టీఆర్‌ఎస్ జిల్లా కమిటీల సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసింది.
పాతకాపులే టీఆర్‌ఎస్ సారథులు జిల్లా అధ్యక్షుడిగా తక్కళ్లపల్లి రవీందర్‌రావు గ్రేటర్ అధ్యక్షుడిగా నన్నపునేని నరేందర్ ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్ ఎన్నికలు రెండు, మూడు రోజుల్లో కార్యవర్గాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : టీఆర్‌ఎస్ జిల్లా కమిటీల సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసింది. వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా తక్కళ్లపల్లి రవీందర్‌రావు, గ్రేటర్ వరంగల్ కమిటీ అధ్యక్షుడిగా నన్నపునేని నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ తాజాగా చేపట్టిన సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు ముందు రద్దు చేసిన పార్టీ కమిటీలకు వీరే అధ్యక్షులుగా వ్యవహరించారు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్స్‌లో గురువారం టీఆర్‌ఎస్ జిల్లా కమిటీల ఎన్నిక ప్రక్రియ జరిగింది. రాష్ట్ర పార్టీ పరిశీలకుడిగా వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఎన్నికలు నిర్వహించారు.
సమావేశానికి ముందు సర్క్యూట్ గెస్ట్ హోస్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు భేటీ అయ్యారు. అధ్యక్షులుగా ఎవరిని నియమించాలనే విషయంపై నాలుగు గంటలు చర్చించారు. మొదట జిల్లా కమిటీ అధ్యక్ష పదవికి, తర్వాత గ్రేటర్ వరంగల్ కమిటీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగింది. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి నామినేషన దాఖలు చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి సభకు వచ్చిన వారిని కోరారు. ఎవరైనా ఒక నాయకుడి పేరును ప్రతిపాదించి, మరొకరు బలపరిచినా సరిపోతుందని సూచించారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీహరి.. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి తక్కళ్లపల్లి రవీందర్‌రావు పేరును ప్రతిపాదించగా.. గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్ బలపరిచారు. ఇంకా ఎవరినైనా ప్రతిపాదించవచ్చని జగదీశ్‌రెడ్డి సూచించారు. నామినేషన్లు, ప్రతిపాదనలు రాలేదు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి రవీందర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జగదీశ్‌రెడ్డి ప్రకటించారు.
గ్రేటర్ ఎన్నిక ఇలా..
గ్రేటర్ వరంగల్ కమిటీ అధ్యక్ష పదవి ఎన్నిక కూడా జిల్లా కమిటీ పద్ధతిలోనే నిర్వహించారు. పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్.. గ్రేటర్ అధ్యక్ష పదవికి నన్నపునేని నరేందర్ పేరు ప్రతిపాదించగా.. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ బలపరిచారు. ఈ పదవికి ఇతరుల పేర్లు ఏవీ ప్రతిపాదనలకు రాలేదు. నరేందర్ గ్రేటర్ టీఆర్‌ఎస్ కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు.
ఇద్దరు కొత్త అధ్యక్షులకు ఉప ముఖ్యమంత్రి శ్రీహరి, మంత్రి చందూలాల్, పార్లమెంటరీ కార్యదర్శి వినయ్‌భాస్కర్, జెడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు టి.రాజయ్య, కొండా సురేఖ, రెడ్యానాయక్, అరూరి రమేశ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బి.శంకర్‌నాయక్, ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వరరెడ్డి పార్టీ ముఖ్యనేతలు అభినందించారు. పార్టీ నాయకులు, శ్రేణులు.. కొత్త అధ్యక్షులను గజమాలతో సత్కరించారు.
మూడు రోజుల్లో కార్యవర్గాలు
టీఆర్‌ఎస్ జిల్లా కమిటీ అధ్యక్ష ఎన్నిక పూర్తయింది. కార్యవర్గాలకు గురువారమే ఎన్నిక జరుగుతుందని టీఆర్‌ఎస్ శ్రేణులు భావించాయి. ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో.. జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలను సంప్రదించి రెండు, మూడు రోజుల్లో కార్యవర్గాలను ప్రకటించాలని నిర్ణయించారు. ఎన్నికల పరిశీలకుడు జి.జగదీశ్‌రెడ్డి ఈ మేరకు కొత్త అధ్యక్షులకు సూచించారు. టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం ఒక్కో కార్యవర్గంలో 33 మంది ఉండనున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్ జిల్లా కమిటీ ఎన్నిక ప్రక్రియకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరు కాలేదు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ధర్మారెడ్డి ఈ కార్యక్రమానికి రాకపోవడంపై సమావేశంలో శ్రేణులు చర్చించుకున్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్ష పదవిని ఆశించిన నాగుర్ల వెంకటేశ్వర్లు కూడా సమావేశానికి రాలేదు.