ఖమ్మం జెడ్పీసెంటర్ : ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని వామపక్ష పార్టీల నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రభుత్వం మెడలు వంచైనా అమలు చేయిస్తామని చెప్పారు.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు సీసీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్), ఇతర వామపక్ష పార్టీల కార్యకర్తలు పెవిలియన్ గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ ప్రదర్శనగా మయూరి సెంటర్, బస్టాండ్, వైరారోడ్డు, జడ్పీసెంటర్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు అక్కడ ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో కలెక్టరేట్ రెండో గేటు వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు, ఆ తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. అధికారంలోకి వ చ్చి ఐదు నెలలు గడిచినా ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వాలలో రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదా, ఐదు నెలల్లోనే అభివృద్ధి జరుగుతుందా అని కేసీఆర్ మాట్లాడడం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమన్నారు. దళిత, గిరిజనులకు భూములు ఇవ్వాలంటే 30 లక్షల ఎకరాలు కొనుగోలు చేయాలని, అందుకు రూ.90 వేల కోట్లు కావాలని, అయితే బడ్జెట్‌లో రూ.1000 కోట్లు మాత్రమే ప్రవేశపెడితే ఎలా అని ప్రశ్నించారు.
అటవీ అధికారుల చేతికి ఆయుధాలిచ్చి పోడుభూముల్లో సాగుచేసుకుంటున్న గిరిజనులను ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ కేసీఆర్ పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని హామీలు గుప్పించారని, ఇప్పటి వరకు ఏఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్నలు 350 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. మూడేళ్ల పాటు కరెంట్ కష్టాలు తప్పవని చెబితే ప్రజలు ఎలా బతకాలని, రైతులపై ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు 15 లక్షల ఎకరాలు పంచుతామనిచెప్పిన కేసీఆర్ ప్రభుత్వం జిల్లాలో 22 గ్రామాల్లో 72 ఎకరాలు పంచి చేతులు దులుపుకుందన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ కేసీఆర్‌కు రైతుల ఆత్మహత్యలు కనపడటం లేదా అని ప్రశ్నించారు.
పక్కన ఉన్న చంద్రబాబును తిడుతూ కాలం వెళ్లదీస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. తెరపైకి మాత్రం ఇద్దరు ముఖ్యమంత్రులు తిట్టుకుంటున్నారని, ఇద్దరూ ఒకే పార్టీలో పెరిగినవారేనని అన్నారు. తెరవెనుక ఏం రాజకీయం చేస్తున్నారో వారికే తెలియాలన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే కమ్యూనిస్టుల తడాఖా చూపిస్తామని హెచ్చరించారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంత్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ పేరుతో కాలయాపన చేస్తున్నారని, ఐదు నెలలు గడిచినా ఏ ఒక్క హామీనీ అమలు చేయకపోవటం దారుణమని విమర్శించారు. 1.40 లక్షల మందికి రుణమాఫీ అని ప్రభుత్వం చెపితే, అధికారులు మాత్రం లక్షమందికి వస్తుందని అంటున్నారని చెప్పారు.
రేషన్‌కార్డులు, పెన్షన్‌లలో కోత పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు కెచ్చల రంగయ్య, న్యూడెమోక్రసీ నాయకులు గౌని అయిలయ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి బుగ్గవీటి సరళ, సీపీఎం నాయకులు నున్నా నాగేశ్వరరావు, ఎర్రా శ్రీకాంత్, గుగులోత్ ధర్మా, సీపీఐ నాయకులు అయోధ్య, పోటు ప్రసాద్, పోటు కళావతి, న్యూడెమోక్రసీ నాయకులు గుమ్మడి నర్సయ్య, చండ్ర అరుణ, ఆవుల వెంకటేశ్వర్లు, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
కామ్రేడ్‌ల కన్నెర్ర
Published Thu, Nov 6 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
Advertisement
Advertisement