
యాచారం: గ్రామాల్లో క్షేత్రస్థాయి అధ్యయనంలో భాగంగా పలు రాష్ట్రాలకు చెందిన ఐపీఏస్, ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు ఆదివారం మండలంలోని గునుగల్ గ్రామానికి చేరుకున్నారు. సౌమ్యామిశ్రా ఐపీఎస్ (ఉత్తరప్రదేశ్), అమిత్‌కుమార్ ఐపీఎస్ (ఉత్తరప్రదేశ్), ఎం.శాలిని ఐఆర్‌ఎస్ (పాండిచ్చేరి), అజయ్‌సింగ్ ఐపీఎస్ (మధ్యప్రదేశ్), సంగీత మహల ఐఎఫ్‌ఎస్ (రాజస్తాన్) అధికారులు అధ్యయనంలో భాగంగా తొలుత గడ్డమల్లయ్యగూడ గ్రామంలో పర్యటించనున్నారు.
ప్రతీ ఇంటికి తిరిగి వ్యక్తిగత మరుగుదొడ్లు, అక్షరాస్యత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటారు. మండల కేంద్రంలో పీఏసీఏస్ కార్యాలయ పనితీరు, ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అందే వైద్య సేవలు, వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి రైతులకు అందే సూచనలు, సలహాలు, మండల పరిషత్, రెవె న్యూ కార్యాలయాల పనితీరుపై అధ్యయనం చేస్తారు. గ్రామంలోని ఆదర్శ పాఠశాల భవనంలో వీరందరూ ఈ నెల 12 వరకు బస చేయనున్నారు. ఆదివారం ఈవోపీఆర్డీ శంకర్‌నాయక్, గడ్డమల్లయ్యగూడ సర్పంచ్ మల్లేశ్‌లతో కలసి గడ్డమల్లయ్యగూడ, గునుగల్ గ్రామాలను సందర్శించి వివరాలను తెలుసుకున్నారు.
ట్రైనీ ఐఏఎస్‌లకు శిక్షణ
భూదాన్‌పోచంపల్లి: సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలోని స్వామి రామానం దతీర్థ గ్రామీణ సంస్థలో ఆలిండియా సర్వీసెస్ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో 10 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులకు ఆదివారం శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ అనితా రామచంద్రన్, జాయింట్ కలెక్టర్ రవినాయక్ పాల్గొని మాట్లాడారు.