
ఓల్డ్ మల్లేపల్లిలో జంట హత్యలు
- హతుల్లో యువకుడు, యువతి
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణం
నాంపల్లి, న్యూస్‌లైన్: అనుమానాస్పదస్థితిలో యువకుడు, యువతి దారుణహత్యకు గురయ్యారు. స్థానికంగా కలకలం రేపిన ఈ జంట హత్యలు హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. హబీబ్‌నగర్ ఓల్డ్ మల్లేపల్లికి చెందిన పి.నాగేశ్వరరావు (ఇ.నం.11-1-962/ఎ)కు ఆరు పోర్షన్ల ఇల్లు ఉంది. ఇందులో ఒక పోర్షన్‌లో శ్రీకాకుళానికి చెందిన కుమార్(28) అనే యువకుడు పది నెలలుగా అద్దెకుంటున్నాడు.
అబిడ్స్‌లోని బృందావనం లాడ్జిలో కార్మికుడిగా పని చేసే ఇతడు ఉదయాన్నే పనికి వెళ్లి.. అర్ధరాత్రి ఇంటికి చేరుకునేవాడు. గత ఐదు రోజులుగా ఇతడి పోర్షన్‌కు తాళం వేసి ఉంది. దీంతో కుమార్ ఊరెళ్లి ఉండవచ్చని ఇంటి యజమాని భావించాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు కుమార్ ఉంటున్న గదిలోంచి దుర్వాసన రావడంతో యజమాని తాళం తెరిచి చూడగా కుమార్ మృతి చెంది ఉన్నాడు.
దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి గొంతును కత్తితో కోసిన గుర్తులుండగా.. తలపై బలమైన గాయాలున్నాయి. అతడి మృతదేహం పక్కనే ఉన్న గోనె సంచిని తెరిచి చూడగా 28-30 ఏళ్ల వయసున్న మహిళ మృతదేహం బయటపడింది. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు.
ఈ హత్యలు ఐదు రోజుల క్రితమే జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇంటి యజమాని పి.నాగేశ్వరరావుతో పాటు మరికొందరిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. కుమార్ గదిలో లభ్యమైన మహిళ మృతదేహం ఎవరనేది తెలియరాలేదు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగి ఉంటాయని అనుమానిస్తున్నామని గోషామహాల్ ఏసీపీ రాంభూపాల్‌రావు పేర్కొన్నారు.
క్లూస్‌టీమ్ పరిశీలన..
జంట హత్యలు జరిగిన గదిని క్లూస్ టీమ్ పరిశీలించి కొన్ని వేలి ముద్రలను సేకరించింది. గదిలో ఖాళీ మద్యం సీసాలు లభించాయి. హత్య జరిగిన రోజు ఇద్దరే కాకుండా ఇంకా ఇతరులెవరైనా ఉన్నారా..? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరి చిరునామా లభించగా, మహిళ చిరునామా లభించాల్సి ఉందని ఏసీపీ తెలిపారు.