డిగ్రీ ప్రవేశాల్లో ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌  | Online reporting in degree entries | Sakshi
Sakshi News home page

డిగ్రీ ప్రవేశాల్లో ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌ 

Published Tue, May 7 2019 2:14 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Online reporting in degree entries - Sakshi

దోస్త్‌ సమావేశంలో పాల్గొన్న జనార్దన్‌రెడ్డి, పాపిరెడ్డి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులకు సులభంగా ఉండే ప్రవేశాల విధానానికి డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్‌) శ్రీకారం చుట్టింది. పలు కొత్త విధానాలను రానున్న విద్యాసంవత్సరం ప్రవేశాల్లో అమలు చేయాలని నిర్ణయించింది. గత మూడేళ్లు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్‌లైన్‌లో చేపడుతున్నా.. సీట్లు లభించిన విద్యార్థులు మళ్లీ ఫిజికల్‌గా కాలేజీకి వెళ్లి రిపోర్టు చేయడంతో పాటు ఫీజు చెల్లించాల్సి వచ్చేది. అయితే త్వరలో చేపట్టే ప్రవేశాల్లో ఆ విధానానికి çఫుల్‌స్టాప్‌ పెట్టాలని దోస్త్‌ నిర్ణయించింది. సోమవారం సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, వైస్‌చైర్మన్లు ఆర్‌.లింబాద్రి, వెంకటరమణ, కళాశాల విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, వివిధ యూనివర్సిటీల వైస్‌ చాన్స్‌లర్లు, డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలో చేపట్టబోయే డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో తీసుకురావాల్సిన సులభతర విధానాలపై ఉన్నత స్థాయి అధికారుల బృందం చర్చించి నిర్ణయం తీసుకుంది.  

ఇంజనీరింగ్‌ తరహా విధానం.. 
దాదాపు 2.20 లక్షల మంది విద్యార్థులు చేరే డిగ్రీ ప్రవేశాల్లో ఇంజనీరింగ్‌ తరహా ప్రవేశాల విధానం తేవాలని దోస్త్‌ నిర్ణయించింది. సీట్లు లభించే విద్యార్థులకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ అవకాశం కల్పించనుంది. అలాగే విద్యార్థులు కాలేజీలో ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వే అయిన టీ వాలెట్‌ ద్వారా (క్రెడిట్‌కార్డు/డెబిట్‌ కార్డు/ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌) ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. దీంతో మొదటిదశలో సీటొచ్చి కాలేజీల్లో చేరిన విద్యార్థులు రెండవ, మూడో కౌన్సెలింగ్‌ల్లో స్లైడింగ్‌ ద్వారా మరో కాలేజీకి వెళ్లే వీలుంటుంది. ఈ క్రమంలో గతంలోలాగా కాలేజీలు విద్యార్థులను మరో కాలేజీకి వెళ్లకుండా అడ్డుకునే అవకాశముండదు.  

అన్ని దశల కౌన్సెలింగ్‌ల్లో పాల్గొనే చాన్స్‌.. 
గతేడాది ప్రవేశాల్లో మొదటిదశలో సీట్లు లభించిన విద్యార్థులకు రెండో దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశమే ఇవ్వలేదు. కానీ ఈసారి ఎన్ని దశల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే అన్ని దశల్లో పాల్గొని తమకు ఇష్టమై న కాలేజీలో చేరే అవకాశం ఉంటుంది. ఇటు ఆన్‌లైన్‌ ప్రవేశాల సమయంలో విద్యార్థులకు ఎదురయ్యే ప్రతి సమస్యను పాత జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే 10 స్పెషల్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్లలో పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. మార్పులకు సంబంధించి దోస్త్‌ కన్వీనర్‌ స్థాయిలో చేయగలిగే మార్పులను కూడా జిల్లా స్థాయిలో చేసేలా అధికారాలను కల్పించనుంది. అక్కడా పరిష్కరించలేని సమస్యలుంటే జిల్లా స్థాయిలోని స్పెషల్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ కోఆర్డినేటరే ఆ సమస్యను రాష్ట్ర స్థాయిలో కళాశాల విద్యా కమిషనర్‌/దోస్త్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసే హెల్ప్‌లైన్‌ కేంద్రానికి తెలియజేసేలా, సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపడతారు. ఇక ఈసారి విద్యార్థులు మీసేవ కేంద్రం, ఆధార్‌ ఆధారిత మొబైల్‌తో పాటు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసే 76 హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లోనూ ఉచితంగా రిజిస్ట్రేషన్, దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఈ నెల 15న జారీ చేసి, 16 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలని.. జూలై 1 నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది. 

స్లైడింగ్‌లో జాగ్రత్త: దోస్త్‌ కన్వీనర్‌ 
ఒకసారి సీటొచ్చిన విద్యార్థికి తర్వాత స్లైడింగ్‌లో మరో కాలేజీలో సీటొస్తే తాజాగా వచ్చిన సీటే ఉంటుందని, ముందుగా వచ్చిన సీటు ఆటోమేటిగ్గా పోతుందని దోస్త్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి వివరించారు. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని, కాలేజీల ఆప్షన్లు ఇచ్చుకునేప్పుడు ముందుగా సీటొచ్చిన కాలేజీ కంటే మంచి కాలేజీలను ఎంచుకోవాలని, అప్పుడు అందులో సీటొస్తే వస్తుంది.. లేదంటే మొదట వచ్చిన సీటే ఉంటుంది కనుక ఇబ్బంది ఉండదన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement