సాక్షిప్రతినిధి, నల్లగొండ : మరో ఇరవై రోజులు గడిస్తే... ఉమ్మడి నల్ల గొండ జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీ కాలం ముగియనుంది. జిల్లా పునర్విభజనతో అదనంగా ఏర్పాటైన సూర్యాపేట, యాదాద్రి భువనగిరి సహా నల్లగొండ జెడ్పీలకు కొత్త పాలక వర్గాల ఎన్నిక ఇప్పటికే పూర్తయ్యింది. జూలై 4వ తేదీన పాత పాలకవర్గం దిగిపోగానే.. కొత్త పాలవర్గం పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ... నల్లగొండ జెడ్పీకి మినహా మిగిలిన రెండు జెడ్పీలకు ఇప్పటి దాకా కొత్త భవనాలను సిద్ధం చేయలేదు. మరీ ముఖ్యంగా జెడ్పీ విభజన ప్రక్రియ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 59 మండలాలు ఉండగా.. మూడు జిల్లాలుగా పునర్విభజన జరిగాక.. మండలాల సంఖ్య ఏకంగా 71కి చేరింది.
నల్లగొండ –31, సూర్యాపేట–23, యాదాద్రి భువనగిరి–17 మండలాలతో జిల్లాలుగా కొలువుదీరాయి. కొత్తగా ఏర్పాటైన మండలాల్లో ఇప్పటికీ వసతుల్లేవు. ఇప్పుడు కొత్త జిల్లాపరిషత్‌ల పరిస్థితీ అదే తరహాలో ఆందోళన కలిగిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా పరిషత్ అధికారులు జెడ్పీ విభజన కోసం తుది కసరత్తు మొదలు పెట్టారు. సిబ్బంది కేటాయింపులు, పోస్టింగులు.. తదితర అంశాలు చర్చించేందుకు పంచాయతీ కమిషనర్‌తో సీఈఓల సమావేశం ఈనెల 15వ తేదీన ఏర్పాటు చేశారు. వాస్తవానికి గురువారం జరగాల్సి ఉన్న ఆ సమావేశాన్ని 15వ తేదీకి వాయిదా వేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం ముగిస్తే కానీ.. జెడ్పీ విభజనపై ఒక స్పష్టత రాదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
మూడు జిల్లాలకు 68మంది సిబ్బంది విభజన
ఉమ్మడి జిల్లా పరిషత్‌కు మంజూరైన పోస్టులు కేవలం 68. ఇందులో 11 ఖాళీలు ఉన్నాయి. అంటే ఇప్పటికే పాత జెడ్పీ 57 మందితో నడుస్తుండగా.. అందులో జూనియర్ అసిస్టెంట్లు(26), ఆఫీస్ సబార్డినేట్ స్టాఫ్ (17)లదే సింహభాగం. రెండు కొత్త జెడ్పీలు కొలువు దీరనున్నా... పాత సిబ్బంది విభజన తప్ప కొత్త సిబ్బంది రిక్రూట్‌మెంట్ మాత్రం లేదని అంటున్నారు. మరీ అంతకు సిబ్బంది సరిపోకపోతే ఆయా మండలాల నుంచి డిప్యుటేషన్‌పై సిబ్బందిని తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సిబ్బంది విభజన తర్వాత ఎవరి సొంత జిల్లాలకు వారిని కేటాయించే వీలుందని పేర్కొంటున్నారు.
దీనికోసం ఆయా సిబ్బంది సర్వీసు, సీనియారిటీ తదితర వివరాలతో జెడ్పీ అధికారులు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేశారు. జెడ్పీ మొత్తం సిబ్బందిలో అత్యధికంగా 19 మంది ఉద్యోగులు నల్లగొండ మండలం నుంచే ఉన్నారు. అయితే, మండలాల సంఖ్యను బట్టి ఏ జిల్లాకు ఎంత మంది సిబ్బంది అవసరం అవుతారు, ఏ ప్రాతిపదికన చేపడతారు, ఏ రేషియో ప్రకారం కేటాయింపులు జరుపుతారు అన్న స్పష్టత ఇంకా రాలేదని, 15వ తేదీ నాటి సమావేశం తర్వాత నిర్ణయం జరుగుతుందని చెబుతున్నారు. మరోవైపు కొత్త ఏర్పాటైన 12 మండలాల్లో సైతం ఇప్పటికీ సిబ్బంది లేరు. ప్రధానమైన మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) పోస్టులు భర్తీ కానేలేదు. మొన్నటి పరిషత్ ఎన్నిలను సైతం తహసీల్దార్‌లకు బాధ్యతలు అప్పజెప్పి పూర్తి చేశారు. సూపరింటెండెంట్లు, ఈఓఆర్డీలకే ఇన్‌చార్జ్ ఎంపీడీఓలుగా బాధ్యతలు ఇచ్చారు. కొత్త సిబ్బందిని నియమించుకునే అవకాశం లేదని, పాతవారిని సర్దుబాటు చేయాల్సిందేనని, దీంతో మూడు జెడ్పీలకూ అరకొర సిబ్బందే దిక్కయ్యేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment