
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానంతో అడవుల పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్లు పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్.ఝా తెలిపారు. ఇందులో భాగంగా టెక్నాలజీ ద్వారా అడవుల ఆక్రమణలు, అగ్ని ప్రమాదాలను గుర్తించి సమాచారం అందించేందుకు ఇప్పటికే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో అటవీ శాఖ ఒప్పందం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అరణ్య భవన్‌లో శుక్రవారం జరిగిన తెలంగాణ ఫారెస్ట్ ప్రొటెక్షన్ టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో అడవుల సంరక్షణలో టెక్నాలజీని మరింత సమర్థవంతంగా ఎలా వినియోగించాలన్న దానిపై అధికారులతో చర్చించారు. ఈసందర్భంగా పీసీసీఎఫ్(విజిలెన్స్) రఘువీర్ మాట్లాడుతూ.. అడవుల సంరక్షణకు సరిహద్దుల గుర్తింపు, వాటి చుట్టూ 8 వేల కిలోమీటర్ల మేర కందకాలు తవ్వటం (సీపీటీ– క్యాటిల్ ప్రూఫ్ ట్రెంచెస్) గట్లపై రక్షణకు గచ్చకాయ మొక్కలు నాటుతున్నట్టు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల పర్యావరణం, అడవులపై ఒత్తిడి పెరుగుతున్నందున వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ జనరల్ దేవేంద్ర పాండే పేర్కొన్నారు.
ఖాళీ ప్రదేశాల గుర్తింపు...
హరితహారం లక్ష్యం ఈ ఏడాది వంద కోట్ల మొక్కలకు పెరగటంతో కొత్తగా మరిన్ని ఖాళీ ప్రదేశాలను గుర్తించేందుకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ వాడాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఐ.జీ ఏకే మొహంతీ, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ౖఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సీటీ సైంటిస్ట్ రవి శంకర్ రెడ్డితో పాటు పీసీసీఎఫ్ పీ.కే.ఝా, రఘువీర్, అదనపు పీసీసీఎఫ్ లు లోకేష్ జైశ్వాల్, శోభ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment