ప్రవాస భారతీయుల హక్కుల మరియు సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నర్సింహ నాయుడుకు వినతి పత్రం అందజేస్తున్న అంకమోళ్ల సుజాత
నిజామాబాద్,పెర్కిట్(ఆర్మూర్): ఉపాధి కోసం సౌదీ అరేబియా దేశానికి వెళ్లిన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన అంకమోళ్ల రవి యజమాని చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్నాడని అతని భార్య సుజాత పేర్కొన్నారు. రవి ఆరు సంవత్సరాల క్రితం సౌదీ వెళ్లాడు. అక్కడ ఒక యజమాని వద్ద తోట పని, ఒంటెల కాపరిగా పని చేస్తున్నాడు. నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత సెలవుపై ఇంటికి పంపాల్సి ఉండగా యజమాని రవి పాసుపోర్టు, వీసాను లాక్కొని ఆరు సంవత్సరాలుగా చాకిరీ చేయిస్తున్నాడని, అలాగే ఆరు నెలల నుంచి వేతనం సైతం ఇవ్వడం లేదని సుజాత వాపోయింది.
ఈ విషయమై సుజాత ఈ నెల ఒకటో తేదీన సౌదీలోని భారత రాయబార కార్యాలయానికి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు వినతి పత్రం అందజేసిన చలనం లేదంది. దీంతో ఈ మెయిల్ ద్వారా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ప్రవాస భారతీయుల హక్కుల, సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహ నాయుడును కలిసి వినతి పత్రం అందజేసింది.
Comments
Please login to add a commentAdd a comment