తీరు మారని సర్కారు బడి
12న పాఠశాలలు పునః ప్రారంభం
ఈసారీ తప్పని చెట్ల కింద చదువులు!
చాలా చోట్ల ఏకోపాధ్యాయులే
మెరుగు పడని మౌలిక వసతులు
మరుగుదొడ్లు లేని స్కూల్లెన్నో..
మరో నాలుగు రోజుల్లో బడులు పునఃప్రారంభం కానున్నాయి. అయితే కొత్త తరగతిలోకి కొత్త ఉత్సాహంతో వెళ్తున్న విద్యార్థులకు పాత సమస్యలే స్వాగతం పలుకనున్నాయి. పైకప్పు లేని గదులు, గదుల కొరతతో చెట్ల కిందే చదువుకున్న అనుభవం మరోసారి ఎదురుకానుంది. ఉపాధ్యాయుల కొరత, మరుగు దొడ్లు, మూత్ర శాలలు లేని పాఠశాలలు ఎన్నో.. ఇలా ప్రభుత్వ పాఠశాలలు అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నాయి
ఇదీ సక్సెస్ స్కూలు
వర్ని మండల కేంద్రం వడ్డేపల్లిలోని సక్సెస్ స్కూలు ఇది. 45 ఏళ్లపాటు రేకుల షెడ్డు, మరో నాలుగు గదుల్లో హైస్కూల్ కొనసాగింది. 25 ఏళ్లలో మంజూరైంది ఒకే ఒక్క తరగతి గది. ఇటీవలే దీనిని సక్సెస్ స్కూలుగా మార్చారు. ఈ రేకుల షెడ్డు కిందే ‘సక్సెస్’ విద్యార్థులు చదువుకోవాల్సి వస్తోంది :మౌలిక వసతుల కల్పనలో పాలకులు, అధికారులు చెబుతున్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి పిల్లలు అసౌకర్యాల మధ్యనే విద్యాభ్యాసం చేయాల్సి వస్తోంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో 1,576 ప్రాథమిక పాఠశాలలు, 263 ప్రాథమికోన్నత పాఠశాల లు, 478 ఉన్నత పాఠశాలలు ఉన్నా యి. ఇందులో సుమారు రెండున్నర లక్షల మంది విద్యార్థులున్నారు. 10 వే ల మంది టీచర్లు పనిచేస్తున్నారు. కానీ చాలా పాఠశాలల్లో సమస్యలు తిష్టవేసుకొని ఉన్నాయి. 462 ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేవు. 164 పాఠశాలలకు అదనపు గదులు అవసరమున్నాయి. 612 పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. 152 పాఠశాలలకు విద్యుత్ సౌకర్యం లేదు. సరిపోయేన్ని తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు చెట్ల కిందే చదువుకోవాల్సి వస్తోంది. కొన్ని చోట్ల ఒకే గదిలో రెండు మూడు తరగతులనూ నిర్వహిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా జుక్కల్ మండలంలోని 14 పాఠశాలల్లో ఒక్కో టీచరే ఉన్నారు.
డిచ్‌పల్లి మండలంలోని ఆరు తం డాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో, కామారెడ్డి డివిజన్‌లోని 33 ఉన్నత పాఠశాలల్లో తరగతి గదుల కొరత తీవ్రంగా ఉంది. ఆయా పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణానికి రెండు విడతల్లో నిధులు మంజూరైనా.. గదుల నిర్మా ణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. 133 తండాల్లో గదులు లేక చెట్ల కింద, ఒకే తరగతి గదిలో విద్యాబోధన కొనసాగుతోంది. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. కొన్ని చోట్ల తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. కొన్ని గదుల రేకులు విరిగి పోయాయి. గదు లు కూలిపోయాయి. జిల్లా కేంద్రంలోని కోటగల్లి బాలికల పాఠశాల, వినాయక్‌నగర్‌లోని ప్రాథమిక పాఠశాల, దుబ్బ ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలల్లో రేకులు విరిగిపోయాయి.
పట్టించుకోని అధికారులు
పాఠశాలలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అధికారులు ఆ బాధ్యతను విస్మరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోతున్నాయి. మరోవైపు రాజీవ్ విద్యామిషన్ నుంచి కోట్లాది రూపాయలు మంజూరవుతున్నా.. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. అవసరం లేని చోట అదనపు గదులు నిర్మించిన దాఖలాలున్నాయి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలో నాలుగు పాఠశాలల్లో కలిపి 22 మంది విద్యార్థులే ఉన్నారు. కానీ అవసరం లేకున్నా ఆ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో, తండాల్లో విద్యార్థులు ఎక్కువగా ఉన్నా.. ఆయా పాఠశాలలకు తరగతి గదులు మంజూరు చేయడం లేదు.