ప్రాణహిత ప్యాకేజీ 9లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్యాకేజీ 9లో భాగంగా మిడ్‌మానేరు నుంచి అప్పర్ మానేరు వరకు ఉన్న పనుల్లో మార్పులు చేస్తూ ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది. వచ్చే రెండేళ్లలో ఈ పనులు పూర్తిచేసేలా మార్పులను ఆమోదిస్తున్నట్లు పేర్కొంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రతిపాదిత డిజైన్‌లో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం... ఎల్లంపల్లి నుంచి కొమరవెల్లి మల్లన్నసాగర్ వరకు పలు మార్పులు చేసింది.
వీటి మధ్యలో ఉండే అనంతగిరి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.7 టీఎంసీల నుంచి 3.5 టీఎంసీలకు పెంచగా, ఇమామాబాద్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 0.8 టీఎంసీలకు తగ్గించింది. కొమరవెల్లి మల్లన్నసాగర్ సామర్థ్యాన్ని 1.50 టీఎంసీ నుంచి 50 టీఎంసీలకు పెంచింది. తాజాగా మిడ్‌మానేరు, అప్పర్ మానేరు మధ్యలో ఉన్న మలక్‌పేట బ్యారేజీ సామర్థ్యాన్ని 0.35 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచిం ది. నిజానికి ప్యాకేజీ 9 కింద మొత్తంగా 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ పనులకు మొత్తంగా రూ.714.96 కోట్ల అంచనాతో పనులు చేపట్టగా... రూ. 62 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి.