
నగరం నుంచి ప్రయాణించిన తొలి రైలు ఇదే...
1870 అక్టోబర్ 10న ప్రజా రవాణాలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. నిజాం స్టేట్ రైల్వే ఆవిర్భవించింది. దేశమంతా బ్రిటిష్ పాలకుల గుప్పిట్లో ఉండగా... వారి ప్రమేయం లేకుండా స్వతంత్ర రైల్వేగా అవతరించింది. రైలు ప్రయాణాన్ని నగరవాసులకుఅందుబాటులోకి తీసుకొచ్చింది. సికింద్రాబాద్ నుంచికర్ణాటకలోని వాడి మధ్య తొలి రైల్వే లైన్ వేయగా... 1874 అక్టోబర్ 10న 150 మంది ప్రయాణికులతో రైలు ప్రయాణం ప్రారంభమైంది. అలా మొదలైన ప్రయాణం నగరం నలుదిక్కులనూ కలుపుతూ విస్తరించింది.దినదినాభివృద్ధి చెంది భారత రైల్వేలోనే కీలకంగా మారింది. ఆధునిక హంగులద్దుకొని ఎంఎంటీఎస్, మెట్రో రూపంలో అందుబాటులోకివచ్చింది. నిజాం స్టేట్ రైల్వే ప్రస్థానం నేడు 150వపడిలోకి అడుగిడుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం
తొలి రైల్వేలైన్..
కర్ణాటకలోని బ్రిటిష్ రైల్వే జంక్షన్ వాడీతో అనుసంధానం చేసేలా 1870లో సికింద్రాబాద్ వాడీ లైన్ పనులు మొదలయ్యాయి. 1874 నాటికి పనులు పూర్తయ్యాయి. హైదరాబాద్ నుంచి తొలి రైల్ 1874 అక్టోబర్‌లో తొలి ప్యాసింజర్ రైలు మూడు బోగీలతో 150 మంది ప్రయాణికులతో నిజాం స్టేట్ రైల్వే ట్రాక్‌పై ట్రెయిన్ పరుగులు పెట్టింది. (సికింద్రాబాద్ నుంచి వాడీకి 185 కి.మీ) అదే రోజు ప్రాంభమైంది సికింద్రాబాద్ స్టేషన్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్వే ఇది. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్లు, జంక్షన్లు, స్టేషన్‌లు ఆనాటివే. కీలకమైన హైదరాబాద్– కాజీపేట– బెజవాడ లైన్ కూడా 1891 నాటికి రెడీ అయ్యింది. దీంతో మద్రాస్ రాష్ట్రంతో నిజాం స్టేట్‌కు దగ్గరి దారి కలిసింది. బొగ్గు రవాణా కోసం సింగరేణి పుట్టినిల్లు ఇలందుకు అప్పట్లోనే రైల్వే ట్రాక్ వేశారు.
ఎంఎంటీఎస్ ఇలా..
హైదరాబాద్‌లో ఇది శివారు రైలు వ్యవస్థ. తెలంగాణ ప్రభుత్వం, దక్షిణమధ్య రైల్వేల ఉమ్మడి భాగస్వామ్యంతో మొదలైంది. ఎంఎంటీఎస్‌ను మొదటి దశలో రూ.178 కోట్ల వ్యయంతో 2003 ఆగస్ట్ 9న ఏర్పాటు చేశారు. 43 కి.మీ మార్గంలో 27 స్టేషన్లు నిర్మించారు. ఒకటి లింగంపల్లి– బేగంపేట– హైదరాబాదు (నాంపల్లి). మరొకటి లింగంపల్లి– బేగంపేట– సికింద్రాబాద్– కాచిగూడ– ఫలక్‌నుమా మార్గం. రెండో దశలో 107 కి.మీ నిడివితో ఎంఎంటీఎస్‌ను చేపట్టాలని భారతీయ రైల్వే శాఖ 2010 మే నెలలో నిర్ణయించింది. రూ.632 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో 2012 మార్చిన 1న ఆమోదం పొందింది.
ఇది ఇంకా పూర్తి కాలేదు.
హైదరాబాద్ మెట్రో..
హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ 2017 నవంబర్‌లో నాగోలు– అమీర్‌పేట్– మియాపూర్ మార్గంతో ప్రారంభించారు. అనంతరం ఎల్‌బీనగర్– అమీర్ పేట మార్గం 2018 అక్టోబర్‌లో ప్రారంభమైంది. అమీర్‌పేట– హైటెక్ సిటీ మార్గం 2019 మార్చి నెలలో ప్రారంభించారు. హెదరాబాద్ మెట్రో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రోగా గుర్తింపు పొందింది.
ఢిల్లీని కలిపేమరో లైన్..
దేశ రాజధాని ఢిల్లీని కలిపే మరోలైన్ కాజీపేట– బలార్షా. అత్యంత కీలకమైన పనులు 1921లో ప్రారంభమై దశలవారీగా పూర్తయ్యాయి. పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్ నగర్‌లను కలుపుతూ 1928 నాటికి సంపూర్ణంగా వినియోగంలోని వచ్చింది ఈ మార్గం. సికింద్రాబాద్– గద్వాల లైన్ 1914లో ప్రారంభమై 1916 నాటికి ఉపయోగంలోకి వచ్చింది. కారేపల్లి కొత్తగూడం లైన్ 1925 నాటికి పని చేయడం ప్రారంభించింది. ముథ్యేడ్– ఆదిలాబాద్ లైన్ 1931లో వాడుకలోకి వచ్చింది. ఇలా హైదరాబాద్ నుంచి నలువైపులా పర్చుకున్న పట్టాలన్నీ నిజాంల కాలం నాటివే. హైదరాబాద్ సహ జిల్లాల్లోని స్టేషన్లన్నీ అప్పట్లోనిర్మించినవే.
స్వాతంత్య్రానికి పూర్వమే..
1891 నాటికి నిజాం రైల్వే స్టేట్ వేసిన బ్రాడ్ గేజ్ లైన్ 467 మైళ్లు. 1901 నాటికి 391 మైళ్ల మీటర్‌గేజ్ లైన్లు నిర్మించారు. 1884లో నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే కంపెనీగా రూపాంతరం చెందింది ఈ సంస్థ. తిరిగి 1930లో పూర్తిగా హైదరాబాద్ స్టేట్ అధీనంలోకి వచ్చింది. నిజాం స్టేట్ రైల్వేకు అనుబంధంగా మరో సంస్థ ఉండేది. అదే గోదావరి వ్యాలీ రైల్వే. మహారాష్ట్రలోని మన్మాడ్‌ను లింక్ చేసే ప్రధాన లైన్ 1897లో మంజూరైంది. 1900లో హైదరాబాద్ మన్మాడ్‌ల మధ్య రైళ్ల రాకపోకలుమొదలయ్యాయి.
1907లో నాంపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం..
నాంపల్లి రైల్వే స్టేషన్ 1907లో మీర్ మహబూబ్‌అలీ ఖాన్ హయాంలో నిర్మించారు. 1921 వరకు ప్రయాణికులకు అనుమతించలేదు. స్టేషన్‌ను గూడ్స్ రైళ్ల కోసం వినియోగించారు. అప్పట్లో బొంబాయి తదితర ప్రదేశాల నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే సరుకులను నాంపల్లికి తీసుకురావడానికి అనుకూలంగా ఉండేది.
కాచిగూడ..
కాచిగూడ రైల్వే స్టేషన్ 1916లో ఏడో నిజాం మీర్‌ఉస్మాన్ అలీఖాన్ హయాంలో నిర్మించారు. నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే హెడ్ క్వార్టర్‌గా ఏర్పాటు చేశారు.
ఉత్తరాది ప్రాంతాలకు ఎక్కువగా..
అప్పటి నిజాం పాలకులు ప్రజా రవాణా కోసం 1870లో రైల్వేను ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో ముంబై వెళ్లడానికి రైల్వేలైన్ రావడంతో నగరంలో వ్యాపారం పెరిగింది. మా తండ్రీ తాతలు ఎక్కువ శాతం ఉత్తరాది ప్రాంతాలకు రైళ్లలోనే ప్రయాణం చేసేవారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రజా సౌకర్యార్థం ఉనికిలోకి వచ్చే అత్యాధునిక వస్తువులు రైలు మార్గం ద్వారా తీసుకొచ్చే వారు.– అల్లామా ఎజాజ్ ఫరూఖీ
మా నాన్నరైలులోనే వెళ్లేవారు..
రవాణా వ్యవస్థ సక్రమంగా ఉంటేనే ఏ ప్రాంతమైనా త్వరితగతిన అభివృద్ధి సాధిస్తుంది. అప్పటి నిజాం పాలకులు హైదరాబాద్ సంస్థానాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథాన తీసుకెళ్లేందుకురైల్వే వ్యవస్థను ప్రారంభించారు. దీంతో హైదరాబాద్ సంస్థానం ఇతర ప్రదేశాలతో అనుసంధానమైంది. వ్యాపార లావాదేవీలు పెరిగాయి. మా నాన్న ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ఎక్కువ శాతం రైళ్లనే వినియోగించేవారు. ఆ రోజుల్లో ఆయనబ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో తయారయ్యే పలు వస్తువులు తీసుకొచ్చారు. – అబ్దుల్ నయీం
ప్రతిపాదన.. తిరస్కరణ
1857 తర్వాత బ్రిటిష్ పాలకులు హైదరాబాద్‌ను కలుపుతూ గ్రేట్ ఇండియన్ రైల్వే లైన్ వేయాలని ప్రతిపాదించారు. ఇందుకు నిజాం పాలకులు ససేమిరా అన్నారు. తమ రాజ్యంలో బ్రిటిష్ చొరబాటును ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. అభివృద్ధికి ఆధునిక అవసరాలను గుర్తించిన నిజాం సర్కారు సొంత రైల్వే వ్యవస్థను నెలకొల్పాలని నిర్ణయించింది. నిజాం స్టేట్ రైల్వే పేరుతో 1870 అక్టోబర్ 10న పురుడు పోసుకున్నట్లు చరిత్రకారులు చెబుతుంటారు. దీనికి సాలార్‌జంగ్ నిజాం రైల్వేకు ప్రాణం పోశాడని అంటుంటారు. లండన్ ధనం.. మార్కెట్ నుంచి రుణం తీసుకున్నారు. 6 శాతం గ్యారంటీ ఇచ్చి మరీ మూలధనాన్ని సేకరించారు.
1966 నుంచిసౌత్‌సెంట్రల్ రైల్వేగా..
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అన్ని ప్రధాన లైన్లు, జంక్షన్లు, స్టేషన్లు నిజాం హయాంలో నిర్మించినవే. హైదరాబాద్‌ను ఉత్తర దక్షిణ భారతాన్ని కలిపే రైల్వే లైన్ పనులన్నీ 19వ శతాబ్దంలోనే పూర్తయ్యాయి. 1951 నాటికి 2,353 మేర కి.మీ పట్టాలను పరిచారు. నిజాం స్టేట్ రైల్వేను 1950లో కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సెంట్రల్ రైల్వేలో విలీనం చేసింది. 1966 నుంచి సౌత్ సెంట్రల్ రైల్వేగా మారిపోయింది.
అద్దెకు కచ్చురాలు..
ప్రభుత్వ రైలు రవాణా వ్యవస్థకు ముందు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైనా, వివాహ శుభ కార్యాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వచ్చినా 150 ఏళ్ల క్రితం ఎద్దుల బండ్లను అద్దెకు తీసుకొని వెళ్లేవారు. అప్పట్లో దొరలు, జమీన్‌దారులు, భూస్వాములు, ధనికుల వద్ద ఎద్దు బండ్ల కచ్చురాలు ఉండేవి. రోజుల చొప్పున వాటిని అద్దెకు ఇచ్చేవారు. అప్పట్లో ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తేది.
నిజాంకు ప్రత్యేక రైలు
నిజాం పాలకులు ప్రయాణించడానికి ప్రత్యేక రైలు బోగీని తయారు చేయించారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1904లో ఢిల్లీ దర్బార్‌కు ఈ ప్రత్యేక రైలులోనే వెళ్లారు. ఈ రైలులో నిజాం పాలకుల కోసం బెడ్రూం, కిచెన్, సెలూన్, బాత్రూం ఉండేవి.్ఢసికింద్రాబాద్ గూడ్స్ రైలు గ్యారేజ్‌లోఈ రైలు ఉండేది.
ఇంకో ప్రత్యేకత..
నిజాం రైల్వేకున్న మరో ప్రత్యేకత ఉమ్మడి రైల్, రహదారి వ్యవస్థ. 1932 జూన్ 15న రోడ్డు, రైలును లింక్ చేస్తూ జెట్‌స్టీమ్‌ను తయారు చేశారు. దేశంలో ఇది తొలి ప్రయోగం. 1930లోనే మిచెల్ కార్కిక్ కమిటీ దేశంలో రోడ్డు– రైలు రవాణా వ్యవస్థలను ఒకే సంస్థ నిర్వహణలో ఉంచాలని సిఫార్సు చేస్తూ నివేదిక ఇచ్చింది. ఇతర రాష్ట్రాల్లో ఈ సిఫార్సులు అమలు చేయడం సాధ్యపడలేదు. హైదరాబాద్ స్టేట్ వెంటనే వీటిని అమలులో పెట్టి అద్భుత ఫలితాలను సాధించింది. మొత్తం దేశానికికే ఆదర్శంగా నిలిచింది.
ప్రపంచంలోనే తొలి స్వతంత్ర రైల్వే వ్యవస్థ
హైదరాబాద్ స్టేట్. ఈ పేరు వినగానే ఘనమైన గతం కళ్ల ముందు కదలాడుతుంది. దేశంలోనే సుసంప్నమైన రాష్ట్రంలో అన్నీ అద్భుతాలే. ప్రపంచంలోనే ధనవంతులైన నిజాంల హయాంలో ప్రతిదీ ప్రత్యేకమే. నిజానికి ఇదో దేశం. బ్రిటిష్ వలస పాలన నీడకు దూరంగా ఎదిగిన ఈ సంస్థానంలో నిజాంలకు సొంత కరెన్సీ, పోస్టల్, ఎయిర్‌వేస్ ఉండేవి. వీటికితోడు మరో అరుదైన ఖ్యాతిని కూడా నిజాం స్టేట్ సొంతం చేసుకుంది. అదే సొంత రైల్వే వ్యవస్థ. భారత దేశంలోసొంత ధనంతో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నంది హైదరాబాద్ ఒక్కటే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment