వంద రోజుల్లో ఒరిగిందేమీలేదు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలులో పూర్తిగా విఫలమైందని పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. వందరోజుల టీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అట్టహాసంగా ప్రకటించిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ శుక్రవారం కలెక్టరేట్ ముట్టడి నిర్వహించింది. ధర్నా సందర్భంగా ఉదయం 11 గంటలకు జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి కార్యకర్తలు, నాయకులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారిగా తలపెట్టిన ఆందోళన కార్యక్రమమిది. దీంతో డీసీసీ సైతం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
దాదాపు గంటపాటు సాగిన ధర్నాతో ఖైరతాబాద్- లక్డీకాపూల్ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు కార్యకర్తలు కలెక్టరేట్‌వైపు దూసుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా వ ూరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అగ్రనేతలతోపాటు ఆందోళనకారులను అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. ధర్నాలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అగ్ర నేతలు హాజరయ్యారు. అయితే మాజీ హోంమంత్రి సబితారెడ్డి హాజరుకాలేదు.
ఇది ఆరంభం మాత్రమే: పొన్నాల
టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ధర్నాలో పాల్గొన్న ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతనలేదన్నారు. రుణమాఫీ, కరెంటు సమస్య, విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.
అనంతరం పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం కనీసం ఆయా కుటుంబాలను పరామర్శించలేని పరిస్థితిలో ఉందన్నారు. పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినా విద్యుత్ అధికారులు స్పందించడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో క్షణాల్లో ఈ సమస్య పరిష్కరించామని అన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని, ఆర్నెళ్లలో ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ధర్నాలో మాజీ మంత్రులు దానం నాగేందర్, జి.ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు డి.సుధీర్‌రెడ్డి, కె.శ్రీశైలంగౌడ్, డీసీసీ అధ్యక్షులు జి.వెంకటస్వామి, డీసీసీ ఇన్‌చార్జ్ క్యామ మల్లేష్, సీనియర్ నాయకులు కోదండరెడ్డి, ఉద్దెమర్రి నర్సింహారెడ్డి, కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.