సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సాంకేతికతంగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సౌకర్యాలు, వసతులను ఉపయోగించుకుని అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అడవుల పరిరక్షణతో పాటు హరితహారంలో భాగంగా పచ్చదనం గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో, ఆయా లక్ష్యాలను మరింత సమర్థవంతంగా సాధించేందుకు వీలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని అటవీశాఖ భావిస్తోంది. ఈ పరిజ్ఞానాన్ని అడవుల రక్షణకు ఎలా వినియోగించాలన్న దానిపై దృష్టి పెట్టింది. అడవుల్లో ఆక్రమణలు, అగ్ని ప్రమాదాలను గుర్తించి సాధ్యమైనంత త్వరగా సమాచారం తెలుసుకోవడం ద్వారా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లకుండా నివారణకు ఇదివరకే నేషనల్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) తో అటవీశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఎస్‌ఏతో పాటు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా సహకారం కూడా తీసుకుని వివిధ సాంకేతికతల సాయంతో మరింత సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు చేపడుతోంది. శాటిలైట్ ఛాయాచిత్రాల ద్వారా అడవుల్లోని వాస్తవ పరిస్థితులను తెలుసుకుని, తదనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇటీవలే తెలంగాణ ఫారెస్ట్ ప్రొటెక్షన్ టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ కూడా భేటీ అయి సాంకేతికను ఏయే పద్ధతుల్లో ఉపయోగించాలన్న దానిపై చర్చించింది.
హరితహారానికి చేదోడు వాదోడు..
హరితహారం కార్యక్రమంలో ఈ ఏడాది వంద కోట్ల మొక్కలు పెంచేందుకు వీలుగా కొత్తగా మరిన్ని ఖాళీ ప్రదేశాలు, ప్రాంతాల గుర్తింపునకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. దీనిలో భాగంగా నాటుతున్న మొక్కలు, ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేయనున్నారు. ఆ తర్వాత ఆయా ప్రాంతాలను సాంకేతికత పరిజ్ఞానం సాయంతోనే ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా అడవుల లోపల, పరిసర ప్రాంతాల్లోనూ చెట్ల నరికివేత, అటవీ ప్రాంతాలను చదును చేయటం తదితర మార్పులను పసిగట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. అడవుల్లో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే శాటిలైట్ల ద్వారా వెంటనే గుర్తించి, దీనికి సంబంధించిన క్షేత్ర స్థాయి అటవీ సిబ్బందిని అప్రమత్తం చేసే సాంకేతికతను కూడా అటవీ శాఖ ఇప్పటికే ఉపయోగిస్తోంది. ఎన్‌ఆర్‌ఎస్‌ఏ సహకారంతో అడవుల్లో తరచుగా అగ్నిప్రమాదాలు జరిగేందుకు అవకాశమున్న ప్రాంతాలను గుర్తించింది. ఆయా ప్రాంతాల్లోని అటవీ సిబ్బంది, అడవుల సంరక్షణలో పాలుపంచుకుంటున్న వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన సెల్‌ఫోన్లకు అగ్నిప్రమాదాలు, ఇతరత్రా ఘటనలకు సంబంధించి ఎన్‌ఆర్‌ఎస్‌ఏ నుంచి వచ్చే అలర్ట్స్‌ను పంపించే ఏర్పాట్లు కూడా చేసింది.
టైగర్ రిజర్వ్‌ల్లో డ్రోన్లు..
రాష్ట్రంలో వన్యప్రాణుల వేటతో పాటు, పులులను లక్ష్యంగా చేసుకుని జరుపుతున్న దాడుల ఘటనలు వెలుగులోకి రావడంతో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అటవీశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ల్లో డ్రోన్ కెమెరాలు వినియోగించాలని యోచిస్తోంది. ఇటీవల హైకోర్టు కూడా అడవుల సంరక్షణపై పలు సూచనలు చేయడంతో రక్షణ చర్యలకు సంబంధించి అత్యాధునిక సాంకేతికత ను ఉపయోగించేందుకు సిద్ధమవుతోంది. మధ్యప్రదేశ్‌లోని కన్హా జాతీయ పార్కులోని టైగర్ రిజర్వ్‌లో డ్రోన్ కెమెరాల ద్వారా పులుల పర్యవేక్షణ జరుపుతున్న విధంగా ఇక్కడ కూడా చర్యలు చేపట్టాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ ఫారెస్టుల్లో డ్రోన్ల సేవలు ఉపయోగించుకోవడానికి ఉన్న అవకాశాలు పరిశీలించేందుకు ఎన్‌ఆర్‌ఎస్‌ఏ సేవలను తీసుకోనున్నట్టు సమాచారం. డ్రో న్ల వినియోగంపై అధ్యయనం చేసేందుకు కన్హా జాతీయ పార్కుకు ఒక అధ్యయన బృందాన్ని పంపాలనే యోచనలో అటవీశాఖ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment