పోలవరం మండలం పట్టిసీమ సమీపంలో ఎత్తిపోతల పథకం నిర్మించతలపెట్టిన ప్రాంతం
- రూ. 1,300 కోట్ల విలువైన కాంట్రాక్టు ట్రాన్స్‌ట్రాయ్‌కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం
- పోలవరం ఎత్తిపోతలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం!
- ఆర్థికశాఖ ఆమోదించిన ప్రతిపాదనలు టీడీపీ ఎంపీ ఒత్తిడితో పక్కన పెట్టేశారు
- జాప్యం జరుగుతుందనే సాకుతో ‘అదనపు పని’ కింద ట్రాన్స్‌ట్రాయ్‌కి అప్పగింత
- లిఫ్ట్ ఏర్పాటు ఎక్కడో నిర్ణయించకముందే కాంట్రాక్టు ఇచ్చేసేందుకు తొందర
సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ఎత్తిపోతల పథకం కాంట్రాక్టును టెండర్లు లేకుండానే ట్రాన్స్‌టాయ్ సంస్థకు అప్పగించడానికి ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీ ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం.. పథకానికి టెండర్లు పిలవకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు కాం ట్రాక్టు దక్కించుకున్న ‘ట్రాన్స్‌ట్రాయ్’కి అదనపు పని కింద పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా కాంట్రాక్టు ఇవ్వనున్నట్లు తెలిసింది. రూ. 1,300 కోట్ల విలువైన ఈ పథకం నిర్మాణానికి టెండర్ల కోసం నీటిపారుదల శాఖ రూపొందిం చిన ప్రతిపాదనకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపినా ప్రభుత్వం పక్కనపెట్టింది.
వచ్చే ఖరీఫ్ (జూలై) నాటికి కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని అందించాలని, ఆరేడు నెలల్లో పనులు పూర్తి కావాలంటే టెండర్ల పేరిట జాప్యం జరగకూడదనే అంశాన్ని సాకు చూపించాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అమేరకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టులో భాగంగానే ఈ ఎత్తిపోతల పథకాన్ని చూపించి, అదనపు పని కింద కట్టబెట్టడానికి వీలుగా ప్రతిపాదనలు రూపొందించే పనిలో నీటిపారుదల శాఖ అధికారులు తలమునకలయ్యారు.
పట్టిసీమకు దిగువనా? ఎగువనా?: గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా కుడి కాల్వకు మళ్లించి కృష్ణా డెల్టాకు అందివ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిన విషయం విదితమే. కుడికాల్వ పనులు దాదాపు 70 శాతం పూర్తయ్యా యి. మిగతా 30 శాతం పనులకు అయ్యే ఖర్చు ను పోలవరం ప్రాజెక్టులో భాగంగానే పరిగణించి కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది. పట్టిసీమ వద్ద ఏర్పాటు చేయనున్న పంప్‌హౌస్, కుడికాల్వ వరకు పైల్‌లైన్ల నిర్మాణానికి దాదాపు రూ. 1,300 కోట్ల వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా. పట్టిసీమ దిగువన బంగారమ్మపేట వద్దా... ఎగువన సింగన్నపల్లి వద్దా... లిఫ్ట్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం కాక ముందే కాంట్రాక్టును టెండర్లు లేకుండా ఏకపక్షంగా ట్రాన్స్‌ట్రాయ్‌కి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఎత్తిపోతల ప్రయోజనమేమిటి?
పట్టిసీమ లిఫ్ట్ కోసం రూ. 1,300 కోట్ల వ్యయం వృథా
పోలవరాన్ని పూర్తి చేస్తే కుడి కాల్వ ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించవచ్చు. అది పోలవరం ప్రాజెక్టులో భాగమే. పోలవరం ప్రాజెక్టు మూడేళ్లలోనే పూర్తి చేస్తామని సాగునీటి మంత్రి చెప్తున్నారు. ఈలోగా పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి, గోదావరి నీటిని పోలవరం కుడి కాల్వకు తెచ్చి, కృష్ణా డెల్టాకు మళ్లిస్తామంటూ ప్రభుత్వం హడావుడి చేస్తోంది.
ఈ ఎత్తిపోతల పథకం పూర్తిచేయడానికి కనీసం రెండేళ్లు పడుతుందని, ఏవైనా సమ స్యలు ఎదురైతే మరింత జాప్యం జరగటానికి అవకాశముంటుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. పోలవరం పూర్తయితే పట్టిసీమ ఎత్తిపోతల పథకం తొలగించాల్సిందే. అంటే.. ఎత్తిపోతల ప్రయోజనం ఏడాది, రెం డేళ్లు మాత్రమే ఉంటుంది. అటువంటప్పుడు పోలవరం నిర్మాణం పూర్తి చేయటంపైనే దృష్టి పెట్టి వేగవంతం చేస్తే రూ. 1,300 కోట్ల నిధులు మిగులుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కుడి కాల్వ భూసేకరణలో సమస్యలు
అదీగాక.. ఎత్తిపోతల పథకం ద్వారా నీరు పోలవరం కుడి కాల్వ ద్వారా ఇవ్వాలి. కానీ ఈ కుడి కాల్వ పనులు ఇప్పటికి 70 శాతం మేరకే పూర్తయ్యాయి. మిగతా 30 శాతం పనులు.. భూసేకరణలో సమస్యలు ఎదురుకావడంతో ఆగిపోయాయి. ఆ 30 శాతం పనులు పూర్తి చేయడానికి ఇంకా 1,770 ఎకరాల భూముల ను సేకరించాల్సి ఉంది. భూసేకరణపై రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కాల్వ పూర్తి చేయటం జాప్యమవుతుంది. కాల్వ పూర్తి కాకుండా ఎత్తిపోతల పథకం నిర్మించీ ప్రయోజనం ఉండదని సాగునీటి నిపుణులు పేర్కొం టొన్నారు. అదీగాక.. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత.. ఎటూ కుడి కాల్వ ద్వారా నీరు కృష్ణా డెల్టాకు చేరుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు రూ. 1,300 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకం చేపట్టాలా? అని గోదావరి జిల్లాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
80 టీఎంసీల నీటి నిల్వకు అవకాశమేదీ?
ఇంకో సమస్య.. గోదావరిలో వరద ఉన్నప్పు డు ఎత్తిపోతలతో తెచ్చే 80 టీఎంసీల నీటిని ఎక్కడ నిల్వ చేయాలనే ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. పోలవరం కుడి కాల్వను బుడమేరులో కలిపి విజయవాడ బ్యారేజీకి తీసుకురావాలనేది ప్రణాళిక. అక్కడ నుంచి కొమ్మమూరు కాల్వ ద్వారా ‘ఉత్తర బకింగ్‌హామ్ కెనాల్’ ద్వారా నెల్లూరు జిల్లా వరకు తీసుకెళ్లి, అక్కడ నుంచి లిఫ్ట్ ద్వారా పెన్నా నదికి తీసుకెళ్లాలని ప్రాథమికంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
అక్కడ నుంచి చిత్తూరు వరకు తీసుకెళ్లాలని ఆలోచిస్తోంది. కృష్ణా, గోదావరి నదుల్లో ఒకే సమయంలో వర ద ఉంటుంది. విజయవాడ బ్యారేజీ సామర్థ్యం 3 టీఎంసీలు. కృష్ణాలో వరద ఉన్నప్పుడు బ్యా రేజీలో పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉంటుంది. మరి గోదావరి నీటిని ఎలా కలుపుతారు? ఎలా నిలుపుతారు? భారీ స్థాయిలో నీటిని వందల కిలోమీటర్ల మేర లిఫ్టుల ద్వారా తీసుకెళ్లడానికి భారీ స్థాయిలో ఖర్చవుతుందని, వాస్తవంగా సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
‘పశ్చిమ’ ప్రజల అనుమానాలు...
వాస్తవానికి గోదావరికి సగటున వరద కాలం 45 రోజులు కాగా.. గత కొన్నేళ్లుగా కనీసం 30 రోజులకు కూడా వరద నీరు భారీగా వస్తున్న దాఖలాలు లేవు. అదే సమయంలో కృష్ణాలో కూడా వరద ఉంటే.. గోదావరి నీరు తీసుకెళ్లడంలో అర్థం లేదు. మరి వరద లేనప్పుడు నీటిని లిఫ్ట్ చేసే అవకాశముంటుందా? గత కొన్నేళ్లుగా ఉభయ గోదావరి జిల్లాల్లో రబీకి తీవ్ర నీటి ఎద్దడి తలెత్తుతోంది. ఎత్తిపోతల పథకం నిర్మించి కృష్ణా డెల్టాకు నీటిని మళ్లిస్తే పశ్చిమలో సాగు, తాగు, ఆక్వా అవసరాలకు నీరు అందకపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ఆ జిల్లా ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు.