హన్మకొండలోని జేఎన్‌ఎస్‌లో ఉన్న వరంగల్ రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్ భవనం
వరంగల్ స్పోర్ట్స్: హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం ఆవరణలో ఉన్న వరంగల్ రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్ భవనానికి సుస్తి చేసింది. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం కావడంతో శిథిలావస్థకు చేరింది. పగుళ్లు ఏర్పడి, పెచ్చులూడిన పైకప్పు నుంచి ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు భవనంలోని గోడలు తడిసి పాకురు పట్టాయి. అయినా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. నేడు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని హాస్టల్ స్థితిగతులు, క్రీడాకారుల వసతులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా చెప్పుకుంటున్న వరంగల్ అందుకు తగ్గట్టుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. క్రీడాకారులకు పెద్ద పీట, క్రీడల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్న పాలకుల హామీలు కాగితాల్లోనే పరిమితమయ్యాయి. జేఎన్‌ఎస్‌లోని వరంగల్ రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్‌లో అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, జిమ్నాస్టిక్స్ క్రీడల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ మూడు ఆటల క్రీడాకారుల్లో ప్రస్తుతం 108 మంది క్రీడాకారులు ఉంటున్నట్లు డీఎస్‌ఏ అధికారులు చెబుతున్నారు.
అందులో 38మంది బాలికలు కాగా, మిగిలిన వారు బాలురు ఉంటున్నారు. సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోగా రెండేళ్ల క్రితం బాలురను స్టేడియం ఆవరణలో నిర్మించిన కొత్త భవనంలోకి మార్చారు. బాలికలు మాత్రం పాత భవనంలోనే ఉంటున్నారు. ఇందులోనే క్రీడాకారులకు భోజనం వడ్డిస్తుంటారు. ఇక కొత్తగా నిర్మించిన భవన నిర్మాణంలో జరిగిన లోపాల వల్ల వర్షాలు కురిసిన ప్రతీసారీ వర్షపు నీరు హాస్టల్ వరండాలోకి చేరుతోంది. దీంతో క్రీడాకారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఫస్ట్ ఎయిడ్ కిట్టు లేదు..
ప్రమాదకరంగా భావించే జిమ్నాస్టిక్‌తోపాటు సాధారణంగా గాయాలు తగిలే అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్ క్రీడాకారులకు కనీసం ప్రాథమిక చికిత్స అందించే మందులు లేవు. చిన్నపాటి దెబ్బలు తగిలినప్పుడు క్రీడాకారులకు అప్లై చేసే పెయిన్ కిల్లర్ జెల్ కూడా హాస్టల్ క్రీడాకారులకు అందుబాటులో లేదు. అంతేకాదు జ్వరమొస్తే వేసుకునే పారాసెటమాల్ టాబ్లెట్లు కూడా లేకపోవడం విశేషం. జ్వరమొచ్చినా, చిన్న పాటి గాయమైన సంబందిత కోచ్ క్రీడాకారుడిని వెంటబెట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
108 మంది క్రీడాకారుల హెల్త్‌బడ్జెట్ రూ.3 వేలే..
స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉంటున్న 108 మంది క్రీడాకారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ రూ.3వేలే కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న తరుణంలో కనీసం డెంగీ పరీక్ష చేసి, పది రోజులకు మందులు వాడాలంటేనే ఒక్కరికి కూడా ఆ సొమ్ము సరిపోదన్న విషయం తెలిసిందే. అలాంటి సమయంలో క్రీడాకారుడికి మేజర్‌గా గాయాలైన, ఇంకేమైనా మొదట ఖర్చు చేసి ఆ తర్వాత ‘సాట్’కు బిల్లులు పంపిస్తే అప్పుడు ఖర్చులు వెచ్చిస్తుందట. ఇదీ మన ప్రభుత్వం క్రీడాకారుల సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యం.
కొత్త భవనానికి ప్రతిపాదనలు పంపించాం
శిథిలావస్థలో ఉన్న భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాలని కోరుతూ జిల్లా కలెక్టర్, సాట్ చైర్మన్, ఎండీలకు ప్రతిపాదనలు పంపించాను. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని వారానికోసారి స్పోర్ట్స్ హాస్టల్‌లో మెడికల్ క్యాంపు నిర్వహించాలని కోరాం. పిల్లలకు జ్వరం వచ్చినా, చిన్న గాయమైనా మేము దగ్గరుండి ఆస్పత్రికి తీసుకెళ్తాం.
– ధనలక్ష్మి, డీవైఎస్‌ఓ, వరంగల్ అర్బన్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment