హైకోర్టు విభజనకు టీడీపీ మోకాలడ్డు: ఈటెల
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన, ఇతర అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం అంతంతమాత్రమేనని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హైకోర్టు విభజన ను టీడీపీ అడ్డుకుంటోందని అంటూ ఆ పార్టీ తో బీజేపీ చెట్ట్టపట్టాలు వేసుకుని తిరుగుతోం దని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగులు, కార్పొరేషన్లు, హైకోర్టువిభజన.. ఇలాఅన్ని విషయాల్లో సహకరించడం లేదన్నారు.
‘కాళ్లల్లో కట్టె పెట్టే విధంగా’ వ్యవహరిస్తూ కుట్ర పూరిత పద్ధతుల్లో వివిధ విభాగాల్లో విభజనకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని విమర్శిం చారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ మంత్రులు, ఏపీ ప్రభుత్వంలో బీజేపీ మంత్రులున్నారని ఆయన గుర్తుచేశారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రభుత్వ పద్దులపై చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ర్ట ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడం లేదని, ఆయా అంశాల వారీగా ప్రస్తావించారు. దీనిపై మంత్రి ఈటెల స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు.
విభజన ప్రక్రియ సరిగ్గా జరగకుండా టీడీపీ కుట్రలు చేస్తున్న విషయం అంగీకరిస్తారా లేదా అని మంత్రి ప్రశ్నించారు. కమలనాథన్ కమిటీ, హైకోర్టు, నదీ జలాలు, విద్యుత్ వంటి ముఖ్యమైన విషయాల్లో ఇది కొనసాగుతోం దని అన్నారు. తాత్కాలిక వసతి ఏర్పాటుచేస్తే హైకోర్టు విభజనకు తాము సిద్ధమని కేంద్రమంత్రి సదానంద్‌గౌడ చెప్పారని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అంటూ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల జాప్యం జరుగుతోందని ఆరోపించారు. దీనిపై ఈటెల స్పందిస్తూ సీఎం కేసీఆర్ ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నారని బదులిచ్చారు.
కేంద్రంతో ఘర్షణ వైఖరిని కూడా అవలంబించడం లేదన్నారు. న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ హైకోర్టు విభజన కోసం న్యాయవాదులు పోరాడుతున్నారని, దీనిపై అడిగితే ప్రక్రియ సాగుతోందని కేంద్రం నుంచి సమాధానమొచ్చిందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వజాప్యం ఎలా అవుతుందని ప్రశ్నిం చారు. సీఎం ముందుకొచ్చి స్థలం తామే ఇస్తామని చెప్పాకే కదలిక వచ్చిందన్నారు.