సాక్షి, ఆదిలాబాద్ : ఆర్టీసీలో బస్సుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఆర్డినరి, ఎక్స్‌ప్రెస్, హైటెక్ అనే తేడా ఏమీలేదు. ఆదిలాబాద్ రీజియన్‌లోని ఆరు డిపోల పరిధిలో గల అధిక మొత్తం బస్సులది ఇదే పరిస్థితి. రాష్ట్రంలోని ఇతర రీజియన్లతో పోలిస్తే ఆదాయం తక్కువ ఉంటుందో మరేమో కానీ బస్సుల పరంగా ఇక్కడి ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇతర రీజియన్‌లో తిరిగిన బస్సులను వివిధ రిపేర్ల కారణంగా ఇక్కడికి పంపి నడిపిస్తున్నారన్న అపవాదు లేకపోలేదు.
పల్లెకు వెలుగేది?
గ్రామీణ ప్రాంత ప్రజలు నిత్యం వివిధ పనుల రీత్యా పట్టణ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అత్యధిక గ్రామీణులకు పల్లె వెలుగు బస్సే దిక్కు. అత్యధికంగా ఈ బస్సులే నిత్యం వివిధ మార్గాల్లో నడుస్తుంటాయి. సంస్థకు అధికంగా ఆదాయం సమకూరుస్తాయి. అయితే గత ఐదారేళ్లుగా ఈ ఆర్డినరి బస్సుల రీప్లేస్మెంట్ లేదు. దీంతో అవే బస్సులు నడుపుతున్నారు. నిర్ధేశిత రీడింగ్‌ను ఎన్నడో దాటేశాయి. బస్సు కాలం చెల్లినా ఇంజిన్ పనిచేసినంత కాలం బస్సు నడుపుతామన్న ధోరణి ఆర్టీసీ అధికారుల్లో కనిపిస్తోంది.
ప్రగతిరథ చక్రాల్లో 40 శాతం బస్సులు ప్రస్తుతం కాలం చెల్లినవేనని అధికారులు ఒప్పుకుంటున్నా పైకిమాత్రం చెప్పరు. ఇదేమంటే అదంతే .. అనే రీతిలో వ్యవహరిస్తారు. ఇందులో అధికారులకు ఓ స్వార్థ ప్రయోజనం లేకపోలేదు. ఎన్ని ఎక్కువ కాలం చెల్లిన బస్సులు నడిపితే అధికారి స్థాయిని బట్టి అంతా ఇన్సెంటీవ్ సంస్థ ఇస్తుండడంతో ఇలాంటి బస్సులను నెట్టుకొస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. కొన్ని కార్మిక సంఘాలు దీన్ని వ్యతిరేకించినా సంస్థ నిబంధనల రీత్యా వారూ గీత దాటని పరిస్థితి.
ఆ బస్సులకు రీడింగ్ మీటర్లే ఉండవు
ఒక బస్సు పూర్తిస్థాయిలో నిర్ధేశిత కిలో మీటర్లు తిరిగాక దాన్ని కాలం చెల్లిన బస్సుగా పరిగణిస్తారు. ఆర్టీసీలో అధికంగా పల్లె వెలుగుల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. రీజియన్ పరిధిలోని ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల పరిధిలో తిరుగుతున్న ఆర్డినరి బస్సుల్లో ఇలాంటి కాలం చెల్లిన బస్సులకు అసలు రీడింగ్ మీటర్లే కనిపించవు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు డ్రైవింగ్‌కు సంబంధించి కిలోమీటర్ పర్ లీటరు (కేఎంపీఎల్)నే పరిగణలోకి తీసుకొని వారు సంస్థకు ఏ విధమైన ప్రయోజనం దక్కిస్తున్నారనే అంచనాలు వేస్తూ ప్రశంస పత్రాలు అందజేస్తారు. అలాంటప్పుడు అసలు రీడింగే లేని బస్సులు నడుపుతున్నప్పుడు ఆ డ్రైవింగ్‌ను ఎలా అంచనా వేస్తున్నారో ఆర్టీసీ అధికారులకే తెలియాలి.
స్పీడ్ మీటర్ మాత్రం దాంట్లో కనిపిస్తుంది. ఇక ఆ బస్సుల స్టీరింగ్ చూస్తేనే ప్రయాణికులకు ఒక రకమైన భయం పుడుతుంది. డ్రైవర్ క్యాబిన్ వద్ద బస్సుల పరిస్థితిని చూస్తే గుబులు పుడుతుంది. గతేడాది వేములవాడ వద్ద బస్సు ప్రమాద సంఘటన ఆర్టీసీలో ప్రకంపనలు సృష్టించింది. అయితే ఆ తర్వాత అది సద్దుమణిగిపోయింది. ప్రధానంగా ఇలాంటి ఏళ్లనాటి బస్సుల కారణంగానే ప్రమాదాలు సంభవిస్తున్నాయనే అభిప్రాయం ఉంది.
తగ్గిన ఓఆర్..
ఆర్టీసీలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బస్సులో ప్రయాణికుల శాతం (ఆక్యుపెన్సీ రేషియో) గణనీయంగా తగ్గింది. దీనికి డొక్కు బస్సులే కారణమన్న అభిప్రాయం లేకపోలేదు. ఆర్టీసీలో ప్రయాణం.. సురక్షిత ప్రయాణం అనేది సంస్థ నినాదం. రీజియన్ స్థాయిలో ప్రస్తుతం 70 నుంచి 75 శాతం ఓఆర్ ఉండగా, గతేడాది ఇదే సమయానికి 90శాతం ఉండటం గమనార్హం. అలాగే ఆదాయం పరంగా చూస్తే ప్రస్తుతం రూ.70 లక్షల నుంచి రూ.75లక్షల వరకు లభిస్తుండగా, గతేడాది రూ.80లక్షల నుంచి రూ.85లక్షల వరకు, అంతకంటే ఎక్కువ కూడా రోజు ఆదాయం సమకూరేది.
ఈ నేపథ్యంలో ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ మార్పులు చేయని పక్షంలో రానున్న రోజుల్లో ఓఆర్, ఆదాయం మరింత పడిపోయినా ఆశ్చర్య పోనక్కర్లేదు. రీజియన్ పరిధిలో పలు డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుమారు 1100 పోస్టులకు గాను 110 ఖాళీ ఉన్నట్లు చెబతున్నారు. సాధారణంగా ఒక బస్సు నడవాలంటే బస్ ఆఫ్ రేషియో (బీఎస్‌ఆర్) 6.2గా సిబ్బంది ఉండాలి. ఈ అంకెల్లో డ్రైవర్, కండక్టర్, మెకానిక్, ఆఫీస్ స్టాఫ్, కంట్రోలర్, సూపర్‌వైజర్ రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది 4.2గా ఉందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతోంది. దీంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నారు.
తారు రోడ్లపై అద్దె బస్సులు
రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లో రాజధాని, సూపర్‌లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, మినీ పల్లెవెలుగు బస్సులు నడుస్తున్నాయి. ఆర్టీసీ నుంచి పాత బస్సుల స్థానంలో కొత్తబస్సుల రీప్లేస్మెంట్ గత కొన్నేళ్లుగా లేదు. సంస్థ నష్టాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉంటే అద్దెబస్సుల సంఖ్య ఏటా క్రమంగా పెరుగుతోంది. ఎక్స్‌ప్రెస్ అద్దె బస్సులే అధికంగా ఉన్నాయి. దీంతో ప్రధానంగా ముఖ్యపట్టణాలకు ప్రధాన రోడ్డు మార్గాల్లోనే ఈ బస్సులు పయనిస్తున్నాయి. ఇక రహదారులు సరిగ్గా లేని మార్గాల్లో పల్లెవెలుగు బస్సులు వెళ్తుంటాయి.
ఇక దూర ప్రాంతాలకు రాజధాని, లగ్జరీ, సూపర్‌లగ్జరీ, డీలక్స్ బస్సులు నడుస్తుంటాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో వివిధ ప్రాంతాల నుంచి రైలు మార్గాలు ఉన్నా నిర్మల్‌లో ఈ సదుపాయం లేదు. ఆదిలాబాద్‌లో రైలుమార్గం ఉన్నా తక్కువ రైళ్లు ఈమార్గంలో పయనిస్తుండడంతో అత్యధికంగా ప్రయాణికులకు బస్సులే దిక్కు. దీన్ని సొమ్ము చేసుకోవాల్సిన ఆర్టీసీ చేష్టలోడుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ మార్గంలో పదుల సంఖ్యలో వెళ్తుంటాయంటే అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment