సర్కార్ బడులు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయి. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.
నేడు విద్యాశాఖ మంత్రి సమీక్ష
సంగారెడ్డి మున్సిపాలిటీ: సర్కార్ బడులు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయి. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. శిథిల భవనాలు భయపెడుతున్నాయి. గదుల కొరతతో ఆరుబయటే పాఠాలు. కనీస సౌకర్యాల దిక్కే లేదు. ఈ దశలో ప్రభుత్వ పాఠశాలల వైపు రావడానికి విద్యార్థులు జంకుతున్నారు. బడిబాట కార్యక్రమాన్ని పెట్టినా ఆశించిన మేర విద్యార్థులు చేరకపోవడం ఇందుకు నిదర్శనం.
ఈ పరిస్థితుల్లో సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మంగళవారం సంగారెడ్డిలో విద్యా వ్యవస్థపై ఆ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నెల కొన్న విద్యారంగ సమస్యలను ఏ మేరకు పరిష్కరిస్తారనే ఆసక్తితో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,974 ప్రాథమిక పాఠశాలలు, 420 ప్రాథమికోన్నత, 502 ఉన్నత పాఠశాలల్లో 3.50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు.
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్‌తోపాటు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈనెల 2 నుంచి 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించినా ఆశించిన స్థాయిలో సర్కార్ బడుల్లో విద్యార్థులు చేరలేకపోయారు. మరోవైపు జిల్లాలో 3,289 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఫలితంగా 127 పాఠశాలలు ఉపాధ్యాయులు లేక మూతపడే పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి, మూత్రశాలల సదుపాయం కల్పించాలి. కానీ జిల్లాలో ఇప్పటివరకు 1,260 పాఠశాలల్లో విద్యార్థులు తాగేందుకు నీటి వసతిని కల్పించలేకపోయారు. 13 పాఠశాలల్లో కనీసం మరుగుదొడ్లు నిర్మించలేని పరిస్థితి. మొత్తంగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. మరోవైపు ప్రైవేటు పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ స్థానికంగా ఉపాధ్యాయుల్లో నెలకొన్న సమన్వయంతోపాటు ఉపాధ్యాయుల కొరత, తరగతి గదులు సరిపోనందున కేవలం 117 పాఠశాలల్లోనే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నిర్వహించే సమీక్ష సమావేశంలో ఏ మేరకు సమస్యలను పరిష్కరిస్తారో వేచి చూడాలి.