
బతికినవి సగమే..!
► హరితహారం అభాసుపాలు
► రూ.కోట్లు వృథా
► నాటిన మొక్కలు ఎనిమిది లక్షలు.. బతికి ఉన్నవి నాలుగు లక్షలు
► పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ లోపం
ఆదిలాబాద్: రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ పథకం అమలులో అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా అబాసు పాలవుతోంది. నాటిన మొక్కలకు రక్షణ, నీటి సరఫరా లేకపోవడంతో పూర్తిగా ఎండిపోతున్నాయి. జిల్లాలో రెండో విడత హరితహారం కింద గతేడాది 8.91 లక్షల మొక్కలు నాటారు. ప్రస్తుతం సగానికి పైగా మొక్కలు ఎండిపోయాయి.
నాలుగు లక్షల వరకు మాత్రమే బతికి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రోజురోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతుండడంతో మొక్కలు ఎండిపోవడంతో పాటు పూర్తిస్థాయిలో చనిపోతున్నట్లు తెలుస్తోంది. గతేడాది జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలు, రోడ్ల వెంట, చెరువులు, పొలాల గట్ల వెంట, బీడు భూముల్లో వివిధ రకాల మొక్కలను జిల్లా వ్యాప్తంగా 8 లక్షలకు పైగా నాటారు.
అయితే నాటిన మొక్కలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చాలా వరకు చనిపోతున్నాయి. దీంతో పచ్చదనం కోసం అమలు చేస్తున్న హరితహారం లక్ష్యం నీరుగారుతోంది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేకపోవడంతో ఈ పథకం అబాసుపాలవుతుంది.
ఎండిపోతున్న మొక్కలు..
జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో హరితహారం మొక్కలు జోరుగా నాటారు. నాటిన మొక్కల సంరక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అవి ఎండిపోతున్నాయి. నాటిన మొదట్లో మాత్రమే మొక్కలకు నీళ్లు అందించిన అధికారులు ఆ తర్వాత వాటిని మరిచారు. ప్రస్తుతం జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో మొక్కలు ఎండ వేడిమికి మాడిపోతున్నాయి. కోట్లాది రూపాయాలు వెచ్చించి నాటిన మొక్కలు ఎండిపోవడంతో సర్కారు లక్ష్యం నెరవేరని పరిస్థితి.
ఆదిలాబాద్ పట్టణంలో ప్రధాన కూడళ్లతో పాటు రహదారి వెంట నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. ఇందులో ప్రజాప్రతినిధులు నాటిన మొక్కలకు కూడా రక్షణ లేకుండాపోయాయి. రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలతో పాటు, కాలనీల్లో దారుల వెంట నాటిన మొక్కలు సైతం కనిపించడం లేదు. దీంతో పాటు ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం ఎదుట నాటిన మొక్కలు సైతం కనిపించకుండా పోయాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం మొక్కలు ఎండిపోయాయి. నీళ్లుపోయకపోవడం, రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో పశువులకు అవి ఆహారంగా మారిపోయాయి.
గ్రామీణా ప్రాంతాల్లో అదే దుస్థితి..
గ్రామీణా రహదారుల వెంట, గ్రామాల్లో నాటిన మొక్కలు సైతం కనిపించడం లేదు. గ్రామాల రహదారుల వెంట ఉన్న చెట్ల కిందనే మొక్కలు నాటడంతో వాటి పెరుగుదల ఆగిపోయింది. ఆదిలాబాద్ మండలంలోని జందాపూర్ గ్రామం నుంచి సవర్గాం వరకు నాటి మొక్కలన్నీ చెట్ల కిందనే నాటారు. నీళ్లులేకపోవడంతో పూర్తిగా ఎండిపోయాయి. జైనథ్, బేల మండలాలకు వెళ్లే జాతీయ రహదారి వెంట నాటిన మొక్కల పరిస్థితి కూడా అంతే. కొన్ని గ్రామాల్లో పొలాల వెంట ఉన్న మొక్కలు మాడిపోయాయి.
జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి నుంచి చాందా–టి శివారు వరకు జాతీయ రహదారి పక్కన నాటి మొక్కలు ఇటీవల రోడ్డు విస్తరణ పనుల్లో పూర్తిగా దెబ్బతిన్నాయి. అధికారులు ముందస్తు చూపు లేకపోవడంతో రోడ్డు పనుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో మొక్కలను మట్టితో కప్పివేశారు. దీంతో లక్షల వెచ్చించి నాటినా లక్ష్యం నెరవేరలేదు. మరోసారి మూడో విడతలో దెబ్బతిన్న మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.