రక్తపోటు | SDP device unusable | Sakshi
Sakshi News home page

రక్తపోటు

Published Fri, Oct 3 2014 3:04 AM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM

రక్తపోటు - Sakshi

రక్తపోటు

- జిల్లా ప్రధానాస్పత్రిలో పేరుకుపోయిన రక్తం నిల్వలు
- 35 రోజులు దాటితే.. వేస్టే!
- బ్లడ్‌బ్యాంక్‌లో వెయ్యి యూనిట్లు
- నిరుపయోగంగా ఎస్డీపీ పరికరం
- ఆర్డీపీయే గతి
సాక్షి, కరీంనగర్ : జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రికి రక్తపోటు వచ్చింది. ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌లో రక్తం నిల్వలు పేరుకుపోయాయి. ఇటీవల విషజ్వరాలు, డెంగీ, మలేరియా వ్యాధులు విజృంభించి.. జిల్లాలో వేలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. రక్తంలో ప్లేట్‌లెట్లు (రక్తకణాలు) తగ్గి వందకు పైనే మంది చనిపోయారు. అందరికీ ప్లేట్‌లెట్లు అవసరమయ్యాయి. సింగిల్‌డోనర్ ప్లేట్‌లెట్(ఎస్డీపీ) మిషన్ ఉందని తెలిసి ఎంతోమంది ఈ ఆస్పత్రిలో చేరుతున్నారు. కానీ ఆస్పత్రిలో ఎస్డీపీకి బదులు.. ర్యాండమ్ బ్లడ్ డోనర్ ప్లేట్‌లెట్ మిషన్(ఆర్డీపీ) పద్ధతిలో ప్లేట్‌లెట్లు ఇవ్వడంతో నిరాశ చెందుతున్నారు.

గత్యంతరం లేక రక్తదానం చేసి ప్లేట్‌లెట్లు తీసుకుంటున్నారు. ఆర్డీపీ పద్ధతిలో ప్లేట్‌లెట్లు అందించడంతో రక్తంలోని ప్లాస్మా, తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాల ప్యాకెట్లు పేరుకుపోయాయి. ప్రస్తుతం వెయ్యికి పైనే యూనిట్ల రక్తం బ్లడ్‌బ్యాంక్‌లో ఉన్నట్టు సమాచారం. దీనిపై అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోం ది. రక్తం సేకరించి 35 రోజులు దాటితే ఆర్‌బీసీ కణాలు పనికిరావు. 350 పడకలున్న ఆస్పత్రి అంతా రోగులతో నిండిపోయింది. ఆస్పత్రిలో చేరి.. ప్లేట్‌లెట్లు తక్కువ గా ఉన్న రోగులకు ఆస్పత్రిలోనే రక్తం తీసుకుని ఆర్డీపీ పద్ధతిలో ప్లేట్‌లెట్లు ఇస్తున్నారు. ప్రతిరోజు 40 మందికి పైనే రక్తదానం చేసి ప్లేట్‌లెట్లు తీసుకుంటున్నారు.
 
నిరుపయోగంగా ‘ఎస్డీపీ’ మిషన్
2009లో జిల్లాను డెంగీ హడలెత్తిస్తున్న సమయంలో అప్పటి ఎంపీ పొన్నం ప్రభాకర్ తన నిధుల నుంచి రూ. 24లక్షలతో జిల్లా ఆస్పత్రిలో సింగల్ డోనర్ ప్లేట్‌లెట్ మిషన్ ఏర్పాటు చేశారు. ఈ యంత్రంతో రక్తదాత శరీరంలోంచి నేరుగా ప్లేట్‌లెట్లు మాత్రమే అవసరమున్న మేరకు తీసుకునే వీలుంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఎస్డీపీ కిట్ ఉంటుంది. దీని విలువ సుమారు రూ.7,500. రెండేళ్లుగా ఆపరేటర్ లేడంటూ ఈ యంత్రంతో పని లేక మూలకు పడేశారు. దీంతో నిర్వహణ కొరవడి మరమ్మతుకు వచ్చింది. జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతాయని తెలిసినా మరమ్మతు చేయించ ట్లేదు.
 
ఆర్డీపీయే గతి..
ఎస్డీపీ పరికరం పని చేయకపోవడం.. ఆ పద్ధతి లో ప్లేట్‌లెట్ల సేకరణకు ఎక్కువ ఖర్చవుతుండడంతో జిల్లా ఆస్పత్రిలో ఆర్డీపీ పద్ధతినే అవలంబిస్తున్నారు. రోగినుంచి రక్తం సేకరించిన తర్వాత సెల్ సెపరేటర్ ద్వారా ప్లేట్‌లెట్లు, ప్లాస్మా, తెల్ల, ఎర్రరక్త కణాలు వేరు చేస్తారు. 350 ఎంఎల్ రక్తం నుంచి 50ఎంఎల్ ప్లేట్‌లెట్లు వేరు చేసి రోగి రక్తంలో ఎక్కిస్తారు. ప్లాస్మా, తెల్ల, ఎర్రరక్త కణాలతో కూడిన మిగతా 300ఎంఎల్ రక్తం ఆయా కాంపోనెంట్స్ అవసరమున్న రోగులకు ఎక్కిస్తారు. ఒక్క యూనిట్ (50 ఎంఎల్) ప్లేట్‌లెట్లు రోగి శరీరంలో ఎక్కి స్తే.. ప్లేట్‌లెట్ల సంఖ్య 8 వేల వరకు పెరిగే అవకాశముంటుంది. ఉన్నతాధికారులు స్పందించి ఎస్డీపీ మిషన్‌ను వినియోగంలోకి తీసుకువస్తే రక్తదాత నుంచి నేరుగా ప్లేట్‌లెట్లు మాత్రమే తీసుకునే అవకాశముంటుంది. రక్తం నిల్వలు ఎక్కువగా పేరుకుపోయే అవకాశముండదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement