సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వలస కార్మికులకు ఉచిత క్వారంటైన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు లేఖ రాశారు. గల్ఫ్ నుంచి వచ్చిన వారికి ఉచితంగా క్వారంటైన్ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, కానీ, ఈనెల 9న కువైట్ నుంచి 163 మంది వలస కార్మికులను రూ.1,500 చొప్పున చెల్లించే పెయిడ్ హోటల్‌కు తీసుకెళ్లారని ఆ లేఖలో తెలిపారు. ఇందులో 9 మంది వద్ద డబ్బులు లేకపోవడంతో వారిని ఆ హోటళ్లలో ఉంచి ఖర్చులు చెల్లిస్తామని బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు. గల్ఫ్ కార్మికులను విదేశాల నుంచి రాష్ట్రానికి ఉచితంగా తీసుకురావాలని, వారికి ఎలాంటి రుసుం విధించకుండా క్వారంటైన్ ఏర్పాట్లు చేయాలని గతంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరిందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment