‘రక్త’సంబంధం
మంచిర్యాల అర్బన్ : రక్తం.. కృత్రిమంగా తయారు చేయలేనిది. అలాగని ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర సమయాల్లో అందకపోతే ప్రాణం గాలిలో కలిసిపోతుంది. ఆపద సమయంలో ఒక్కరు రక్తం చేస్తే చాలు ప్రాణాన్ని కాపాడవచ్చు. ఓ కుటుంబాన్ని నిలబెట్టవచ్చు. అందుకే మేమున్నామంటూ రక్తదాతలు ముందుకొస్తున్నారు. స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ఇలా ఒకటి రెండుసార్లు కాదు 10.. 16.. 47సార్లు రక్తదానం చేసిన వారూ ఉన్నారు. ఆపదలో ఉన్నవారితో వారికెలాంటి సంబంధం లేకున్నా ‘రక్త’సంబంధం దాతలను ముందుకు నడిపిస్తోంది. జాతీయ నాయకుల జయంతి, ప్రాముఖ్యత కలిగిన రోజుల్లో స్వ చ్ఛంద సేవా సంస్థలు రక్తదాన శిబిరాలు ఏర్పా టు చేస్తున్నాయి. ఈ నెల 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
రక్తదానంపై అపోహలు వద్దు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు రక్తదానంపై చైతన్యం చేస్తున్నా కొంతమందిలో అపోహలు ఉన్నాయి. అవగాహన రాహిత్యంతో రక్తదానానికి సాహసించడం లేదు. రక్తదానం చేస్తే మనిషి బలహీన పడుతారనేది అపోహ మాత్ర మే. రక్తదానం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు. మానవుని శరీరం లో ఐదు నుంచి ఆరు లీటర్ల రక్తం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వ్య క్తి నుంచి 350 మి ల్లీలీటర్ల రక్తం సేకరిస్తారు. ప్రతీ మూడు నెలలకోసారి రక్తదానం చేసినా ఎలాంటి నష్టం ఉండదు. 18 ఏళ్ల నుంచి 60ఏళ్లలోపు ఆరోగ్యంగా ఉన్న వారంతా నిర్భయంగా రక్తదానం చేయొచ్చు.
జిల్లాలో..
జిల్లాలో మంచిర్యాల, నిర్మల్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో, ఆదిలాబాద్‌లో రిమ్స్‌లో రక్తనిధి కేంద్రాలు ఉన్నాయి. కాగజ్‌నగర్, చెన్నూర్‌లో రెడ్‌క్రాస్ సొసైటీకి చెందిన సబ్‌సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా విరివిగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ఇతర ప్రమాదాల సమయాల్లో అవసరమైన వారికి రక్తం అందిస్తున్నాయి. మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తనిధి కేంద్రం జిల్లాలో ఆదర్శంగా నిలుస్తోంది. రక్తనిధి కేంద్రం లేక, రక్తం సకాలంలో అందక ఎంతోమంది రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, గర్భిణులు మరణించారు. 2008లో రక్తనిధి కేంద్రం ప్రారంభించారు. తూర్పు ప్రాంత వాసులకు అపర సంజీవనిలా మారింది. రక్తం నిల్వ ఉంచే సౌలభ్య ఉండడంతో ఏటా రక్తం నిల్వలు పెరుగుతున్నాయి.
తలసేమియా వ్యాధిగ్రస్తులకు వరం
తలసేమియా వ్యాధిగ్రస్తులకు నెలకోసారి రక్తమార్పిడి చేయాల్సి ఉంటుంది. గతంలో హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం మంచిర్యాల బ్లడ్‌బ్యాంకులోనే మార్పిడి చేస్తున్నారు. అవసరమైన గ్రూపు రక్తం అందుబాటులో ఉంచుతున్నారు. 2012లో 152, 2013లో 1,036, 2014లో 1,800 యూనిట్ల రక్తాన్ని అందించారు.
రక్తం విడదీసే సౌకర్యం
రక్తాన్ని విడదీసి ఎక్కించే సౌకర్యం జిల్లాలోని అన్ని బ్లడ్‌బ్యాంకుల్లో ఉంది. ఒక వ్యక్తి రక్తాన్ని నలుగురికి ఉపయోగపడే విధంగా చేసే సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఏ వ్యక్తికి ఏ కణం రక్తం అవసరమో ఆ కణాలనే ఎక్కించే సౌలభ్యం ఉంది. డెంగీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన ప్లేట్‌లేట్స్ ఎక్కిస్తే మిగితా రక్తం మరో వ్యక్తిని అవసరం ఉన్నట్లుగా వినియోగించుకోవచ్చు.
ఆరోగ్యానికి మంచిది..
రక్తదానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచింది. అనార్యోగానికి గురవుతామనే అపోహలు వీడాలి. ఎన్నిసార్లు రక్తదానం చేసినా ఆరోగ్యానికి ఎలాంటి చింత ఉండదు. ఆపదలో ఉన్నవారికి రక్తం ఇవ్వడానికి ముందుకు రావాలి. బ్లడ్‌బ్యాంకులో ఎంత రక్తమైనా నిల్వ చేసుకునే సౌలభ్య ఉంది. యువకులు రక్తదానం చేయడానికి ఎళ్లవేళలా సిద్ధంగా ఉండాలి.
- డాక్టర్ విష్ణుమూర్తి, బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుడు, మంచిర్యాల
47సార్లు రక్తదానం
ఆపదలో ఉన్నవారికి 47సార్లు రక్తదానం చేశాను. ఇప్పటివరకు 1,275 యూనిట్ల రక్తం అందించాను. రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ఆనందంగా ఉంది. మా తండ్రి మల్యాల రాజయ్య పేరిట స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి రక్తదాతలను ప్రోత్సహిస్తున్న. నా స్నేహితులు వంద మంది రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రక్తసం అవసరమైన వారు 9700070894, 9908927515 నంబర్లలో సంప్రదించాలి.
- మల్యాల శ్రీపతి, మంచిర్యాల
తాండూర్ : 1998లో రక్తదానం చేయడం ప్రారంభించి క్రమం తప్పకుండా చేస్తున్న. ఇప్పటివరకు 58సార్లు రక్తదానం చేశాను. అభినవ స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి ఎంతోమందిని సభ్యులుగా చేర్పించి రక్తదానంపై అవగాహన కల్పిస్తున్న. వారితో కూడా రక్తదానం చేయిస్తున్న. అన్ని దానాలకన్న రక్తదానం ఎంతో గొప్పది. రక్తదానం చేస్తేనే ప్రాణం నిలబడుతుంది. ప్రాణం ఉన్న వ్యక్తే ఎన్ని దానాలైనా చేయగలడు. ఇప్పటివరకు రెండు రాష్ట్ర స్థాయి, ఐదు జిల్లా స్థాయి అవార్డులు అందుకున్న. గ్రామస్తాయిలో కూడా రక్తదానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి అందరినీ రక్తదాతలుగా మార్చాలన్నదే నా ధ్యేయం.
- కె.సంతోష్‌కుమార్, అభినవ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, తాండూర్