
సభ సజావుగా సాగేలా సహకరించాలి
టీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి
గద్వాల: అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలు, అభివృద్ధి చర్చలకు వేదికయ్యేలా సభ్యులందరూ సహకరించాలని స్పీకర్ మధుసూదనాచారి కోరారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు నెలాఖరు వరకు కొనసాగుతాయని చెప్పారు. ఈ సమావేశాల్లో సభ్యులందరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలే ప్రధానంగా చర్చించి, గతంలో జరిగిన సమావేశాలకు భిన్నంగా ప్రజలు మెచ్చుకునేలా సభ్యులందరూ సహరించాలని ఆయన సూచించారు.
అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సహకరిస్తే సమయం వృథా కాకుండా అన్ని అంశాలు చర్చించే అవకాశం వస్తుందన్నారు. ఎన్నిరోజుల పాటు సమావేశాలు జరిగాయన్నది కాదని, ఎన్నిగంటల పాటు సమావేశాలు ఫలవంతంగా సాగాయన్నది ముఖ్యమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తమకు న్యాయం జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ప్రజాభిప్రాయాలకు అసెంబ్లీ వేదిక య్యేలా సహకరించాలని ఆయన కోరారు. మీడియా స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగదని, ఇందులో అపోహలు పెట్టుకోవద్దని స్పీకర్ స్పష్టం చేశారు.