సిలబస్ మార్పులు ఎన్నాళ్లు? | non - Complete Text Books Changes in the process of syllabus | Sakshi
Sakshi News home page

సిలబస్ మార్పులు ఎన్నాళ్లు?

Published Thu, Feb 19 2015 3:57 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM

సిలబస్ మార్పులు ఎన్నాళ్లు?

సిలబస్ మార్పులు ఎన్నాళ్లు?

పూర్తికాని పాఠ్యపుస్తకాల సిలబస్ మార్పుల ప్రక్రియ
ఇప్పటికే సగం ముద్రణ పూర్తి కావాల్సి ఉన్నా..
ఇంకా మార్పుల దశలోనే
ముద్రణ టెండర్లే ఖరారు కాని వైనం
పేపరు కొనేదెప్పుడు.. పుస్తకాలను ముద్రించేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠ్య పుస్తకాల్లో మార్పుల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.

గత నెల రోజులుగా సిలబస్‌లో మార్పుల ప్రక్రియ చివరి దశకు చేరుకుందని చెబుతున్నా, సిలబస్ కమిటీ ప్రభుత్వానికి ఇంకా నివేదికను ఇవ్వలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకున్న తెలుగు, సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకాల్లో మార్పులపై గత ఆగస్టు 28న ప్రభుత్వం నియమించిన కమిటీ కసరత్తు చేస్తూనే ఉంది. నవంబర్‌కల్లా సిలబస్‌లో చేసిన మార్పులపై నివేదిక ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటికీ పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించలేకపోయింది.

మార్పుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. సిలబస్‌లో మార్పుల ప్రక్రియ ఆలస్యం అవుతున్నకొద్దీ ఆ ప్రభావం పుస్తకాల పంపిణీపైనా పడే అవకాశం ఉంది. కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి అందించాక అందులోని అంశాలను పరిశీలించేందుకు, మార్పులను ముఖ్యమంత్రి స్థాయిలో ఖరారు చేసేందుకు మరింత సమయం పట్టనుంది. మరోవైపు ముద్రణకు సంబంధించి పేపరు కొనుగోలుకోసం మొదట్లో పిలిచిన టెండర్లను రద్దు చేసి, మళ్లీ పిలిచారు. అవి ఖరారు చేసేందుకు, ఆ తరువాత ముద్రణకోసం టెండర్లు పిలిచేందుకు మరింత సమయం పట్టనుంది.

ముద్రణ టెండర్లను ఖరారు చేశాక  ప్రింటర్లకు పనులను అప్పగించాల్సి ఉంటుంది. తర్వాత వాటిని ముద్రించి పాఠశాలలకు పుస్తకాలు పంపేసరికి చాలా సమయం పడుతుందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి విద్యార్థులకు పుస్తకాలు అందించడం సాధ్యమయ్యేలా కనిపించడంలేదు. బడులు తెరిచే నాటికి ఇవ్వకపోయినా కనీసం ఒకటీ రెండు నెలలు ఆలస్యంగానైనా పుస్తకాలను అందించేందుకు పక్కా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.
 
తెలుగు పాఠ్యపుస్తకాల్లో మార్పులు..

సిలబస్‌లో మార్పులపై ఇప్పటి వరకు రూపొందించిన ప్రణాళికల ప్రకారం.. ఒకటి నుంచి పదో తరగతి వరకున్న తెలుగు పాఠ్య పుస్తకాల్లో భారీగా మార్పులు చోటు చే సుకోనున్నాయి. కాగా, ఈ సారి అన్ని తరగతుల సాంఘిక శాస్త్రాల్లో మార్పులు చేయడం లేదు. 6, 7, 8 తరగతుల సాంఘిక శాస్త్రాల్లో మాత్రం మార్పులు చేస్తున్నారు. 9, 10 తరగతుల సాంఘిక శాస్త్రాల్లో వచ్చే ఏడాదే మార్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
 
ప్రధాన మార్పులు ఇవీ..

9, 10 సహా అన్ని తరగతుల్లో ఆంధ్రప్రదేశ్ చిత్రపటాలు ఉన్న చోట తెలంగాణ చిత్రపటాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర ఉన్న చోట తెలంగాణ సమగ్ర చరిత్ర ఉంటుంది. భారత దేశ పటంలో ఆంధ్రప్రదేశ్‌ను, తెలంగాణను వేరుగా చూపిస్తారు.
6, 7, 8 తరగతుల్లో తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, పరిసర రాష్ట్రాలు, వాటితో సంబంధాలపై పాఠాలు ఉండనున్నాయి. నదులు, ఉపనదులు, చెరువులు, పంటలకు ప్రధాన సాగునీటి ఆధారాలు, ఒకప్పటి చెరువులు, వాటి ప్రాధాన్యం, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయపై చోటు కల్పిస్తున్నట్లు తెలిసింది.
తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ అవ తరణకు ముందు.. తరువాత అంశాలు, ఉద్యమంలో కేసీఆర్, టీఆర్‌ఎస్ పాత్రపై పాఠ్యాంశాలు, నిజాం పాలన, రజాకార్లు, నాటి పరిస్థితులపైనా పాఠాలు ఉంటాయి. అలాగే పెద్ద మనుషుల ఒప్పందం, సాయుధ పోరాట యోధులు, వారి చరిత్ర, ప్రత్యేక తెలంగాణ పోరాటానికి దారి తీసిన పరిస్థితులను పాఠ్యాంశాలుగా చేర్చుతున్నారు.
తెలంగాణ వైతాళికులైన ప్రొఫెసర్ జయశంకర్, చాకలి ఐలమ్మ, కొమురం భీం, కొండా లక్ష్మణ్‌బాపూజీ తదితరుల జీవిత చరిత్ర, తెలంగాణ రాష్ట్రం కోసం వారి కృషిపైనా పాఠ్యాంశాలు ఉంటాయని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement