మెట్రో ఎటో? | On the underground Metro | Sakshi
Sakshi News home page

మెట్రో ఎటో?

Published Tue, Jun 17 2014 2:19 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

మెట్రో ఎటో? - Sakshi

మెట్రో ఎటో?

  •      తెరపైకి భూగర్భ మెట్రో
  •      సీఎం ఆదేశాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు
  •      చారిత్రక కట్టడాలను రక్షించాలంటున్న ‘హెరిటేజ్’ ప్రతినిధులు
  •      భూగర్భ మార్గమైతే రూ.3 వేల కోట్లు పెరగనున్న అంచనా వ్యయం
  • సాక్షి, సిటీబ్యూరో : నగరంలో ఎలివేటేడ్ మెట్రో రైలు మార్గం డోలాయమానంలో పడింది. ఈ మార్గాన్ని చారిత్రక ప్రదేశాల వద్ద భూగర్భం నుంచి వేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేయడంతో అధికార యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా కారిడార్-1 పరిధిలోని ఎల్బీనగర్-మియాపూర్, కారిడార్-2 పరిధిలోని జేబీఎస్-ఫలక్‌నుమా రూట్లలో నిపుణుల ఆధ్వర్యంలో త్వరలో ప్రత్యేకంగా పరిశీలన చేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

    ముఖ్యంగా సుల్తాన్‌బజార్, బడీచౌడి, మొజాంజాహి మార్కెట్, గన్‌పార్క్, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ మెట్రో నిర్మాణం చేపడితే నిర్మాణవ్యయం అదనంగా రూ.మూడు వేల కోట్ల మేర పెరగనుందని తాజాగా అంచనాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పిల్లర్ల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో నిర్మాణ సంస్థకు జరిగే నష్టాన్ని  సైతం అధికారులు నివేదికలో పొందుపరుస్తున్నట్లు తెలిసింది.
     
    రూ.మూడువేల కోట్లు పెరగనున్న నిర్మాణ వ్యయం..?
     
    ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా, నాగోల్-శిల్పారామం రూట్లలో మొత్తం 72 కిలోమీటర్ల మేర జరగనున్న మెట్రో పనులను రూ.14,132 కోట్ల అంచనా వ్యయంతో ఎల్‌అండ్‌టీ సంస్థ 2011లో చేపట్టిన విషయం విదితమే. అయితే ఏకంగా మూడు కారిడార్ల పరిధిలో సుమారు పది కిలోమీటర్ల మార్గంలో భూగర్భ మార్గాన మెట్రో రైల్వే మార్గాన్ని మారిస్తే నిర్మాణ వ్యయం సుమారు రూ.మూడు వేల కోట్ల మేర పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

    ఈ అదనపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా లేదా ఎల్‌అండ్‌టీ భరిస్తుందా అన్నది తేలాల్సి ఉందన్నారు. కాగా 2010 సెప్టెంబరు 4న సదరు సంస్థతో కుదిరిన ఒప్పందంలో ఈ అంశం ప్రస్తావన లేకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారం గందరగోళంగా మారుతుందని చెబుతున్నారు.

    ఇప్పటికే  ఒడిదొడుకులు ఎదుర్కొం టున్న మౌలిక వసతుల కల్పన రంగ సంస్థలు తాజా మార్పులతో బెంబేలెత్తి కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ముం దుకు రావంటున్నారు. కాగా సుల్తాన్‌బజార్ మార్కెట్‌లో మెట్రోరైలు అలైన్‌మెంట్ మార్పు పనులు ప్రారంభించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా సోమవారం మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.
     
     భూగర్భ మెట్రో.. లాభనష్టాలు
     
    సుల్తాన్‌బజార్, బడీచౌడి, మొజాంజాహి మార్కెట్, అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రాంతాల రూపురేఖలు, వాటి చారిత్రక ప్రాధాన్యం దెబ్బతినకుండా ఉంటుంది.
         
     బెంగళూరు, ఢిల్లీ, చెన్నై నగరాల్లో చారిత్రక ప్రదేశాలు, విధానసభల వద్ద భూగర్భ మెట్రో మార్గాలను నిర్మిస్తున్నారని, ఇక్కడా అలాగే భూగర్భ మెట్రో నిర్మించాలని వారసత్వ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు.
         
     నగరంలోని రాతినేలను తొలిచి భూగర్భ మార్గం నిర్మించాలంటే జర్మనీకి చెందిన అత్యంత ఖరీదైన టన్నెల్ బోరింగ్ యంత్రాలు కొనుగోలు చేయాలి.
         
     భూగర్భ మార్గంలో భత్రతా ఏర్పాట్లు చేయడం చాలా కష్టం. నిర్మాణ సమయంలో పెద్ద బండరాళ్లు కూలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
         
     నగరంపై ఉగ్రవాద పడగనీడ ఉన్న నేపథ్యంలో మెట్రో ఆస్తులు, ప్రయాణికుల రక్షణ కత్తిమీద సాములా మారుతుంది.
         
     నిర్మాణ వ్యయం ప్రతి కిలోమీటరుకు రూ.450 నుంచి రూ.500 కోట్ల వరకు చేరుకోనుంది.
         
     భూగర్భంలో పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టాల్సి ఉన్నందున అధికంగా ఆస్తులను సేకరించాల్సి ఉంటుంది. వీటి పరిహారం, బాధితులకు పునరావాసం క ల్పించడం సవాలుగా మారనుంది.
         
     స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం కంటే విదేశీ పరిజ్ఞానంపైనే ఆధార పడాల్సి ఉంటుంది.
         
     నగరం నడిబొడ్డు నుంచి మెట్రో మార్గం వెళ్లనున్న నేపథ్యంలో నిజాం కాలం నాటి డ్రైనేజి లైన్లు బయటపడే అవకాశ ం ఉంది. ఇప్పటికే పబ్లిక్‌గార్డెన్, నాంపల్లి మార్గంలో పురాతన వరదనీటి కాల్వ బయల్పడిన విషయం విదితమే. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాణ పనులు త్వరితంగా ముందుకు సాగడం కష్టసాధ్యమౌతుంది.
         
     మూడు కారిడార్లలో 72 కి.మీ. మెట్రో కారి డార్ పనులు 2017 జనవరి నాటికి పూర్తికావాల్సి ఉండగా.. భూగర్భ మార్గం మీదుగా చేపడితే ఐదేళ్లు ఆలస్యంగా పనులు పూర్తవుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
     
    రాతి నేలలో భూగర్భ మెట్రో సాధ్యమేనా..?
    దక్కన్ పీఠభూమిలో ఉన్న హైదరాబాద్ నగరంలో భూమి నుంచి ఐదు మీటర్ల లోతునకు తవ్వకాలు జరిపితే కఠినమైన రాతినేల ఉంటుందని భూభౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భూగర్భ మెట్రో నిర్మాణం అనే క వ్యయప్రయాసలతో కూడినదని స్పష్టం చేస్తున్నారు. రాతినేలను తొలిచేందుకు బ్లాస్టింగ్ (పేలుడు పదార్థాలతో బండరాళ్లను పేల్చడం) ప్రక్రియ చేపట్టడం నగరంలో వీలు కాదని అభిప్రాయపడుతున్నారు.
     
     ఎలివేటెడ్ మెట్రో.. లాభనష్టాలు
     ఆకాశమార్గం మీదుగా ఎలివేటెడ్ మార్గం నిర్మిస్తే రక్షణ, భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టే వీలుంటుంది.
         
     నిర్మాణ వ్యయం కి.మీ.కి రూ.200 కోట్లే.
         
     స్వదేశీ పరిజ్ఞానం వినియోగించుకోవచ్చు.
         
     ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పిల్లర్ల నిర్మాణం పూర్తయినందున సెగ్మెంట్ల ఏర్పాటు, రైల్వే ట్రాక్, స్టేషన్ల నిర్మాణం పనుల్లో అంతరాయం లేకుండా చూడవచ్చు.
         
     మెట్రో కారిడార్‌లలో ఆస్తుల సేకరణ పరిమితంగానే ఉంటుంది. ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తయిన విషయం విదితమే.
         
     చారిత్రక కట్టడాలున్న ప్రాంతాల్లో ఎలివేటెడ్ మార్గం కారణంగా ఆయా ప్రాం తాల చారిత్రక ప్రాధాన్యం, రూపురేఖలు మారతాయని హెరిటేజ్ పరిరక్షణ కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
     
     చరిత్ర, వారసత్వాన్ని పరిరక్షించుకోవాల్సిందే
     నగర చరిత్ర, వారసత్వం, సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఎలివేటెడ్ మెట్రో మార్గం వల్ల తెలంగాణ అమరవీరుల స్థూపం కూడా ఉనికి కోల్పోయే ప్రమాదం ఉండటం దురదృష్టకరం. ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి.
     - అనురాధ, ఇన్‌టాక్ కన్వీనర్  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement