అభివృద్ధా.. కనపడదే?
మార్‌క్సనగర్, సాయిమాణిక్‌నగర్ సిద్ధార్థనగర్, సంజీవ్‌నగర్ తదితర కాలనీలలో ఎటుచూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. దారిగుండా ముక్కుమూసుకొని దాటడమే కానీ ఎవరూ ఈ మురికిని పట్టించుకున్న పాపానపోలేదు. ఎన్నికల సమయంలో అభివృద్ధిపై ఎమ్మెల్యేలు, వార్డు కౌన్సిలర్లు సైతం హామీలు గుప్పించి.. అధికారంలోకి వచ్చాక కాలనీ వైపే చూడడం మానేశారు.
- కాలనీలలో అన్నీ సమస్యలే..
- కనీస వసతులు ఉండవు
- అధికారులకు అసలే పట్టదు..
- పాలకులు పట్టించుకోరు..
సంగారెడ్డి మున్సిపాలిటీ: సాయిమాణిక్ నగర్.. ఈ కాలనీ ఎక్కడో మూలన లేదు. ప్రధాన రహదారికి కేవలం 500 మీటర్ల దూరంలోనే కాలనీ ఉంది. ఈ కాలనీలో బ్యాంక్, పరిశ్రమలకు చెందిన ఉన్నతోద్యోగులు నివసిస్తున్నారు. కాలనీ ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా.. ఇంతవరకూ అభివృద్ధి జాడే లేదు. కౌన్సిలర్‌గా గెలుపొంది ఏడాది పూర్తయినా.. ఏ ఒక్కరోజూ కాలనీ పరిస్థితిని కౌన్సిలర్ పరిశీలించిన పాపానపోలేదు. సమస్యల పట్ల పలు మార్లు అధికారులకు.. కౌన్సిలర్లకు విన్నవించినా.. పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపించారు. మార్స్స్‌నగర్, సిద్దార్థనగర్, సంజీవ్‌నగర్‌లలో సైతం సమస్యలు తిష్టవేసినా.. వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు.
ఈ ప్రాంతంలో అధికంగా ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర బలహీనవర్గాల వారే ఎక్కువగా ఉన్నారు. ఈ కాలనీలో కనీసం మురికికాల్వలు లేకపోయాయి. ఇక్కడున్నవారంతా ఓపెన్‌డ్రైనేజ్ పద్ధతినే అవలంభిస్తున్నారు. దీంతో వర్షకాలం వచ్చే వరదనీటితో పాటు డైనేజీలో నుంచి ముక్కుపుటాలదిరే దుర్గంధం వెదజల్లుతోంది. కానీ ఇంతవరకు మురికికాల్వలు నిర్మించలేకపోయారు. సాయిమాణిక్ నగర్‌లో సైతం డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేనందున గోకుల్ వెంకటేశ్వర ఆస్పత్రి నుంచి వచ్చే మురికి నీరు కాలనీల మధ్య వచ్చి నిల్వ ఉంటుంది.
దీంతో పందులు సంచరిస్తున్నాయి. దీనికి తోడు కచ్చాకాల్వలు కూడా లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడే మురికి గుంటలు దర్శనమిస్తున్నాయి. పట్టణంలో గతేడాది డెంగీవ్యాధి వచ్చిన వారిలో అధికంగా ఈ కాలనీ వారే ఉండటం గమనార్హం.. అధికారులు అన్ని కాలనీలను అభివృద్ధి చేశాం అని చెబుతున్నా.. ఈ కాలనీలో మాత్రం ఒక్క అడుగు మురికి కాల్వలు కూడా నిర్మించలేకపోయారు. ఈ కాలనీలో చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. నెల రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉండటంతో ఈ కాలనీ చెత్తకాలనీగా తయారైంది. కాలనీలో మురికికాల్వలు, వీధిదీపాలు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోయాయి.
ప్రతిపాదనలు పంపాం..
మార్‌క్సనగర్, సాయిమాణిక్‌నగర్ లో.. ఇటీవల 13 ఆర్థిక సంఘం నిధులతో పాటు జనరల్ ఫండ్ నుంచి మురికికాల్వల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగింది. రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైతే త్వరలోనే పనులు చేపడతామన్నారు..
- గయాసొద్దీన్, మున్సిపల్ కమిషనర్