![Only Few Persons Getting Rythu Bandhu Benefits In Mahabubnagar - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/16/rytu-bandu.jpg.webp?itok=3-DO5Lsv)
సాక్షి, మహబూబ్‌నగర్: రైతులకు ఆర్థిక చేయూత అందించి వ్యవసాయ రంగానికి ఊతం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పెట్టుబడి సాయం నేటికీ చాలామంది రైతులకు అందలేదు. ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు చేరుకున్నా సాయం రాలేదు. పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులు మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో 79,263 మంది ఉన్నారు. తొలి విడతలో మురిపించి.. రెండో విడతలో ఆశలు రేపి.. మూడో విడతకల్లా ఉసూరుమనిపించారని అన్నదాతలు వాపోతున్నారు.
దీనికి తోడు బ్యాంకు రుణాలు మాఫీ కాకపోవడంతో కొత్తవి పొందలేకపోతున్నారు. దీంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం 90శాతం రైతుల ఖాతాల్లో నగదు జమ అయినట్లు తెలుస్తున్నా.. వాస్తవానికి ఆ మేరకు కూడా ఖాతాల్లో డబ్బు జమ అయిన దాఖలాలు కనిపించడం లేదు. ఏ గ్రామానికి వెళ్లినా రైతులు తమ ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ కాలేదని, ఎప్పుడు అవుతుందని అధికారులను అడగడం కనిపిస్తోంది.
అధికారులు ఖాతాల్లో డబ్బు జమ విషయమై ఎప్పటికప్పుడు సరైన సమాచారం ఇస్తే ఇలాంటి గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండదు. గత ఖరీఫ్, రబీ సీజన్లకు గాను ప్రభుత్వం ఒక్కో సీజన్‌లో ఎకరాకు రూ.4వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.8వేల సాయం అందించింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఎకరాకు రూ.5వేలకు పెంచింది.
అంటే రెండు సీజన్లకు కలిపి ఎకరాకు రూ. 10వేల సాయం అందాల్సి ఉంది. 2018 ఖరీఫ్‌లో 2,82,783 మంది రైతులకు రూ.219.67 కోట్లు అందించారు. రబీలో 2,62,612 మంది రైతులకు రూ.307.7 కోట్లు పంపిణీ చేశారు. రైతుబంధు పథకం కింద రెండు సీజన్లకు కలిపి రూ.697.33 కోట్లు కేటాయించినా.. రూ.526.33 కోట్లు మాత్రమే పెట్టుబడి సాయం కింద రైతులు అందించారు.
అందని సాయం...
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో పాలమూరు జిల్లాలో 1,78,012మంది రైతులకు పెట్టుబడి సాయం గా రూ.223.71 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. వ్యవసాయశాఖ అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 1,16,141మంది రైతులకు రూ.135.55 కోట్లు సాయంగా అందించారు. ఇంకా 61,871 మంది రైతులకు రూ.88.16 కోట్ల పెట్టుబడి సాయం అందించాల్సి ఉంది.
నారాయణపేట జిల్లాకు సంబంధించి 1,33,689మంది రైతులకు రూ.207.73కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఇప్పటి వరకు 1,16,297మంది రూ.159.69 కోట్లు పంపిణీ చేశారు. ఇంకా 17,392మంది సంబంధించి రూ.48.04కోట్లు పెండింగ్‌లో ఉంది. దీంతో సదరు రైతులు తమకు డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకునేందుకు నిత్యం కార్యాలయా ల చుట్టూ తిరుగుతున్నారు.
వ్యవసాయ, బ్యాం కు అధికారులను సంప్రదించినా సరైన సమాధానం లభించడం లేదు. ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు చేరుకున్నా తమకు పెట్టుబడి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డబ్బులు రాలేదు
నాకు గ్రామంలో రెండెకరాల భూమి ఉంది. ఖరీఫ్‌లో రైతుబంధు డబ్బులు అందలేదు. అదనులో పంట సాగు చేస్తేనే దిగుబడి బాగా వస్తుంది. డబ్బులు లేక సాగు ఆలస్యమైంది. పెట్టుబడి కోసం వడ్డీకి డబ్బులు తీసుకున్నాను. ఈసారి కొంతమందికే మాత్రమే రైతుబంధు డబ్బులు వచ్చాయి. సర్కార్ త్వరగా డబ్బులు ఖాతాల్లో జమ చేయాలి.
– కేశవులుయాదవ్, రైతు, బోయపల్లి
ప్రభుత్వానికి నివేదించాం
జిల్లాలో అర్హత ఉన్న ప్రతి రైతు వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాం. ఇందులో 1,16,141 మందికి పెట్టుబడి సాయం అందగా మరో 61,871 మంది రైతులకు రావాల్సి ఉంది. రైతుబంధు అందని వారి వివరాలను ప్రభుత్వానికి పంపించాం. త్వరలోనే రైతులకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది.
– సుచరిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment