ప్రతీకాత్మక చిత్రం
నల్లగొండ : అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఎంతోకాలంగా ఊరిస్తూ వస్తోన్న అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. జిల్లాలోని 31 మండలాల్లో 2,093 అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 205 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ ప్రకటించింది. అంగన్‌వాడీ కేంద్రాల హేతుబద్ధీకరణ తర్వాత ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. హేతుబద్ధీకరణకు ముందు కేంద్రాల్లో ఖాళీలు 227 ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 205కు తగ్గింది. జిల్లాలోని తొమ్మిది ప్రాజెక్టుల్లోని పోస్టులకు కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. ఈ పోస్టుల్లో అంగన్ వాడీ టీచర్లు 48, ఆయాలు 125, మినీ అంగన్‌వాడీ టీచర్లు 32 పోస్టులు ఉన్నాయి.
పోటాపోటీ...
ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లకు రూ.10, 500, ఆయాలకు రూ.7,300 వరకు వేతనాలు పెంచింది. ఓ వైపు వేతనాలు పెరగడం, చాలా సంవత్సరాల తర్వాత ఖాళీలు భర్తీ చేస్తుండడంతో అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగానే ఉండనుంది. నియామకాల విషయంలో రాజకీయ జోక్యం లేకుండా చేసేందుకు ఆన్‌లైన్ విధానాన్ని ఎంపిక చేసింది. నియామకాలకు సంబంధించిన నిబంధనలు కూడా మార్పు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి స్త్రీ, శిశు సంక్షేమ అధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఆర్డీఓ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. పాత కమిటీలో ఎమ్మెల్యేలకు స్థానం కల్పించి, ఇంటర్వూలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు ఇంటర్వూల్లేవు. కేవలం పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు...
దరఖాస్తుల ప్రక్రియ ఆన్‌లైన్‌లో చేపట్టనున్నారు. wdcw.tg.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 24 నుంచి 30 వరకు దరఖాస్తుదారులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ప్రాజెక్టు కార్యాలయాల్లో స్క్రూట్నీ చేయించుకోవాలి. లేదంటే వారి దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరు. సర్టిఫికెట్స్‌తో పాటు ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, జాబ్‌కార్డు కూడా తీసుకురావాలి. దరఖాస్తు స్వీకరణ గడువు ముగిశాక అర్హులైన అభ్యర్థుల మెరిట్ జాబితాను ఆన్‌లైన్‌లో తెలియజేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన ప్రొ ఫార్మాను, అర్హత సర్టిఫికెట్లను సీడీపీఓ కార్యాలయంలో సమర్పించాలి.
అర్హతలు..
- అభ్యర్థి తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణురాలై ఉండాలి.
- జనరల్ కేటగిరిలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన నాటికి 21 సంవత్సరాలు వయసు నిండి 35 ఏళ్లు మించరాదు.
- అభ్యర్ధి తప్సనిసరిగా వివాహితురాలై ఉండాలి.
- స్థానికంగా ఆ గ్రామ పంచాయతీలో నివసిస్తూ ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ కేటాయించిన అంగన్ వాడీ కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18–35 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
- ఎస్సీకి కేటాయించిన అంగన్‌వాడీ కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి చెందిన వారై ఉండాలి.
- ఎస్టీకి కేటాయించిన అంగన్ వాడీ కేంద్రాలకు అదే ఆవాస ప్రాంతానికి చెందిన అభ్యర్థులై ఉండాలి.
వికలాంగులు :
- వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు అర్హులు.
- అంధత్వం ఉన్నప్పటికీ ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు.
- కాళ్లు, చేతులకు సంబంధించిన అంగవైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాథమిక విద్య నేర్పుటకు గానీ, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలి.
జత చేయాల్సిన పత్రాలు..
- పుట్టిన తేదీ / వయసు ధ్రువీకరణ పత్రం.
- కుల ధ్రువీకరణ పత్రం
- విద్యార్హత ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల జాబితా.
- నివాస స్థల ధ్రువీకరణ పత్రం
- అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి ధ్రువీకరణ పత్రం
- వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
- అనాథ అయితే అనాథ సర్టిఫికెట్
- వికలాంగులు అయితే సంబంధించిన సర్టిఫికెట్
- దరఖాస్తుతో పాటు ధ్రువీకరణ పత్రాలు గెజిటెడ్ అధికారి అటిస్టేషన్‌తో ఆన్‌లైన్ లింక్ ద్వారా సమర్పించాలి.
జిల్లాలో అంగన్ వాడీ పోస్టుల ఖాళీల వివరాలు..
ప్రాజెక్టుపేరు అంగన్‌వాడీ అంగన్‌వాడీ మినీఅంగన్‌వాడీ
టీచర్లు ఆయాలు టీచర్లు
అనుముల 9 19 13
చింతపల్లి 3 9 0
నకిరేకల్ 2 6 0
దేవరకొండ 6 13 0
కొండమల్లేపల్లి 12 17 4
మునుగోడు 3 16 1
దామరచర్ల 5 16 12
నల్లగొండ 6 21 2
మిర్యాలగూడ 2 8 0
మొత్తం 48 125 32
Comments
Please login to add a commentAdd a comment