సాక్షి, హైదరాబాద్: ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఇకపై ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ (ఈడీసీ)తో నియోజకవర్గంలోని ఏ పోలింగ్ కేంద్రం నుంచైనా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం పొందనున్నారు. ఓటు కలిగి ఉన్న నియోజకవర్గంలోనే ఎన్నికల విధులు నిర్వహించేవారికి ఈ సర్టిఫికెట్ జారీ చేస్తారు. వారు ఆ నియోజకవర్గంలోని ఏ పోలింగ్ కేంద్రంలోనైనా ఓటేసే అవకాశం పొందనున్నారు. ఏప్రిల్ 11న రాష్ట్రంలో జరగనున్న లోక్‌సభ సాధారణ ఎన్నికల నిర్వహణ విధుల్లో పాలుపంచుకోనున్న 2.8 లక్షల మంది అధికారులు, సిబ్బందిలో అధిక శాతం ఈడీసీ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే సదుపాయాన్ని పొందబోతున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ తెలిపారు.
ఓటు ఉన్న నియోజకవర్గం కాకుండా వేరే ప్రాంతంలో పనిచేసే ఎన్నికల అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఈడీసీ, పోస్టల్ బ్యాలెట్ల జారీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ‘పీబీ సాఫ్ట్’అనే సాఫ్ట్‌వేర్ రూపొందించామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న వారందరూ వారికి సంబంధించిన 12/12ఏ ఫారంను తప్పుల్లేకుండా నింపి, ఎన్నికల విధి నిర్వహణ వివరాలను జతపరిచి వారం రోజుల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్‌ను కలవాలని సీఈవో సూచించారు. ఈ పత్రాల ఆధారంగా అందరూ శిక్షణ కార్యక్రమాలకు హజరు కావొచ్చని తెలిపారు.
సహాయక సిబ్బందికి సైతం..
లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులుగా దాదాపు 1.8 లక్షల మందికి ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. వెబ్ కాస్టర్లు, వీడియోగ్రాఫర్లు, డ్రైవర్లు, క్లీనర్లు ఇలా మరో లక్ష మందికి పైగా ఎన్నికల విధుల్లో ఉంటారు. వీరందరికి కూడా ఈడీసీ/ పోస్టల్ బ్యాలెట్ ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసే సదుపాయం కల్పించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment