నామినేటెడ్ ఆశలు | Nominated hopes | Sakshi
Sakshi News home page

నామినేటెడ్ ఆశలు

Published Wed, Dec 17 2014 2:12 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM

Nominated hopes

అసెంబ్లీ సమావేశాలు అయిపోయాయి... మంత్రివర్గ విస్తరణ ముగిసింది... ఇక నామినేటెడ్ పదవుల జాతర మొదలవనుంది. అడపాదడపా పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక పూర్తిస్థాయి నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టిసారించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి పదవులను భర్తీ చేయనున్న నేపథ్యంలో జిల్లాలోని టీఆర్‌ఎస్ నాయకులు, ఉద్యమకారులు ఆ పదవులపై కన్నేశారు. సమయం ఆసన్నం కావడంతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పద్నాలుగు సంవత్సరాలుగా ఉద్యమాలు చేశామని, పార్టీ జెండాను మోశామని ఇప్పుడు అధికారం అనుభవించే అవకాశం వచ్చిందని, తమకు పదవులు ఇవ్వాల్సిందేనని నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు.
 -కరీంనగర్ సిటీ
 
 కరీంనగర్ సిటీ: జిల్లా నుంచి పలువురు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులపై గురిపెట్టారు. పార్టీలో సీనియర్ నాయకులు, రాష్ట్ర స్థాయి పలుకుబడి కలిగిన నేతలు ఏకంగా కార్పొరేషన్ చైర్మన్లు సొంతం చేసుకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం స్థాయిలో పరపతి కలిగిన నాయకులకు ఇప్పటికే పలు చైర్మన్ పదవులు ఖరారైనట్లు సమాచారం.
 
 ప్రతిమ సంస్థల అధినేత బోయినిపల్లి శ్రీనివాస్‌రావుకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయన నియామకం లాంఛనమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. కేసీఆర్‌కు సన్నిహితుడు కావడం, హైదరాబాద్ నార్సంగిలోని శ్రీనివాస్‌రావు ఇంటిలోనే కేసీఆర్ మంత్రి వర్గ కూర్పు చేయడంతో ఆయన ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలిసింది. కరీంనగర్ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్‌కు సోదరుడైన శ్రీనివాస్‌రావుకు  ఆ పదవి ఖాయమైనట్లేనని పార్టీ సీనియర్లు పేర్కొంటున్నారు.
 
 మానకొండూరు నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవీ.రామకృష్ణారావు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవిని అభ్యర్థిస్తున్నారు. పార్టీలో సీనియర్‌గా, వివాదరహితుడుగా ఉన్న జీవీ శాప్ చైర్మన్ ఆశిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్‌కు సన్నిహితుడైన కెప్టెన్ వి.లక్ష్మికాంతరావు ఆశీస్సులు ఉండడం, మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్‌తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా అభ్యంతరం చెప్పే అవకాశం లేకపోవడం జీవీకి కలిసొచ్చే అంశంగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ శాప్ దక్కని పరిస్థితిలో ఆ స్థాయిలో మరో పదవి ఇస్తారని ఆ వర్గాలు అంటున్నాయి.
 
 పెద్దపల్లికి చెందిన టీఆర్‌ఎస్‌వీ, ఓయూ జేఏసీ నేత రాకేష్‌కు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఖరారైనట్లు తెలిసింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమాలు నడిపించడంలో రాకేష్ కీలక భూమిక పోషించారు. ఉద్యమం నాటినుంచి కూడా కేసీఆర్‌కు విధేయుడుగా ఉన్నారు. కేసీఆర్ కుటుంబంతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. రాకేష్ సహచరులంతా ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్లుగా ఉండడంతో ఆయనకు కూడా అంతే స్థాయి గల ప్రాధాన్యత పోస్టు ఇవ్వడానికి కేసీఆర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం.
 
 హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన పన్యాల భూపతిరెడ్డికి కూడా కార్పొరేషన్ స్థాయి పదవి లభిస్తుందనే ప్రచారం ఉంది. పార్టీలో సీనియర్‌గా ఉన్న భూపతిరెడ్డి కుటుంబంతో కేసీఆర్‌కు సంవత్సరాల అనుబంధం ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం.
 రామగుండం నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్ నేత కోరుకంటి చందర్ పేరు సైతం ప్రముఖంగా వినిపిస్తోంది. బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుడు రేసులో ఆయన ఉన్నట్లు సమాచారం. ఇటీవల రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన చందర్ ఆ తరువాత టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారు.
 
 వీరితో పాటు మాజీ మంత్రి జి.రాజేశంగౌడ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, ఎం.జితేందర్‌రావు, కఠారి చంద్రశేఖర్‌రావు, చిక్కాల రామారావు, నాయకులు ఓరుగంటి ఆనంద్, ఓరుగంటి రమణారావు, నల్ల మనోహర్‌రెడ్డి, నందెల్లి మహిపాల్ తదితరులు కార్పొరేషన్ పదవులపై కన్నేశారు. మంత్రులు, కేసీఆర్ సన్నిహితులతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
 
 జిల్లా స్థాయిలో...
 జిల్లా స్థాయలో గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఆర్‌టీఏ సభ్యుడు, వక్ఫ్‌బోర్డు చైర్మన్, ప్రణాళిక సంఘం సభ్యులు, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, ఓదెల మల్లికార్జునస్వామి దేవాలయాలతో పాటు చిన్న స్థాయి దేవాలయాల పాలకమండళ్లు కనీసం వంద వరకు ఉన్నాయి. జిల్లాలో 26 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్, ముస్తాబాద్, సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, మెట్‌పల్లి, మేడిపల్లి, కథలాపూర్, జగిత్యాల, మల్యాల, గంగాధర, చొప్పదండి, ధర్మారం, ధర్మపురి, గొల్లపల్లి, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, కాటారం, మానకొండూరులతో పాటు ఇటీవల కొత్తగా ఏర్పడిన బెజ్జంకి, కోహెడ, ఇల్లంతకుంట తదితర ఏంఎసీలకు పాలకవర్గాలు నియమించాల్సి ఉంది.
 
  అయితే ఇటీవల కొంతమంది చైర్మన్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో పాత చైర్మన్లే కొనసాగుతున్నారు. ఇవి న్యాయప్రక్రియ పూర్తయ్యాక నియమించే అవకాశం ఉంది. ఈ పదవులను దక్కించుకొనేందుకు నాయకులు స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే రేగులపాటి పాపారావుకు జిల్లాలో ముఖ్యమైన వేములవాడ దేవస్థానం చైర్మన్ పదవి ఇస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. ఒక్కో ఏఎంసీ, దేవాలయ చైర్మన్లకు కనీసం మూడు నుంచి ఐదుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరిని ఎంపిక చేయడం స్థానిక ఎమ్మెల్యేలకు సైతం తలనొప్పిగా మారింది.
 
 నేతల చుట్టూ ప్రదక్షిణలు
 నామినేటెడ్ పదవుల పందేరంలో జిల్లాలోని చోటామోటా నాయకులతో పాటు జిల్లా స్థాయి నేతలంతా రాజధాని హైదరాబాద్‌లోనే మకాం వేశారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాలు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాము పార్టీకి చేసిన సేవలు, పదవి ఇవ్వాల్సిన ఆవశ్యకతలను వివరిస్తూ అభ్యర్థిస్తున్నారు.
 
 పోలీసు కేసులెన్నో చూడండి...
 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యమకారులు నామినేటెడ్ రేసులో ముందున్నారు. టీఆర్‌ఎస్‌లో ఉంటూ పోరాడిన వారు కొంతమందైతే, విద్యార్థి జేఏసీ, రాజకీయ జేఏసీల్లో కీలక పాత్ర పోషించిన నేతలు తమ ఉద్యమ నేపథ్యాన్ని వివరిస్తూ పదవులు అభ్యర్థిస్తున్నారు. ఉద్యమ సమయంలో పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నామని, జైలుకు సైతం వెళ్లామని, కుటుంబాలను వదిలిపెట్టి ప్రాణాలు ఫణంగా పెట్టి ఉద్యమించామని గుర్తు చేస్తున్నారు. తమపై పదుల సంఖ్యలో పోలీసు కేసులు ఇప్పటికీ ఉన్నాయని, కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని, అవకాశం వచ్చినపుడు కనీసం నామినేటెడ్ పదవైనా ఇవ్వరా అంటూ వేడుకుంటున్నారు. ఉద్యమ సమయంలో కేసులెన్నో చూశాకే పదవులు ఇవ్వాలంటూ మెళిక పెడుతున్నారు.
 
 ఎమ్మెల్యేలకూ పదవులు..?
 మంత్రి పదవులు రాని ఎమ్మెల్యేలకు ఆ స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్, ఇతరత్రా పదవులు కట్టబెట్టేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో జిల్లాలోని ఒకరిద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను సాంస్కృతిక సారథి చైర్మన్‌గా నియమిస్తూ క్యాబినెట్ హోదా కల్పించడం తెలిసిందే. పార్లమెంటరీ సెక్రెటరీ, క్యాబినెట్ హోదా కలిగిన కార్పొరేషన్ చైర్మన్ల రేసులో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌బాబు, కరీంనగర్, మంథని ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
 
 సంజయ్‌కు వైద్య విధాన పరిషత్ చైర్మన్?
 రాయికల్ : జగిత్యాల టీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్‌కు తెలంగాణ వైద్యవిధాన పరిషత్ చైర్మన్ పదవి దక్కే అవకాశముంది. జగిత్యాలలో పార్టీ బలోపేతం, సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ శాసనసభపక్ష ఉపనేత జీవన్‌రెడ్డిని, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను ఎదుర్కొనేందుకు సంజయ్‌కుమార్‌కు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత మంగళవారం సంజయ్‌కు ఫోన్ చేసి సంప్రదింపులు చేసినట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement