ఒక్క రోజే 25 లక్షల మొక్కలు
♦ జూలై 11న హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం
♦ నగర ప్రజలందరినీ భాగస్వాములను చేస్తాం
♦ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జూలై 11న ఒక్క రోజే 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ సైతం సహాయ ఏజెన్సీగా పాలుపంచుకుంటుందని తెలిపారు. హరితహారం కార్యక్రమం ద్వారా ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని వివరించారు. రంగారెడ్డి, మెదక్ కలెక్టర్లతో పాటు పోలీసు, మున్సిపల్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ తదితర శాఖలతో బుధవారం మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.
ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో హరితహారం కార్యక్రమం విజయవంతం అవుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు ఉత్తరప్రదేశ్‌లో 10 లక్షల మొక్కలు నాటిన కార్యక్రమం రికార్డులకు ఎక్కిందని, నగర ప్రజలు, సంస్థలు, ప్రభుత్వం కలసి సరికొత్త రికార్డు నెలకొల్పుతారన్న నమ్మకాన్ని మంత్రి వ్యక్తం చేశారు. నగరంలో గ్రీన్ కవర్‌ను పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని, నగరంలోని ప్రతి ఒక్క పౌరుడు ఇందుకు కలసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, విద్యార్థులు ఇలా సమాజంలో ప్రతి వర్గాన్ని భాగస్వాములను చేస్తామన్నారు. నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రెండున్నర లక్షల మొక్కలు నాటుతామన్నారు.
ఈ కార్యక్రమానికి జూన్ నెలలో గుంతలు తీసే పని మొదలు పెట్టాలని, ఇందుకు అవసరమైన సిబ్బందిని ముందే గుర్తించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వవిద్యాలయాలు, పారిశ్రామికవాడలు, చర్చ్‌లు, దేవాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో చెట్లు నాటిస్తామన్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటి నుంచే వారితో చర్చలు మొదలు పెట్టి చైతన్య పరచాలని సూచించారు. మెట్రో రైలు నిర్మాణం పూర్తయిన ప్రతి చోటా మొక్కలు నాటాలని మైట్రో రైలు సంస్థ అధికారులను మంత్రి ఆదేశించారు.