ప్రయాణ దూరాన్ని లెక్కించి ఎంత చెల్లించాలో చెబుతున్నారు. దీంతో చార్జీల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఈ ఇబ్బందుల దృష్ట్యా టోల్ మేనేజ్‌మెంట్ సిస్టం (టీఎంఎస్)ను హెచ్‌ఎండీఏ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ప్రయోగాత్మకంగా స్మార్ట్ కార్డు విధానం ప్రవేశ పెట్టారు. ఈ విధానంలో ఔటర్‌పైకి వాహనం ఎక్కగానే క్షణం ఆలస్యం చేయకుండా స్మార్ట్ కార్డును సిబ్బంది ఇస్తారు. దిగే దగ్గర ఆ కార్డు ఇస్తే స్కాన్ చేసి ఎంత చెల్లించాలో సిబ్బంది చెబుతారు. బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ప్రత్యేక విధానంలో లోటుపాట్లను అధ్యయనం చేసి తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. రోజువచ్చే వాహనదారులకు కాకుండా అప్పుడప్పుడూ వచ్చేవారికి ఈ కార్డు ఎక్కువగా ఉపయోగపడుతుందని అంటున్నారు.
టచ్ చేసి వెళ్లడమే...
ఓఆర్‌ఆర్‌పై 19 టోల్‌ప్లాజాలు దాటుకొని వెళ్లాలంటే వాహనదారులకు చాలా సమయం పడుతోంది. ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఎక్కువైనపుడు డబ్బులు తీసుకొని రశీదు ఇవ్వడమూ సిబ్బందికి భారమవుతోంది. కొంతమంది సిబ్బంది తమకు తెలిసిన వారి నుంచి డబ్బులు తీసుకోకుండా అవినీతికి పాల్పడుతున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వసూళ్లలో పారదర్శకత, సులభతర ప్రయాణం కోసం ‘టచ్ అండ్ గో’కార్డును పరిచయం చేస్తున్నారు. కారు, లారీలు.. ఇలా ఏ వాహనదారుడికైనా ప్రత్యేక రంగు, ఆ వాహనం గుర్తుతో కార్డులివ్వనున్నారు. ప్లాజాల వద్ద ఉండే స్క్రీన్‌కు ఆ కార్డు చూపించి వెళ్లాలి. ఆ సమయంలో కార్డులోని సొమ్మును ఆటోమేటిక్‌గా చెల్లించినట్లవుతుంది. ఓఆర్‌ఆర్‌పై 157 మాన్యువుల్, టంచ్ అండ్ గో లేన్స్ ఏర్పాటు చేయనున్నారు. దాదాపు రూ.200లకు అందుబాటులోకి తీసుకురానున్న ఈ కార్డులో ప్లాజాలో వద్ద ఏర్పాటు చేసే పీవోసీలో రీచార్జ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో మొబైల్ రీచార్జ్ సేవలు కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఒక వాహనం కోసం తీసుకున్న కార్డు మరో వాహనానికి పనిచేయకుండా చూడాలని అధికారులు భావిస్తున్నారు.
‘యాంటీనా’తోనే క్లియరెన్స్...
జాతీయ రహదారుల్లో ఉపయోగించే ఆర్‌ఎఫ్‌ఐడీ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) కార్డులు కూడా ఓఆర్‌ఆర్‌పై పని చేసేలా చర్యలు చేపట్టారు. ఈ కార్డులున్న వాహనాలను 23 లేన్లలోనే అనుమతించనున్నారు. ఈ లేన్లోకి వెళ్లే ముందు వాహనాన్ని అక్కడ ఏర్పాటు చేసిన తొలి యాంటీనా.. కార్డు సరైనదా కాదా స్క్రీన్ చేస్తుంది. లారీ కోసం రీచార్జ్ చేసుకుని కారుకు వాడాలనుకుంటే తిరస్కరిస్తుంది. అంతా ఓకే అనుకున్నాక తొలి గేట్ తెరుచుకుంటుంది. తర్వాత కారు ఎక్కడ ఏ టైంలో ఓఆర్‌ఆర్ ఎక్కిందని రికార్డు చేసుకుంటుంది. ఎగ్జిట్ టోల్ బూత్ నుంచి నిష్క్రమించగానే కార్డు నుంచి డబ్బులను ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఈ కార్డులను కూడా టోల్ ప్లాజాలో వద్ద ఏర్పాటు చేసే పీవోఎస్‌లో రీచార్జ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment