సీట్లు పెరగకున్నా నష్టం లేదు
ఉన్న సీట్లతోనే సంతృప్తిగా ఉన్నాం: సీఎం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచినా, పెంచకున్నా రాజకీయంగా తమకు లాభనష్టాలేమీ ఉండబోవని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘ఉన్న సీట్లతోనే సంతృప్తిగా ఉన్నాం. మాకిప్పటికే 90 మంది ఎమ్మెల్యేలున్నారు. మిగతా 29 సీట్లలో ఏడు ఎంఐఎంకు ఇచ్చినా మిగతా 22 సీట్లకు మేమే అభ్యర్థులను వెతుక్కోవాల్సి ఉంటది. టీఆర్‌ఎస్‌కు ఢోకా లేదు. రాజకీయంగా సుస్థిరంగా ఉంది. చిన్న రాష్ట్రాల్లో తక్కువ అసెంబ్లీ సీట్లుంటే రాజకీయ అస్థిరత ఉంటుందనే విభజన చట్టంలో ఈ విషయాన్ని పొందుపరిచారు. కానీ రాజ్యాంగ సవరణతో సంబంధం లేకుండా అని వాడాల్సిన చోట రాజ్యాంగ సవరణతో అని ముడిపెట్టారు. ఇందుకు జైరాం రమేశ్ అజ్ఞానమే కారణం. ఇటీవల ప్రధానిని కలిసినప్పుడు పునర్విభజన అంశం చర్చకు వచ్చినప్పుడు నేనేమనుకుంటున్నానని ఆయన అడిగారు. రాజకీయంగా మాకు లాభనష్టాలేమీ లేవు గానీ విభజన చట్టంలో ఉందని గుర్తుచేశా. పునర్విభజన ఇప్పట్లో జరగదని ఆయన మాటలను బట్టి అర్థమైంది’’ అని వివరించారు. వివిధ అంశాలపై సీఎం ఏమన్నారంటే..
కొత్త సచివాలయం కడుతం
బైసన్ పోలో గ్రౌండ్ ఇస్తామని ప్రధాని మాటిచ్చారు. ఆ భూమిని కేవలం సచివాలయం కోసమే అడగలేదు. శాసనసభ, తెలంగాణ కళాభవన్ అక్కడే నిర్మిస్తాం. అసెంబ్లీ శిథిలావస్థకు చేరుతోంది. ఒక సంగీత విభావరి నిర్వహించాలంటే రవీంద్రభారతి చాలదు. మూడు నాలుగు వేల మంది కూర్చునే హాల్ లేదు మనకు. రాజీవ్ రహదారి, మేడ్చల్ జాతీయ రహదారులను విస్తరించాలి. ప్యారడైజ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ దాకా పీవీ ఎక్స్‌ప్రెస్ వే లాంటి రోడ్డు వేయాలి. అందుకే మొత్తం 52 ఎకరాలు అడిగినం. అక్కడ కూడా కేసు వేశారు. గచ్చిబౌలి స్టేడియంలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. స్పోర్ట్స్ స్కూల్‌లోనూ ఆటల్లేవు. ఉప్పల్ స్టేడియం ఖాళీగా ఉంటోంది. సిటీలో 500 ఎకరాల విస్తీర్ణంలో క్రీడా మైదానాలున్నాయి. జింఖానా గ్రౌండ్స్‌ను మేమేమన్నా తీసుకున్నమా?
రిజర్వేషన్లపై ఏదోటి తేల్చాలని కోరా..
బీసీ–ఈ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుకు ప్రధాని సానుకూలత వ్యక్తం చేశారు. ఇటీవల ఆయన్ను కలిసినప్పుడు.. దీనిపై అసెంబ్లీ చట్టం చేసి పంపిందని ప్రస్తావించాను. ఆర్థికంగా వెనుకబాటుతనం ఉండకూడదని, ముస్లింలలో వెనుకబాటును పారదోలాలని ప్రధాని సైతం ప్రకటించారు. రిజర్వేషన్లపై ఏదోటి తేల్చాలని ప్రధానిని కోరా. వచ్చే పర్యటనలో ఇదే విషయంతో వస్తానని కూడా చెప్పా. తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి అమలు చేసే రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకాన్ని ప్రధానికి వివరించా. దేశమంతా అమలు చేయమని చెప్పా. ప్రధాని కూడా మెచ్చుకున్నారు. దీనిపై ప్రత్యేకంగా నోట్ తయారు చేసి పంపించమన్నారు. ఈసారి పర్యటనకు వెళ్లినప్పుడు ఆ నోట్‌ను ఇవ్వాల్సి ఉంది.
మద్దతు పలికినంత మాత్రాన బీజేపీతో పొత్తేమీ లేదు..
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థులకు మద్దతు పలికినంత మాత్రాన బీజేపీతో టీఆర్‌ఎస్‌కు పొత్తేమీ లేదు. అంశాల వారీగానే మద్దతు ఉంటుంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు ముందే ప్రధాని ఫోన్ చేసి తమ మద్దతు కోరారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రస్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడుకు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మద్దతివ్వాల్సిందే. నేను జీవితాంతం లౌకికవాదిగానే ఉంటా. మా పార్టీ అదే వైఖరి అనుసరిస్తుంది.
గూర్ఖాల్యాండ్‌పై ఆచితూచి
గూర్ఖాల్యాండ్ కొంతప్రాంతం అంతర్జాతీయ వ్యవహారాలతో ముడిపడి ఉన్నందున, పక్కనే ఉన్న చైనాతోనూ ఘర్షణ పూరిత వాతావరణమున్నందున అక్కడి పరిస్థితులపై వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయం చెప్పలేను. చెప్పాల్సిన సందర్భం వస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
కమ్యూనిస్టు పార్టీలపై విసుర్లు..
రాష్ట్రంలో అసలు లెఫ్ట్ పార్టీలున్నాయా? ఆ పార్టీలు గతించిపోయిన పార్టీలు. వరంగల్‌లో ఎన్నికలప్పుడు 350 ప్రజాసంఘాలతో మహా కూటమిగా పోటీ చేస్తే ఏమైంది.. 350 ఓట్లు కూడా రాలేదు.
దూరదృష్టితోనే సింగూరు నీటి నిల్వ
దూరదృష్టితోనే సింగూరు నీటిని వ్యవసాయ అవసరాలకు విడుదల చేయకుండా బంద్ చేశాం. ఇప్పుడు రాష్ట్రంలో కడెం మొదలు నాగార్జునసాగర్ వరకు నీటి నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరో రెండు నెలలు వర్షాల సీజన్ ఉంది. వానలు పడుతాయనే ఆశలున్నాయి. కానీ పడకుంటే హైదరాబాద్‌కు సైతం తాగునీటికి ఇబ్బంది వస్తుంది. అందుకే ముందుజాగ్రత్తగా సింగూరులో 15 టీఎంసీలున్నా.. విడుదల చేయటం లేదు.