సర్పంచ్, వార్డులు, ఎంపీటీసీస్థానాలకు ఎంపీడీఓ
కార్యాలయాల్లో, జెడ్పీటీసీ స్థానానికి జిల్లా పరిషత్
కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ
ఆ...ఆరు సర్పంచ్ స్థానాల ఎన్నికపైనే అనుమానాలు
మండలాల్లో స్టేజ్-1 ఎన్నికల అధికారుల నియామకం
అమల్లోకి వచ్చిన ఎన్నికలప్రవర్తన నియామవళి
నల్లగొండ : స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు నామినేషన్లు స్వీకరణ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. సర్పంచ్ స్థానాలు 12, వార్డులు 46, ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించేందుకు జిల్లా పంచాయతీ, జెడ్పీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు స్థానాలకు స్థానిక మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. దీని కోసం ఆర్డీవోలు ప్రత్యేకంగా మండల స్థాయిలో స్టేజ్ -1 అధికారులను నియమించారు. మోత్కూరు మండలం ముసిపట్ల ఎంపీటీసీ స్థానానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పశుసంవర్థక శాఖ ఏడీ కృష్ణారావును నియమించారు. నామినేషన్ల స్వీకరణ, ఎన్నికలు నిర్వహించే బాధ్యతను ఆయన పర్యవేక్షిస్తారు.
నడిగూడెం జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్లు జిల్లా పరిషత్ కార్యాలయంలో స్వీకరిస్తారు. ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా సూర్యాపేట పంచాయతీరాజ్ డీఈ కృష్ణమూర్తిని నియమించారు. నామినేషన్లు స్వీకరించేందుకు జిల్లా పరిషత్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా సీఈవో రావుల మహేందర్ రెడ్డి, అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా డెప్యూటీ సీఈ వో మోహన్ రావు వ్యవహరిస్తారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
ఆరు స్థానాల పైనే సస్పెన్స్...
ఎన్నికలు జరిగే 12 సర్పంచ్ స్థానాల్లో ఆరు స్థానాలకు 2013లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వుడు అభ్యర్థులు లేకపోవడ ంతో ఆ స్థానాలకు ఎన్నికలు జరగలేదు. దీంతో ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆరు స్థానాలు కూడా ఉన్నాయి. వాటిల్లో తుర్కపల్లి మండలం మోతీరాంతండా, బొమ్మలరామారం మండలం పెద్దపర్వతాపూర్, కంచల్‌తండా, మేళ్లచెర్వు మండలం వజినేపల్లి, పెద్దవూర మండలం పోతునూరు, తిప్పలమ్మగూడెం పంచాయతీలు ఉన్నాయి. రిజర్వుడు అభ్యర్థులు లేకపోవడంతో ఉపసర్పంచ్‌లునే కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా అభ్యర్థులు లేని పరిస్థితి వస్తే ఆ స్థానాలకు సర్పంచ్ ఎన్నికలు నిలిచిపోయే అవకాశం ఉంది. నామినేషన్ల స్వీకరణ ముగిసిన తర్వాత గానీ ఆరు స్థానాలపై ఓ స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు.
అమల్లోకి వచ్చిన కోడ్...
ఉప ఎన్నికలు జరిగే స్థానాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. సర్పంచ్ ,వార్డు స్థానాలకు ఆయా గ్రామ పంచాయతీల పరిధి వరకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. జూలై 4 తేదీ సాయంత్రం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అలాగే మూసిపట్ల ఎంపీటీసీ స్థానానికి మోత్కూరు మండలం మొత్తానికి కోడ్ వర్తిస్తుంది. నడిగూడెం జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికల ప్రవర్తన నియామవళి సూర్యాపేట రెవిన్యూ డివిజన్ మొత్తానికి వర్తిస్తుంది. ఈ డివిజన్ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో జూలై 6 తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఎలాంటి అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడానికి వీల్లేదు.
ఏకగ్రీవమా లేక ఎన్నికా..?
నడిగూడెం జెడ్పీటీసీ సభ్యుడు మార్తి గురువులు అకాల మృతి కారణంగా ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఈ స్థానానికి ఎన్నిక లేకుండా గురువులు కుటుంబ సభ్యులనే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీర్మా నించారు. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తేనే గురువులు కుటుంబ సభ్యులకు మద్దతు ఇస్తామని ఇతర పార్టీలు మెలికపెట్టాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితి వస్తే టీఆర్‌ఎస్, టీడీపీ, సీపీఎం పార్టీలు కూడా తమ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతున్నాయి. గురువులు కుటుంబ సభ్యులు కాకుండా మరొకరిని పోటీలో దింపేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.
నేటినుంచి నామినేషన్ల పర్వం
Published Thu, Jun 18 2015 10:56 PM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM
Advertisement