ఉల్లి..సెపరేటు
ఉల్లి విక్రయాల్లో మార్కెట్ వర్గాలు మాయజాలం సృష్టిస్తున్నాయి. హోల్‌సేల్, రిటైల్‌కు పొంతనే లేకుండా అమ్మకాలు సాగిస్తున్నాయి. ఇది చాలదన్నట్లు గ్రేడింప్ పేరిట వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. గ్రేడ్ టూ రకంలోని కొంత పెద్దసైజు ఉల్లిని వేరు చేసి గ్రేడ్ వన్ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
సాక్షి, సిటీబ్యూరో : ఉల్లి.. కొనుగోలు చేయకముందే వినియోగదారుడిని కన్నీరు పెట్టిస్తోంది. హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లికి మద్ధతు ధర కేజీ రూ.22 పలకగా, అది రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి కేజీ రూ.40 చేరుతోంది. అయితే... కిరాణా షాపుల్లో, మాల్స్‌లో విక్రయిస్తోంది చాలావరకు రెండో రకం ఉల్లే. హోల్‌సేల్ మార్కెట్లో దీని ధర కేజీ రూ.22 మాత్రమే. దీన్నే రూ. 40 విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ లాభం సరిపోదన్నట్లు గ్రేడ్-1 రకం ఉల్లిలో గ్రేడ్-2ను కలపడం, లేదా రెండో రకంలో ని పెద్ద సైజు ఉల్లిని మొదటి రకం కింద విక్రయించి మోసం చేస్తున్నారు. కొనుగోలు చేసిన రెండు మూడు రోజుల్లోనే వీటిలో సగం వరకు డ్యామేజ్ అవుతున్నాయి. ఇక తోపుడు బండ్ల వ్యాపారులు మరో అడుగు ముందుకేసి హోల్‌సేల్ మార్కెట్లో గ్రేడ్-2 ఉల్లిని క్వింటాల్ రూ.1800 ప్రకారం కొనుగోలు, వాటిని గ్రేడింగ్ చేసి రెండు రకాల ధరల్లో విక్రయిస్తున్నారు. కాస్త పెద్దసైజ్‌లో ఉన్న ఉల్లిని కేజీ రూ.35-40 అమ్ముతుండగా, చిన్నసైజ్ ఉల్లిని కేజీ రూ.25-30 వరకు అంటగడుతున్నారు.
మార్కెట్లో ఉల్లికున్న కొరతను సొమ్ము చేసుకునేందుకు ఇష్టారీతిన ధరలు నిర్ణయిస్తున్నారు. రైతు బ జార్లలో ఉల్లి అందుబాటులో పెడితే ధరలు కొంత అదుపులో ఉంటాయని అధికారులు భావించారు. అయితే... ఇవి ఏ మూలకూ సరిపోని పరిస్థితి ఎదురైంది. ఉల్లి ధరలు తగ్గకపోగా మరింత పైపైకి ఎగబాకుతుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. దీనికితోడు వర్షాల కారణంగా మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి నిలిపివేశారనిపుకార్లు వ్యాపించడంతో ఇక్కడి వ్యాపారులు ధరలు ఇంకా పెంచేస్తున్నారు.
దిగుమతి అరకొరే
నగర అవసరాలకు తగినంత సరుకు దిగుమతి చేసుకునే విషయంలో మార్కెటింగ్ శాఖ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. రోజూ వారీ అవసరాల్లో నాలుగో వంతు మాత్రమే దిగుమతి అవుతోంది. శనివారం హోల్‌సేల్ మార్కెట్‌కు మొత్తం 8వేల క్వింటాళ్ల ఉల్లి దిగుమతి అయింది. ఇందులో గ్రేడ్-1 రకం ఉల్లి క్వింటాల్ రూ.2200, గ్రేడ్-2 రకం రూ.1800, గ్రేడ్-3 రకం ఉల్లికి రూ.1300 కనీస మద్దతు ధర పలికింది.
ఈ ప్రకారం చూస్తే మొదటి రకం ఉల్లి కేజీ రూ.22, రెండో రకం రూ.18, మూడో రకం కేజీ రూ.13 ధర నిర్ణయించారన్న మాట. అయితే... వీటికి రవాణా, హమాలీ, లాభం వంటివి కలుపుకొని హోల్‌సేల్ ధరకంటే మరో రూ.4-5 కలుపుకొని అమ్మాలి. కానీ వ్యాపారులు మాత్రం గ్రేడ్-1 ఉల్లిని కేజీ రూ.35-40, గ్రేడ్-2 రకాన్ని రూ.30-34, గ్రేడ్-3 రకం ఉల్లిని రూ.20 ప్రకారం అమ్ముతున్నారు.
నిల్వలపై నిర్లక్ష్యం
మార్కెట్లో మరింత కొరతను సృష్టించి ధరలను పెంచి సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు పెద్దమొత్తంలో ఉల్లిని నిల్వ చేసినట్లు సమాచారం. వీటిపై మార్కెటింగ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వ్యాపారులతో అధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ధరలు దిగివస్తాయని మార్కెటింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.